భర్త హత్యకు సుపారీ .. 9 మంది అరెస్టు

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి చౌరస్తా వద్ద ఈ నెల 4న నిమ్మల లింగస్వామిపై కాల్పులు జరిపిన ఘటనలో 9 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి తుపాకీ, ఒక మ్యాగజైన్, 9 ఫోన్లు, రూ. 4,500 నగదు, ప్రామిసరి నోట్, పాస్‌బుక్‌ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి కేసు వివరాలు వెల్లడించారు. నార్కట్‌పల్లి మండలం బి వెల్లెంల గ్రామంలోని హైస్కూల్‌ టీచర్​చింతపల్లి బాలకృష్ణ అదే స్కూల్​లో మధ్యాహ్న భోజనం వండే నిమ్మల సంధ్యతో చనువుగా మెలుగుతున్నాడు. తనను పెళ్లి చేసుకుంటే పొలం రాసివ్వడంతోపాటు డబ్బులు ఇస్తానని బాలకృష్ణ ఆశ చూపాడు.

ఇందుకు అడ్డుగా ఉన్న సంధ్య భర్త లింగస్వామిని హత్య చేయించాలని ఇద్దరూ ప్లాన్‌ వేశారు. యాచారం మండలం మాల్‌కు చెందిన కనుక రామస్వామి, రత్నాల వెంకటేశ్, చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన పోల్‌గిరిబాబు, నార్కట్‌పల్లి మండలం బి. వెల్లంల గ్రామానికి చెందిన మహ్మద్‌మొయినోద్దీన్‌కు రూ. 3 లక్షల సుపారీ ఇచ్చాడు. నెల రోజులు గడిచినా లింగస్వామిని హత్య చేయకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాలకృష్ణ ఒత్తిడి చేయడంతో వారు ప్రామిసరీ నోట్‌, బ్యాంకు చెక్‌బుక్‌లు బాలకృష్ణకు తిరిగిచ్చారు. అనంతరం హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఎఫ్‌సీఐ కాలనీలో ప్లంబర్‌ పని చేసే యూసుఫ్‌కు విషయం చెప్పాడు. యూసుఫ్‌ తన పరిచయస్తులైన అబ్దుల్‌రెహమాన్‌, మహ్మద్‌ జహంగీర్‌ పాషా అలియాస్‌ బాబు, పఠాన్‌ ఆసిఫ్‌ఖాన్‌తో మాట్లాడించాడు. రూ. 12 లక్షల సుపారీ ఇచ్చేందుకు బాలకృష్ణ ఒప్పుకున్నాడు. ముందుగా రూ. 5 లక్షలు ఇచ్చాడు. ఇందులో రూ. లక్ష సంధ్య మహిళా సంఘంలో లోన్​తీసుకొని బాలకృష్ణకు అందజేసింది.

బిహార్‌లో తుపాకీ కొనుగోలు

అబ్దుల్‌ రెహమాన్‌ బిహార్‌లో తుపాకీ, హైదరాబాద్​లో పాతబైక్‌ కొనుగోలు చేశాడు. మునుగోడులో వాటర్‌బాటిల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్న నిమ్మల లింగస్వామి కదలికలపై నిఘా పెట్టారు. ఈ నెల 4న సాయంత్రం లింగస్వామి బైక్​పై వెళుతుండగా ఊకొండి వద్ద మూడు రౌండ్లు తుపాకీతో కాల్పులు జరిపారు. కిందపడిపోయిన లింగస్వామిని అక్కడే ఉన్నవారు హాస్పిటల్​కు తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఉన్న పదిమంది నేరస్తుల్లో 9 మందిని అరెస్టు చేశారు. బాలకృష్ణ, నిమ్మల సంధ్య, హైదరాబాద్​కు చెందిన అబ్దుల్‌రెహమాన్‌, మహ్మద్‌ జహంగీర్‌పాషా, ఏపీలోని చిలుకలూరిపేట శాంతినగర్‌కు చెంది పఠాన్‌ఆసిఫ్‌ఖాన్‌, కనుక రామస్వామి, రత్నాల వెంకటేశ్, పోల్‌గిరిబాబు, మహ్మద్‌మోయినోద్దీన్‌ను అరెస్టు చేశారు. మహ్మద్‌ యూసుఫ్‌ పరారీలో ఉన్నాడు.