కోనరావుపేట, వెలుగు: అత్తింటి వారు వేధిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో భర్త ఇంటి ముందు ఓ భార్య బైఠాయించింది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దోసల లత, కోనరావుపేట మండలం నిజామాబాద్ కు చెందిన సుదమల్ల ప్రవీణ్ ఐదేండ్లుగా ప్రేమించుకొని ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో 2021 అక్టోబర్ 7న గంభీరావుపేట లోని మానేర్ చర్చిలో రిజిష్టర్ మ్యారేజీ చేసుకున్నారు.
తర్వాత ప్రవీణ్, లత హైదరాబాద్ లో నివాసమున్నారు. రెండు నెలల కింద ఇంట్లో వాళ్లను ఒప్పిస్తానని చెప్పి ఇంటికి వచ్చిన ప్రవీణ్ అప్పటి నుంచి ఫోన్ ఎత్తడం లేదు. ప్రవీణ్‌కు అతడి కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. ప్రవీణ్ ఇంటికి వెళ్తే గెంటేశారని లత వాపోయింది. దీంతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఇంటికి తాళం వేసి ప్రవీణ్ కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. తన భర్త తనకు కావాలని, నాకు న్యాయం చేయాలని పోలీసులను లత వేడుకుంది. ఆమెను సఖి సెంటర్ కు తీసుకెళ్లారు.