భర్తను చంపి అడవిలో పూడ్చిన భార్య

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా​లో దారుణం
  • నెల రోజుల తర్వాత వెలుగులోకి

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: కుటుంబ గొడవల కారణంగా ఓ భార్య.. తండ్రి సాయంతో కట్టుకున్న భర్తను చంపేసి అడవిలో పూడ్చిపెట్టింది. భర్త కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ చేసి నెలరోజుల పాటు ఏమీ తెలియనట్లు నటించింది. ఓవైపు కేసు దర్యాప్తులో ఉండగా.. చనిపోయిన భర్తకు నెల మాసికం నిర్వహించి బంధువులకు దొరికిపోయింది. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నేరేడుపల్లిలో ఆలస్యంగా గురువారం బయటపడింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లికి చెందిన కాళేశ్వరం రమేశ్(38), శారద​ దంపతులకు ఓ కూతురు, కొడుకు. రమేశ్‌‌‌‌ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీళ్ల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. నెల కింద శారద తన భర్త రమేశ్ ను తీసుకొని పుట్టిళ్లయిన నేరేడుపల్లి వెళ్లింది. అప్పటి నుంచి రమేశ్​ కనిపించకుండా పోయాడు. తన భర్త కనిపించట్లేదని శారద భూపాలపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత శారద తన భర్త బంధువుల పెళ్లికి కూడా వెళ్లి వచ్చింది. అక్కడ బంధువులు రమేశ్‌‌‌‌ గురించి అడిగితే కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని చెప్పింది. నెల రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. చనిపోయిన వారికి చేయాల్సిన నెల మాసికం కార్యక్రమాన్ని తన భర్త పేరిట శారద చేసింది. అనుమానం వచ్చిన రమేశ్‌‌‌‌ బంధువులు, గ్రామస్తులు నిలదీయడంతో.. తన తండ్రి తుపాకుల సాంబయ్యతో కలిసి భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టినట్టు అంగీకరించింది. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది. రమేశ్​ బంధువుల ఫిర్యాదు మేరకు రమేశ్ డెడ్​బాడీని పూడ్చిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు.

For More News..

రాత్రికిరాత్రే వందల శిలాఫలకాలు.. పొద్దుగాల్నె శంకుస్థాపనలు