భర్త కాపురానికి తీసుకెళ్లడంలేదని అత్తారింటి ముందు భార్య ఆందోళన

కోల్​బెల్ట్, వెలుగు: భర్త కాపురానికి తీసుకెళ్లడంలేదంటూ అతడి ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​పట్టణం ఏ జోన్​లో జరిగింది. హన్మకొండ జిల్లా కాజీపేటకు చెందిన వందనకు 2017లో రామకృష్ణాపూర్​కు చెందిన సంతోష్​తో పెండ్లి జరిగింది. వీరికి ఓ కూతురు ఉంది. ఆర్ఎంపీగా పనిచేస్తున్న సంతోష్​​మొదట్లో తనను, కూతురును బాగా చూసుకునేవాడని.. కానీ తమ కుమారుడికి మరో పెండ్లి చేస్తే ఎక్కువ కట్నం వచ్చేదని కొంత కాలంగా అత్త పుష్ప, మామ ఆశీర్వాదం తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె ఆరోపించింది.

గొడవల నేపథ్యంలో తాను కూతురుతో కాజీపేటలోని పుట్టింట్లో ఉంటున్నట్లు పేర్కొంది. ఇటీవల తన భర్త సంతోష్​​కు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చిందని, తనను కాపురానికి తీసుకెళ్లాలని కోరితే.. తాను మరో పెండ్లి చేసుకుంటానని, నువ్వు వద్దంటూ తనను వెళ్లగొట్టాడని ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో న్యాయం చేయాలని వందన తన కూతురు, తల్లితో కలిసి అత్తారింటి ఎదుట బైఠాయించింది. వందన ఆందోళన చేపట్టడంతో ఆమె అత్తామామలు గొడవకు దిగారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. మహిళ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రామ కృష్ణాపూర్​ ఎస్​ఐ రాజశేఖర్​ తెలిపారు.