
ఏటూరు నాగారం, వెలుగు: మద్యం మత్తులో ఉన్న భార్య కర్రతో భర్తపై దాడి చేయడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరులో బుధవారం రాత్రి జరిగింది. సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మండపు సమ్మయ్య (60) అతడి భార్య స్వప్నకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన సమ్మయ్యతో, అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడి భార్య స్వప్న గొడవకు దిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన స్వప్న కర్రతో సమ్మయ్య తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.