
- పోస్టుమార్టం నివేదికతో గుట్టురట్టు
నల్గొండ అర్బన్, వెలుగు: భర్తను కిరాతకంగా హత్య చేసి గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేయగా, పోస్టుమార్టం రిపోర్టుతో గుట్టురట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండలోని ఉస్మాన్ పుర కాలనీకి చెందిన మహమ్మద్ ఖలీల్(45), అప్నా బేగం దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఖలీల్ నల్గొండలోని చర్లపల్లి జడ్పీ హైస్కూల్లో అటెండర్ గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 25న కింద పడడంతో గాయపడ్డాడని ఖలీల్‌ను భార్య అప్నాబేగం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
గుండెపోటుతో ఖలీల్ చనిపోయాడని కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అంత్యక్రియల సమయంలో ఖలీల్ ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానించిన బంధువులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. శుక్రవారం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఖలీల్ది సాధారణ మరణం కాదని, హత్య చేశారని తేలింది. పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించింది. కాగా ఈ హత్య ఒకరు చేసింది కాదని, వివాహేతర సంబంధం కోసమే చంపినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు.