హనుమకొండ అడవుల్లో యథేచ్ఛగా వేట

హనుమకొండ అడవుల్లో  యథేచ్ఛగా వేట
  • నెమళ్లు, అడవి పందులను చంపుతున్న దుండగులు
  • చుట్టుపక్కల ప్రాంతాలకు మాంసం విక్రయం
  • పట్టించుకోని ఫారెస్ట్​అధికారులు

హనుమకొండ, ధర్మసాగర్, వెలుగు: అడవుల్లో మూగజీవాలు రోధిస్తున్నాయి. హనుమకొండ జిల్లాలో కొంతకాలంగా వన్య ప్రాణుల వేట జరుగుతోంది. ఫారెస్ట్ ఏరియా విస్తరించి ఉన్న ఉమ్మడి ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలో కొంతమంది దుండగులు ఉచ్చులు అమరుస్తుండగా, వాటి బారిన పడి నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. 

అలా ఉచ్చులకు చిక్కిన వన్య ప్రాణుల మాంసాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా దేవునూరు చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియాలో తరచూ ఇలా యానిమల్ హంటింగ్​ జరుగుతుండగా, గ్రామస్తులు ఫిర్యాదు చేసినా ఫారెస్ట్ ఆఫీసర్లు లైట్ తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. మామూళ్లకు అలవాటుపడిన కొంతమంది అటవీ శాఖ అధికారులు అంతా తెలిసే అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉచ్చులు, నాటుబాంబులతో వేట

హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలోని ఇనుపరాతి గుట్టలు విస్తరించి ఉండగా, వాటిలో దాదాపు 4 వేల ఎకరాల వరకు అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, కుందేళ్లు, అడవి పందులు, నెమళ్లు, వివిధ రకాల జంతు, పక్షి జాతి ప్రాణులున్నాయి. సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు ఆహారం కోసం వస్తుంటాయి. ఇదే క్రమంలో కొంతమంది వాటిని వేటాడుతున్నారు. కొందరు కుందేళ్లు, నెమళ్ల కోసం ఉచ్చులు పెడుతుంటే, అడవి పందుల్లాంటి వాటికోసం కరెంట్ ఉచ్చులు పెట్టి చంపేస్తున్నారు. 

ఇంకొందరు ఏకంగా నాటుబాంబులు అమర్చి, హతమారుస్తున్నారు. ఆరు నెలల కిందట భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి శివారు అటవీప్రాంతంలో అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు పేలి ఓ కుక్క చనిపోగా, అది జరిగిన కొద్దిరోజులకే కొత్తకొండ శివారులో నడిరోడ్డుపై నాటుబాంబు పడిపోయి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కాగా, వివిధ పద్ధతుల్లో వేటాడిన నెమళ్లు, కుందేళ్లు, అడవి పందుల మాంసాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు అమ్మేస్తున్నారు. కిలో మాంసాన్ని రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. 

అధికారుల కనుసన్నల్లోనే..?

తరచూ అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట జరుగుతుండగా, అధికారుల మాత్రం అంతా తెలిసే లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న వేలేరు, దేవునూరు, బొల్లోనిపల్లి, ఎర్రబెల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో కొంతమంది అదే పనిగా వేటాడుతున్నా అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు అరణ్యంలోని మూగజీవాల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో పాటు హంటింగ్ చేస్తున్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమీప గ్రామస్తులు, వన్య ప్రాణి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

ఫిర్యాదు చేసినా స్పందన కరువు..

జిల్లాలోని ఫారెస్ట్​ ఏరియా విస్తరించి ఉన్న ఆ నాలుగు మండలాల పరిధిలో వన్య ప్రాణులను హతమార్చే వ్యవహారం అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 28న ధర్మసాగర్​ మండలం దేవునూరు శివారులో కొంతమంది నెమళ్లు, అడవి పందులను వేటాడారు. నెమళ్లకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకుండా వాటిని అటవీ ప్రాంతంలోనే కాల్చేయగా, అడవి పందులను మాత్రం గ్రామానికి తీసుకొచ్చి మాంసాన్ని అమ్మేశారు. ఇదే విషయమై కొంతమంది గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధుల్లో ఉన్న బలరాం, తన సిబ్బందితో కలిసి దేవునూరుకి వెళ్లి విచారణ చేపట్టారు. ఒకరిద్దరి ఇండ్లకు వెళ్లి ఎంక్వైరీ చేశారు. అటవీ జంతువుల అవశేషాలకు సంబంధించిన శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ కు పంపించనున్నట్లు స్థానికులకు చెప్పి పట్టుకెళ్లారు. ఆ తర్వాత ఎలాంటి యాక్షన్ చేపట్టలేదు. ఇదే విషయమై ఎఫ్ఆర్వో భిక్షపతిని వివరణ కోరగా, ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని సమాధానం ఇవ్వడం గమనార్హం.