యథేచ్ఛగా వన్యప్రాణుల వేట!

  • చూసీ చూడనట్లు వదిలేస్తున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు..
  • నెల వ్యవధిలో రెండు సంఘటనలు
  • గతేడాది వేటకు వెళ్లి రాళ్ల మధ్యలో పడిన ఓ వ్యక్తి..
  • తాజాగా నాటు తుపాకీ మిస్ ​ఫైర్ అయి మరో వ్యక్తి  మృతి

కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోందనడానికి నెల రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలే ఉదాహరణ. జిల్లాలో 2,05,475 ఎకరాల్లో ఫారెస్ట్​ విస్తరించి ఉంది. రెగ్యులర్​గా ఫారెస్ట్​లో వన్యప్రాణుల వేట జరుగుతున్నా.. ఫారెస్ట్​ ఆఫీసర్లు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.  

 ఎక్కువగా ఇక్కడే..

జిల్లాలో గాంధారి, మాచారెడ్డి, రామారెడ్డి, ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, నాగిరెడ్డిపేట, రాజంపేట, తాడ్వాయి, బాన్స్​వాడ, బిచ్కుంద, నిజాంసాగర్​, పిట్లం, బీర్కుర్​ ఏరియాల్లో ఎక్కువగా ఫారెస్ట్​ ఉంది. ఇక్కడ జింకలు,  కొండ గొర్రెలు, మనుబోతులు, దున్నలు, అడవి పందులు, నెమళ్లతో పాటు చిరుతలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వేట జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్​కు సమీపంలోని గ్రామాలు, తండాలకు చెందిన కొందరు వ్యక్తులు వన్య ప్రాణులను  వేటాడిన సంఘటనలు కూడా ఇటీవల బయటపడ్డాయి. కొన్ని జంతువుల మాంసానికి భారీగా డిమాండ్​ఉండడంతో ఫారెస్ట్ పై పట్టున్న కొందరు వేటగాళ్లు రోజూ వేట సాగిస్తున్నారనే ప్రచారం ఉంది. అందుకు నాటు తుపాకులను విరివిగా వినియోగిస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్​ నుంచి వేటకు వచ్చి పోలీసులకు చిక్కిన సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. 6 నెలల కింద  లింగంపేట మండలంలోని అటవీ ప్రాంతానికి హైదరాబాద్ ​నుంచి 2 వెహికల్స్​లో వేటకు వచ్చి పోలీసులు వెంబడించగా  మాచారెడ్డి మండలం ఫరీద్​పేట వద్ద పట్టుబడ్డారు.స్థానికులు కూడా ఎన్నోసార్లు అరెస్ట్​ అయ్యారు.  

‘రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్​ అనే ఇద్దరు గతేడాది డిసెంబర్​లో గ్రామ శివారులోని ఫారెస్ట్​లోకి వేటకు వెళ్లారు. రాళ్లగుట్టపై జంతువులను వెతుకుతుండగా, ఫోన్​రాళ్ల మధ్యలో పడడంతో తీసుకునేందుకు వెళ్లి రాళ్ల మధ్యలో ఇరుక్కు పోయాడు. ఆయా శాఖలకు చెందిన ఆఫీసర్లు, సిబ్బంది రెండు రోజులు రెస్య్కూ ఆపరేషన్​చేసి రాజును బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటనపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది.  

‘మాచారెడ్డి మండలం సర్ధాపూర్​ తండాకు చెందిన బానోతు రావోజీ,  బానోతు రాంరెడ్డి,  సోమార్​పేటకు చెందిన ఆశిరెడ్డి  ముగ్గురు బుధవారం రాత్రి  ఫారెస్ట్ లో  వన్య ప్రాణుల వేటకు వెళ్లారు. వీరి వద్ద నాటు తుపాకీ ఉంది. కామారెడ్డి, నిజామాబాద్ బార్డర్​ఫారెస్ట్​లో రావోజీ (35) చెట్టుపైకి ఎక్కిన తర్వాత నాటుతుపాకీ పైకి అందించే క్రమంలో కిందపడి మిస్​ఫైర్​అయ్యి తూటాలు నేరుగా రావోజీ శరీరంలోకి దూసుకుపోయి స్పాట్​లోనే చని పోయాడు. ఈ ఘటనపై  సిరికొండ పోలీసులు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నారు.’