
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఘటన
- జనగామ జిల్లాలో పాత కక్షలతో మరో వ్యక్తి..
పాపన్నపేట, వెలుగు : ప్రతి రోజూ మద్యం తాగి వస్తున్నాడని ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన మెదక్‌జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నామాపూర్‌లో సోమవారం వెలుగుచూసింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల జోగయ్య (51) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జోగయ్య మద్యానికి బానిసగా మారడంతో ప్రతి రోజూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసుగు చెందిన భార్య నాగమ్మ తన భర్తను హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం తన చిన్న కూతురితో కలిసి జోగయ్య మెడకు చీరతో ఉరి బిగించి చంపేసింది.
సాయంత్రం పక్కనే ఉన్న వారు జోగయ్య ఇంటికి రాగా.. అతడు చలనం లేకుండా పడి ఉండడంతో వెంటనే మెదక్ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు జోగయ్య అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. సోమవారం విషయం తెలుసుకున్న బంధువులు జోగయ్య డెడ్‌బాడీని పరిశీలించగా మెడ వద్ద గాయం కనిపించింది. అనుమానం వచ్చి నాగమ్మను నిలదీయడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి సోదరి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పాత కక్షలతో వ్యక్తి హత్య
పాలకుర్తి (కొడకండ్ల), వెలుగు : పాత కక్షలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగులతండాలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై చింత రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు శ్రీను (55) వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. ఇతడు తన ఎద్దులను ఇంటి వెనుకాల కట్టేసే విషయంలో అదే తండాకు చెందిన గుగులోతు జేతురాంతో గతంలో గొడవ జరిగింది.
దీనిని మనసులో పెట్టుకున్న జేతురాం శ్రీను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఆదివారం రాత్రి శ్రీను తన ఇంటి వాకిట్లో మంచంపై పడుకోగా.. అక్కడికి వచ్చిన జేతురాం కత్తితో శ్రీను ఛాతి, ఇతర చోట్ల పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రీను అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.