- ఉమ్మడి ఆదిలాబాద్ లో పెరిగిన వైల్డ్ డాగ్స్ పాపులేషన్
- కవ్వాల్ ఫారెస్ట్ ఏరియాలోని డివిజన్లలో సంచారం
- మేకల, గొర్రెల మందలపై, వన్యప్రాణులపైనా దాడులు
- కాగజ్‌నగర్ ఏరియాలో సీసీ కెమెరాలకు చిక్కిన రేచులు
మంచిర్యాల, వెలుగు: అడవిలో పులి కనిపిస్తే చాలు వన్యప్రాణులు భయంతో దొరక్కుండా పారిపోతాయి. అలాంటి పులులకు రేచు కుక్కలు (వైల్డ్‌డాగ్స్) చుక్కలు చూపిస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్‌తో పాటు ప్రాణహిత అభయారణ్యంలో రేచు కుక్కలు గణనీయంగా పెరిగాయని ఫారెస్టు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. అంతరించిపోయే జంతువుల జాబితాలో చేరిన రేచుకుక్కలు.. ప్రస్తుతం మేమున్నామంటూ ఉనికిని చాటుకుంటున్నాయి. ఇటీవల మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లిలో మేకలమందపై దాడి చేసి దాదాపు 50 మేకలను చంపేశాయి. అంతకు ముందు కవ్వాల్టైగర్జోన్తో పాటు ఆసిఫాబాద్‌జిల్లా పెంచికల్‌పేట రేంజ్లో ఫారెస్టు ఆఫీసర్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ట్రాప్ అయ్యాయి.
చురుకుగా.. భయపడకుండా దాడి
రేచు కుక్కలు ఆకారంలో చిన్నగా ఉన్నా.. పెద్ద జంతువులను సైతం వేటాడతాయి. ఏదైనా జంతువు కనిపిస్తే చాలు వాటి నుంచి తప్పించుకోవడం కష్టం. చివరకు పెద్దపులులు కూడా పారిపోతాయంటే.. అవి ఎంత డేంజరో తెలుస్తుంది. ఇవి ఉండే ఏరియాకు పులులు కూడా వెళ్లవని ఆఫీసర్లు చెప్తున్నారు. పెంపు డు కుక్కల కంటే ఇవి అందంగా అన్నీ ఒకే రంగులో ఉంటాయి. మూతి కొంచెం పొడుగ్గా, కొన నల్లగా, కుచ్చుతోక కలిగి ఉంటాయి. ఒంటరిగా కాకుండా ఐదు నుంచి పదికిపైగా గుంపుగా తిరుగుతుంటాయి. అడవిలోని జంతువులకు, మనుషులకు ఏమాత్రం భయపడవు. వేటాడేటప్పుడు చురుకుగా, భయపడకుండా ప్రవర్తిస్తాయి. మేకలు, గొర్రెల మందలు, వన్యప్రాణులపై ఒక్కసారిగా దాడిచేస్తాయి. అడవి పందిని వేటాడడం పులులకు కూడా కష్టమంటారు. అలాంటి అడవిపందులను రేచు కుక్కలు సులువుగా వేటాడతాయని ఫారెస్టు ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
ALSO READ : పంటల బీమా పథకం పొడిగింపు
అంతరించిపోయే జాబితా నుంచి..
వైల్డ్ డాగ్స్ అంతరించిపోయే జంతువుల జాబితాలో చేరినా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో వాటి ఉనికి కనిపించడం విశేషం. కవ్వాల్ఫారెస్టు పరిధిలోని జన్నారం, ఖానాపూర్ డివిజన్లలో రేచు కుక్కలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా వీటి ఉనికి కనిపిస్తోంది. లక్సెట్టిపేట, చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి, కుశ్నపల్లి రేంజ్‌లతో పాటు ఆసిఫాబాద్జిల్లాలోని కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం, సిర్పూర్, కాగజ్‌నగర్ రేంజ్‌ల్లో భారీగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. దేశంలో ఉత్తర తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా బోర్డర్, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో మాత్రమే వైల్డ్ డాగ్ పాపులేషన్ ఉన్నట్టు అటవీశాఖ వర్గాల ద్వారా తెలుస్తుంది.