వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని .. భర్తను హత్య చేయించిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని .. భర్తను హత్య చేయించిన భార్య
  •  మద్యం బాటిల్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చిన వైనం
  • కొన్ని రోజుల తర్వాత మిగిలిన మద్యాన్ని తాగి వాంతులు చేసుకున్న మరో వ్యక్తి
  • పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడ్డ మర్డర్‌
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన

పాల్వంచ, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా మద్యంలో పురుగుల మందు కలిపి ఇవ్వగా.. ఈ విషయం తెలియని భర్త మద్యం తాగిన తర్వాత వాంతులు చేసుకొని చనిపోయాడు. మిగిలిన మద్యాన్ని కొన్ని రోజుల తర్వాత మరో వ్యక్తి తాగడంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు.

అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్య విషయం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గత నెల జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేసుకు సంబంధించిన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. పాల్వంచలోని పేటచెరువుకు చెందిన పప్పుల నరేశ్‌ (33) గత నెల 11న మద్యం తాగిన తర్వాత వాంతులు చేసుకొని చనిపోయాడు.

సాధారణ మరణంగా భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. నరేశ్‌ తాగగా మిగిలిన మద్యాన్ని తర్వాత గ్రామ పెద్ద వెంకటేశ్వర్లు తాగాడు. అతడు కూడా వాంతులు చేసుకోవడంతో టెస్ట్ లు చేసిన డాక్టర్లు మద్యంలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు అనుమానించారు. దీంతో నరేశ్‌ తల్లి చుక్కమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరి 17న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పాల్వంచ తహసీల్దార్‌ వివేక్‌ సమక్షంలో నరేశ్‌ డెడ్‌బాడీని వెలికితీసి పంచనామా నిర్వహించారు. తర్వాత మద్యం బాటిల్‌లోకి పురుగుల మందు అవశేషాలు ఎలా వచ్చాయి ? అసలు బాటిల్‌ను నరేశ్‌కు ఎవరు ఇచ్చారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నరేశ్‌ చనిపోవడానికి ముందు రోజు భార్య రజితతో కలిసి సారపాకలో బంధువుల ఫంక్షన్‌కు హాజరయ్యాడని, అక్కడ బంధువైన పినపాక మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన గద్దల సాంబశివరావుతో కలిసి మద్యం తాగాడని గుర్తించారు.

అనంతరం సాంబశివరావు మరో మద్యం బాటిల్‌ను నరేశ్‌కు ఇచ్చి ఇంటికి వెళ్లాక తాగమని చెప్పడంతో రాత్రి ఇంటికి వచ్చిన నరేశ్‌ మద్యం తాగిన అనంతరం వాంతులు చేసుకొని చనిపోయాడు. అయితే సాంబశివరావుకు, నరేశ్‌ భార్య రజితకు వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయంలో గొడవలు జరగడం వల్లే అడ్డు తొలగించుకునేందుకు ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్‌ చేశారని పోలీసులు నిర్ధారించారు.

ఇందులో భాగంగానే సాంబశివరావు ఇచ్చిన మద్యం బాటిల్‌లో ఇంజక్షన్‌తో పురుగుల మందు కలిపారని, ఇందుకు అతడి ఫ్రెండ్‌ తాటి నరేశ్‌ సైతం సహకరించాడని డీఎస్పీ వివరించారు. దీంతో సాంబశివరావు, రజితతో పాటు తాటి నరేశ్‌ను  అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. మిగిలిన మద్యం తాగి అనారోగ్యానికి గురైన వెంకటేశ్వర్లు కోలుకున్నారన్నారు. మీడియా సమావేశంలో పాల్వంచ సీఐ సతీశ్‌, టౌన్‌ ఎస్సై సుమన్‌ పాల్గొన్నారు.