భర్త ఇంటి ముందు భార్య ధర్నా

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

సూర్యాపేట, వెలుగు : నా భర్త.. నాకు కావాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డుకు(ఎన్టీఆర్ కాలనీ) చెందిన భూపతి సరిత (రాజేశ్వరి) మంగళవారం భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 ఫిబ్రవరిలో జిల్లా కేంద్రానికి చెందిన భూపతి నరేందర్ తో తనకు వివాహం జరిగిందన్నారు. తన మామయ్య మరణానంతరం యాదగిరిగుట్ట డిపోలో ఇటీవల తన భర్త నరేందర్ కు ఆర్టీసీ కండక్టర్ గా ఉద్యోగం వచ్చిందన్నారు.

దీంతో మరో వివాహం చేసుకుంటానని తనను అతడు నిత్యం వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అత్త, మరిది, అత్త తమ్ముడు తనను మూడు నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకురావాలని, తనను ఇంట్లోకి రాకుండా తాళం వేసుకుంటున్నారని తెలిపారు.

ఇప్పటికే రూ.15 లక్షల కట్నం, పది తులాల బంగారం తీసుకొచ్చానని పేర్కొన్నారు. గత డిసెంబర్ 6న విడాకుల నోటీసులు కోర్టు ద్వారా పంపారని, ఈనెల 6న కోర్టుకు హాజరై విడాకులు ఇచ్చేది లేదని లాయర్ ను నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.