14 ఏండ్ల తర్వాత స్వదేశానికి అసాంజే

కాన్​బెర్రా: గూఢచర్యం చేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీక్స్ ఫౌండర్​ జూలియన్​ అసాంజే 14 ఏండ్ల తర్వాత తన స్వదేశానికి చేరుకున్నాడు. అదనపు జైలు శిక్ష విధించకుండా అమెరికా కోర్టు తీర్పు చెప్పడంతో ప్రత్యేక జెట్​ విమానంలో బుధవారం ఆస్ట్రేలియాకు తిరిగివచ్చారు. కాన్​బెర్రా ఎయిర్​పోర్ట్​లో తన లీగల్​ టీమ్​తో కలిసి అడుగుపెట్టగానే ఆయన భార్య స్టెల్లా ఎదురురాగా, ఆమెను హత్తుకున్నారు. తండ్రి జాన్​షిప్టన్​ను ఆలింగనం చేసుకొని, భావోద్వేగానికి గురయ్యారు. స్వాగతం పలికేందుకు వచ్చిన శ్రేయోభిలాషులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

నేరం ఒప్పుకొన్న అసాంజే

అంతకుముందు అసాంజే ఉత్తర మారియానా ద్వీపం రాజధాని అయిన సైపన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న  అమెరికా డిస్ట్రిక్ట్​కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును యూఎస్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ జడ్జి జస్టిస్‌‌‌‌‌‌‌‌ రమొనా మంగ్లోనా విచారించారు. కాగా, అమెరికా గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు అసాంజే అంగీకరించారు. 

ఒక జర్నలిస్టుగా తన కర్తవ్యాన్ని తాను నిర్వహించినట్టు చెప్పారు. అమెరికా రాజ్యాంగం మొదటి సవరణ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే తాను ఈ పని చేసినట్టు తెలిపారు. దీంతో అసాంజే నేరాంగీకారానికి జడ్జి ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఆయన బ్రిటన్​లో గడిపిన నిర్బంధ కాలాన్ని కూడా శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్టు తీర్పు చెప్పారు. అనంతరం అమెరికా నుంచి ఆస్ట్రేలియా లీగల్​ టీమ్​తో కలిసి అసాంజే ప్రత్యేక విమానంలో తన దేశానికి పయనమయ్యారు.