దొంగ పెళ్లాం.. కట్టుకున్న భార్యే దొంగలా మారింది

దొంగ పెళ్లాం.. కట్టుకున్న భార్యే దొంగలా మారింది

ఖమ్మం: కారేపల్లి మండలంలో ఈనెల 4వ తేదీన అర్ధరాత్రి జరిగిన చోరీ కేసులో కట్టుకున్న భార్యే దొంగ అని తేలింది. భర్తతో గొడవపడిన భార్య శాశ్వతంగా విడిపోయే ముందు భర్త ఇంట్లో చోరీకి పాల్పడింది. నాటకీయ ఫక్కీలో చోరీ కేసును పోలీసులు శాస్ర్తీయ ఆధారాలతో ఛేదించారు. భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఇటు జైలుపాలైన తల్లిని, అటు తండ్రికి పిల్లలు దూరం కావాల్సి రావడం వారి కుటుంబ సభ్యులను బాధతో కుమిలిపోయేటట్లు చేసింది. సంచలనం సృష్టించిన చోరీ కేసు వివరాలను సీపీ విష్ణువారియర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 
కారేపల్లి మండలానికి చెందిన శివ ప్రకాశ్ ధారక్ -అర్చన ధారక్ తో 2008లో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే దంపతులిద్దరి మధ్య వివాహేతర అంశానికి సంబందించి కలహాలు జరుగుతున్నాయి. దీంతో దంపతులిద్దరూ వేరు వేరుగా ఉంటున్నారు. పుట్టినిల్లు గుంటూరు జిల్లా మాచర్లకు వెళ్లిపోయిన అర్చన అక్కడ వెంకట శివ కృష్ణ తో పరిచయం గాఢమైన అనుబంధంగా మారింది. దీంతో అతనితో కలసి జీవనం కొనసాగించాలని అర్చన నిర్ణయించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో భర్త శివ ప్రకాశ్ ధారక్ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అత్త చనిపోయిన విషయం తెలుసుకుని అంత్య క్రియల్లో పాల్గొనేందుకు వచ్చింది అర్చన. భర్త ఇంట్లో నగలు చూసి ప్రియుడు వెంకట శివకృష్ణతో కలసి చోరీ పథకం వేసింది.
 ఎవరూ చూడని సమయంలో  ప్రియుడికి భర్త జేబులో నుంచి తాళాలు తీసి ఇచ్చింది. కొట్టేసిన నగలు అమ్మి నగదు సిధ్దం చేయాలని సూచించింది. తల్లిని పోగొట్టుకున్న బాధలో ఉన్న శివ ప్రకాశ్ ధారక్ మరుసటి రోజే ఇంట్లో నగలు, ల్యాప్ టాప్ చోరీకి గురికావడంతో షాక్ గురయ్యాడు. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈనెల 4వ తేదీన  అర్ధరాత్రి తన ఇంట్లో 1330 గ్రాముల బంగారం , 2330 గ్రా. వెండితో పాటు ల్యాప్ ట్యాప్ అపహరణకు గురైనట్లు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సిసి ఫుటేజి, వేలి ముద్రల ఆధారాలతో దొంగలను పట్టుకున్నారు. దొంగలా మారిన భార్య అర్చనను ఆమె ప్రియుడు వెంకట కృష్ణ లను అదుపులోకి తీసుకొని ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.