కామారెడ్డి జిల్లాలో భర్తను హత్య చేసేందుకు రూ. 15 లక్షలు సుపారీ.. ప్రియుడితో కలిసి భార్య ప్లాన్

కామారెడ్డి జిల్లాలో భర్తను హత్య చేసేందుకు రూ. 15 లక్షలు సుపారీ.. ప్రియుడితో కలిసి భార్య ప్లాన్

కామారెడ్డి, వెలుగు: వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్‌‌ చేసిందో మహిళ. ఇందుకు రూ. 15 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌‌ సదరు వ్యక్తిపై దాడి చేయగా.. అతడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. 

విచారణ చేపట్టిన పోలీసులు భార్య, ఆమె ప్రియుడితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్‌‌ చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేశ్‌‌ చంద్ర సోమవారం వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మాచారెడ్డి మండలం ఘన్‌‌పూర్‌‌కు చెందిన సాడెం కుమార్‌‌ మెదక్‌‌ జిల్లా తుప్రాన్‌‌ మున్సిపాలిటీలో జూనియర్‌‌ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21న తన బైక్‌‌పై డ్యూటీకి బయలుదేరాడు.

ఫరీద్‌‌పేట శివారులోని సోలార్‌‌ ప్లాంట్‌‌ వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌‌ను అడ్డగించి ఇనుప రాడ్లతో కుమార్‌‌పై దాడి చేశారు. ఇదే టైంలో ఇద్దరు వ్యక్తులు కారులో అటువైపు రావడంతో నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ కుమార్‌‌ను హాస్పిటల్‌‌కు తరలించారు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

హత్యకు రూ. 15 లక్షల సుపారీ
కుమార్‌‌పై దాడి జరగడంతో విచారణ చేపట్టిన పోలీసులు.. అతడి భార్య రేణుకే, తన ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర చేసినట్లు గుర్తించారు. కుమార్‌‌ భార్య రేణుకకు, మేడ్చల్‌‌ జిల్లా అల్వాల్‌‌కు చెందిన, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో పూజారిగా పనిచేస్తున్న కాంపల్లి మహేశ్‌‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. 

కుమార్‌‌ అడ్డు తొలగించుకుంటే ఆస్తిని సైతం తామే అనుభవించవచ్చని రేణుక, మహేశ్‌‌ ప్లాన్‌‌ చేశారు. ఇందుకు అల్వాల్‌‌కు చెందిన మహ్మద్‌‌ అశ్వాక్‌‌, ముబీన్‌‌, అమీర్‌‌, అన్వర్‌‌, మోసిన్లతో మాట్లాడి రూ. 15 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పుకొని అడ్వాన్స్‌‌గా రూ. 2 లక్షలు ఇచ్చారు.

దీంతో సుపారీ గ్యాంగ్‌‌ ఈ నెల 21న కుమార్‌‌పై దాడి చేశారు. అతడు ప్రాణాలతో బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేణుక, మహేశ్‌‌తో పాటు మహ్మద్‌‌ అశ్వాక్‌‌, ముబిన్, అమీర్‌‌ను అరెస్ట్‌‌ చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.

నిందితుల నుంచి కారు, ఆటో, గొడ్డలి, రెండు బైక్‌‌లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకున్న కామారెడ్డి రూరల్‌‌ సీఐ రామన్, ఎస్సై అనిల్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ బి. చైతన్యరెడ్డి పాల్గొన్నారు.