- కాపురానికి తీసుకెళ్లాలని దీక్ష చేస్తున్న చోటే పురుగుల మందు తాగింది
- అమావాస్య నాడు పుట్టిందని, నల్లగా ఉందని ఒప్పుకోని భర్త
- అంతకుముందే మరో పెండ్లి
- 41 రోజులుగా హుజూరాబాద్‌లో దీక్ష
- మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
హుజూరాబాద్, వెలుగు : ఆ యువతి తనకు న్యాయం చేయాలని ఎండకు ఎండుతూ, చలిని వణుకుతూ 41 రోజులుగా అత్తవారింటి ముందు దీక్ష చేస్తోంది. అయినా వారి మనసు కరగకపోవడంతో బుధవరం తెలిసిన వారందరికీ సూసైడ్ నోట్ పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్లాడుతోంది. బాధితురాలి కథనం ప్రకారం...పదేండ్ల క్రితం హుజూరాబాద్‌కు చెందిన నరహరి సుజిత్ రెడ్డి కడప జిల్లాకు చదువుకోవడానికి వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన సుహాసినిని ప్రేమించాడు. కొంతకాలం తర్వాత ఆమె తనను పెండ్లి చేసుకోమని అడగడంతో దాటవేశాడు. మళ్లీ మళ్లీ అడగ్గా పట్టించుకోలేదు. దీంతో తనను మోసం చేశాడని 2016 సంవత్సరంలో కేసు పెట్టేందుకు హుజూరాబాద్ పీఎస్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సుజిత్‌రెడ్డి ఆమెను కలిసి పెండ్లి చేసుకుంటానని అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు. 2018లో ఆమె ఉద్యోగం చేయడం కోసం కువైట్ కు వెళ్లింది. కొంతకాలం తర్వాత ఆమెను పెండ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో ఇండియాకు వచ్చింది. అయితే ఆమె సంపాదించిన డబ్బులన్నీ సుజిత్ తన అవసరాలకు తీసుకున్నాడు. కానీ పెండ్లి ప్రస్తావన ఎత్తలేదు.
దీంతో ఒత్తిడి చేయగా 2020 నవంబర్ లో హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను ఒప్పించి కాపురానికి తీసుకెళ్తానన్న సుజిత్ లేట్ చేయడంతో 2021లో కడప పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేసింది. సుజిత్ రెడ్డి హుజూరాబాద్‌లోని బృందావన్ దాబా ఎదురుగా గల్లీలో ఉంటున్నాడని తెలుసుకుని నవంబర్ 26న వచ్చి అతడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈ క్రమంలో ఆమెపై సుజిత్ సంబంధీకులు దాడులు చేశారు. ఎన్ని కష్టాలు పెట్టినా దీక్ష విరమించేది లేదని చెప్పడంతో సఖి కేంద్రం లీగల్ అడ్వైజర్, కౌన్సిలర్లు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అమ్మాయి ఆదివారం, అమావాస్య రోజు పుట్టిందని, నల్లగా ఉందని కారణాలు చెప్పాడు. 41 రోజులుగా దీక్ష చేస్తున్నా న్యాయం జరగడం లేదని, తన పెండ్లి కంటే ముందు మరో అమ్మాయిని చేసుకున్నట్లు తెలియడంతో దీక్ష చేస్తున్న చోటే బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త సుజిత్, అత్తా, మామల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సుహాసిని సూసైట్ నోట్లో రాసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానాకు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు.