- రోకలి బండతో తలపై కొట్టడంతో మృతి
- అడ్డుకోబోయిన తల్లికి వార్నింగ్
- సహకరించిన మరో ఇద్దరు అరెస్ట్ చేసిన పోలీసులు
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ సుభాష్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తను తాళ్లతో కట్టి కండ్లల్లో కారం చల్లి, ఒంటిపై, మర్మాంగంపై వేడి నీళ్లు పోసి ..రోకలి బండతో కొట్టి చంపిందో భార్య. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..కరీంనగర్ సుభాష్‌నగర్‌లో తోట హేమంత్, రోహితి దంపతులకు 2012లో పెండ్లయ్యింది. హేమంత్(39) పెట్రోల్ బంక్ లో పని చేసి మానేశాడు. రోహితి స్థానిక ప్రభుత్వ దవాఖానలో పేషేంట్ కేర్ గా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. హేమంత్ ప్రతిరోజూ తాగి వేధిస్తుండడంతో కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా లొల్లి పెట్టుకున్నారు. భర్తతో గొడవ గురించి రోహితి దవాఖానలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే గోదావరిఖనికి చెందిన సాయికిరణ్, బెజ్జంకికి చెందిన నవీన్‌కు చెప్పింది. దీంతో వారు బుధవారం హేమంత్‌కు ఫోన్ చేశారు. మద్యం తాగుదామని, బయటకు రావాలని కోరగా విషయాన్ని హేమంత్ తన బంధువులకు చెప్పాడు. దీంతో వారు ఎక్కడికీ వెళ్లవద్దని, ఇంట్లోనే ఉండాలని కోరారు. . హేమంత్బయటికి రాకపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులను బుధవారం రోహితి ఇంటికి తీసుకొచ్చింది.
తల్లి వారిస్తున్నా వినలే..
ఇద్దరు నిందితులను రోహితి ఇంటికి తీసుకువచ్చిన టైంలో హేమంత్ తల్లి ఇంట్లోనే ఉంది. గేట్, ఇంటి తలుపులు మూసేసిన ఇద్దరు హేమంత్ ను తాళ్లతో కట్టేసి కండ్లల్లో కారం కొట్టారు. ఇదంతా చూసిన వృద్ధురాలైన హేమంత్ తల్లి వారిని అడ్డుకోబోగా సైలెన్స్‌గా ఉండాలని, ఎక్కువ మాట్లాడితే చంపుతామని బెదిరించారు. కొద్దిసేపు చితకబాది న వారు వెళ్లిపోయారు. తర్వాత భార్య రోహితి సలసలా కాగే నీళ్లను హేమంత్ ఒంటిపై, మర్మాంగంపై పోసింది. హేమంత్ తల్లి మళ్లీ అడ్డుకోవడానికి రాగా ‘ నా భర్తను నా ఇష్టమునట్టు చేసుకుంటా. అడ్డొస్తే అత్తవని కూడా చూడను’ అని హెచ్చరించింది. తర్వాత రోకలి బండతో హేమంత్ తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికి రోహితి ప్రైవేట్అంబులెన్స్కు ఫోన్ చేసి పిలిపించింది. వారు వచ్చి సర్కారు దవాఖానకు తీసుకువెళ్తుండగా చనిపోయాడు. మృతుడి తల్లి విమల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పొలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.