భార్య, అత్త మామపై కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్

భార్య, అత్త మామపై కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్
  • వరంగల్‍ ఏసీపీ నందిరాం నాయక్‍  వెల్లడి

వరంగల్‍, వెలుగు:  చంపేందుకు భార్యపై దాడి చేసిన భర్తను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆదివారం ఏసీపీ నందిరాం నాయక్‍ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. వరంగల్ కు చెందిన చంద్రశేఖర్‍ బైండింగ్‍ వర్క్ చేస్తున్నాడు. అతడు వాసవి కాలనీకి చెందిన జన్ను పల్లవిని 2022లో లవ్ మ్యారేజ్ చేసుకోగా.. వీరికి ఒక బాబు జన్మించాడు. 

మద్యానికి బానిసైన చంద్రశేఖర్‍ ను పంచాయితీ  పెద్దలు మందలించినా  అతను మారలేదు. సఖి సెంటర్లోనూ కౌన్సిలింగ్‍ ఇప్పించినా  అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులేకపోవడం తో భార్య కొడుకుతో  తల్లిగారింట్లో ఉంటోంది. ఆమె కాపురానికి రాకపోవడంతో పాటు వేరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్టు అనుమానించిన చంద్రశేఖర్ భార్యను చంపేందుకు ప్లాన్ చేసి రూ. 500 పెట్టి కత్తి కొన్నాడు. 

గత గురువారం మధ్యాహ్నం భార్య వద్దకు వెళ్లగా.. బాబుకు పాలు ఇస్తుండగానే..  ఆమెపై కత్తితో దాడి దిగగా..  అడ్డువచ్చిన అత్తమామలపై కూడా తీవ్రంగా దాడి చేశాడు. అనంతరం అతడు కాళేశ్వరం పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మట్టెవాడ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆదివారం వరంగల్‍ పాపయ్యపేట చమాన్‍ వద్ద నిందితుడు చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ తెలిపారు.