కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట అటవీ ప్రాంతంలో ఓ వన్యప్రాణిని వేటాడి చంపారు. మాంసం తీసుకుని తల, కాళ్లను అడవిలో కాల్చి అక్కడే దాచి పెట్టడంతో సమాచారం అందుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన జంతువు జింకగా భావిస్తున్నప్పటికీ మనుబోతు అనే అనుమానం కూడా కలగడంతో తేల్చుకోవడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అధికారుల కథనం ప్రకారం...వన్యప్రాణిని వేటాడి చంపారని కొడిమ్యాల ఫారెస్ట్ అధికారులకు వారం కింద సమాచారం రావడంతో సూరంపేట అడవిలో వెతికారు.
ఒకచోట కాలిన అడవి జంతువు కాళ్లు, చేతులు కనిపించాయి. వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించగా తల, కాళ్లు మాత్రమే ఉండడంతో పోస్ట్‌మార్టం సాధ్యం కాదని చెప్పారు. దీంతో జంతు వును గుర్తించేందుకు శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని ఎఫ్ఆర్ఓ లత తెలిపారు. వారి విచారణలో గ్రామానికి చెందిన ఇద్దరు వేటాడి చంపినట్టు తెలిసింది. నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం.