
యాదాద్రి, వెలుగు : గమ్యం లేకుండా వారం రోజులపాటు జిల్లాలో తిరిగిన అడవి దున్న చివరకు మృతి చెందింది. గత నెల 30న జిల్లాలోని ఆత్మకూర్ (ఎం) మండలం పల్లెర్లలో అడవి దున్న ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ స్టాఫ్, పోలీసులు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే గమ్యం తెలియక రోజుకో చోటుకు దున్న ప్రయాణించింది. దాన్ని కనిపెట్టడానికి ఫారెస్ట్ ఆఫీసర్ పద్మజారాణి ఆధ్వర్యంలో డ్రోన్‌ను ఉపయోగించారు. జూ పార్కునుంచి ప్రత్యేక టీం కూడా జిల్లాకు వచ్చి ప్రయత్నాలు చేసింది.
అయినప్పటికీ దాన్ని పట్టుకోలేక పోయారు. గురువారం బీబీనగర్‌లో కన్పించిన దున్న రాత్రికి చౌటుప్పల్మండలం చిన్నకొండూరుకు వెళ్లింది. చివరకు శుక్రవారం భువనగిరి మండలంలో ప్రవేశించిన సంగతిని గుర్తించి జూ పార్కు నుంచి వచ్చిన ప్రత్యేక టీం అక్కడికి వెళ్లింది. చివరకు మత్తు ఇంజక్షన్ ప్రయోగించింది. దీంతో దున్న పడిపోయింది. వారం రోజులపాటు మేత సరిగా లేకుండా రోజుకు 35 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన దున్న మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటికే మృతి చెందింది. దీంతో చౌటుప్పల్ వెటర్నరీ స్టాఫ్ పంచనామా నిర్వహించారు.