అమ్మాయిలతో కవ్విస్తూ.. అధిక బిల్లులతో దోపిడీ.. చైతన్యపురి వైల్డ్ హార్ట్ పబ్​ నిర్వాహకుల ప్లాన్​

అమ్మాయిలతో కవ్విస్తూ.. అధిక బిల్లులతో దోపిడీ.. చైతన్యపురి  వైల్డ్ హార్ట్ పబ్​ నిర్వాహకుల ప్లాన్​
  • అందమైన యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు  
  • వారితో బ్రాండెడ్​లిక్కర్, ఫుడ్​ఆర్డర్​ఇప్పిస్తూ దోపిడీ  
  • పట్టుబడిన 16 మంది గర్ల్స్​ 

దిల్ సుఖ్ నగర్, వెలుగు: కొంతకాలం కింద ముంబయి, ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్​లోని పలు బార్లలో బార్​గర్ల్స్​అని ఉండేవారు. వారు డ్యాన్సులతో అలరిస్తుంటే మందుబాబులు పెగ్గు మీద పెగ్గు వేసి.. కావాల్సిన దానికన్నా ఎక్కువ బిల్లు చేసి కండ్లు తేలేసి వెళ్లిపోయేవారు. ఈ కల్చర్​ను ప్రభుత్వాలు నిషేధించడంతో బార్లకు అప్​డేట్​వర్షన్​గా వచ్చిన కొన్ని పబ్​లు ఇప్పుడు ఇదే సూత్రాన్ని అమలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నాయి. పబ్​లలో రూల్స్​కు విరుద్ధంగా అందమైన అమ్మాయిలను తీసుకువచ్చి న్యూడ్, సెమీ న్యూడ్​గా డ్యాన్సులు చేయిస్తున్నాయి. అబ్బాయిలకు ఫ్రీ ఎంట్రీ అంటూ వారు వచ్చాక అందమైన అమ్మాయిలను వారితో కూర్చోబెట్టి మద్యం పోయించి వేలకు వేలు బిల్లు వేస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి చైతన్య పురి పోలీస్​స్టేషన్​పరిధిలోని పబ్​లో వెలుగు చూసింది. 

ఏం జరిగిందంటే..

చైతన్యపురి పోలీస్​స్టేషన్​పరిధి గ్రీన్ హిల్స్ కాలనీ లోని వైల్డ్ హార్ట్ పబ్ యజమాని రాము పబ్​లోకి ఎవరికైనా ఫ్రీ ఎంట్రీ అంటూ ఆఫర్​పెట్టాడు. తమ దగ్గర బ్యూటిఫుల్​గర్ల్స్​డ్యాన్సులతో అలరిస్తారని మౌత్​పబ్లిసిటీ చేయడంతో రోజూ అబ్బాయిలు, అంకుల్స్​అధిక సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. ముంబై, ఢిల్లీతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి అందమైన యువతులను ఎంగేజ్ చేసుకుని పబ్​లో అపాయింట్​చేసుకున్నాడు. ప్లాన్​లో భాగంగా ఒకటి, రెండు పెగ్గులేసే వరకూ డ్యాన్సులు వేస్తూ దూరంగా రెచ్చగొట్టే గర్ల్స్​.. తర్వాత మెల్ల మెల్లగా దగ్గరకు వస్తారు. తమకు కేటాయించిన టేబుల్​దగ్గర ఉండే అబ్బాయి, అంకుల్​పక్కన వెళ్లి కూర్చుంటారు. కవ్వించి.. మాటలతో మాయ చేసి బ్రాండ్​లిక్కర్​తెప్పిస్తారు. పీకల దాకా తాగిస్తారు. పెగ్గు పెగ్గుకో ఫుడ్​ఐటమ్​ఆర్డర్​పెట్టి బిల్లు వంద రెట్లు అయ్యేలా శాయశక్తులా కృషి చేస్తారు. చివరకు బిల్లు కట్టే టైంలో అక్కడి నుంచి మాయమవుతారు. 

ఎలా దొరికారంటే..

అబ్బాయిలు, అంకుల్స్​కు పబ్​కు వచ్చినప్పుడు ఉన్న సంతోషం.. వేలల్లో బిల్లు చూసేటప్పటికీ ఆవిరైపోయేది. దిక్కు లేని పరిస్థితుల్లో చాలా మంది వేసిన బిల్లు చచ్చినట్టు కట్టి బయటపడేవారు. ఈ విషయం అలా.. అలా ఎల్బీనగర్​ఎస్ఓటీ పోలీసులకు చేరింది. కొందరు ఫిర్యాదు చేయకపోయినా తాము తాగకపోయినా, తినకపోయినా అమ్మాయిలు ‘మత్తు’లో పడి వేలల్లో బిల్లు కట్టామని వారి దృష్టికి తీసుకువెళ్లడంతో నిఘా పెట్టారు. పక్కాగా నిర్ధారించుకుని సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పబ్​పై రైడ్​చేశారు. 

వెళ్లేటప్పటికీ కొంతమంది అమ్మాయిలు న్యూడ్, సెమీ న్యూడ్​గా డ్యాన్సులు చేస్తూ కనిపించారు. మరికొందరు అదేపనిగా ప్రతి టేబుల్​దగ్గర ఉండడంతో నిర్ఘాంతపోయారు. డ్రగ్ డిటెక్షన్ పరికరాలు, డాగ్ స్క్వాడ్ తో పబ్ లో తనిఖీ చేశారు. తమకు వచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకుని16 మంది యువతులను డీజే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని చైతన్య పురి పోలీసులకు అప్పగించారు. బార్ ఓనర్ రాము , మేనేజర్ సంతోశ్​పై కేసు నమోదు చేశామని, వీరిద్దరూ పరారీలో ఉన్నారని చైతన్యపురి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.