
గువాహటి : లోక్ సభ ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇవ్వలేదని అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. లఖింపూర్ జిల్లాలోని నౌబోయిచా నియోజకవర్గ ఎమ్మెల్యేగా భరత్ చంద్ర నారా వ్యవహరిస్తున్నారు. తన భార్య, మాజీ ఎంపీ రాణి నారాకు లఖింపూర్ లోక్ సభ అభ్యర్థిగా టికెట్ వస్తుందని ఆశించారు. అయితే, కాంగ్రెస్ మాత్రం టికెట్‌ను ఉదయ్ శంకర్ హజారికాకు కేటాయించింది. దీంతో నిరాశకు గురైన ఆయన.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు.
పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపించారు. భరత్ చంద్ర నారా అస్సాం కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ పదవికి కూడా ఆదివారమే రాజీనామా చేశారు. ఆయన భార్య రాణి నారా లఖింపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఇటీవలే రాణి నారా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. లఖింపూర్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు టికెట్ మాత్రం హజారికాకు లభించింది.