అదుపులోకి రాని మంటలు.. లాస్ ఏంజెలిస్ లో ఇండ్లు, అడవులు బుగ్గి..ఐదుగురు మృతి

  • చెలరేగుతున్న కార్చిచ్చు
  • లాస్ ఏంజెలిస్ లో ఇండ్లు, అడవులు బుగ్గి.. ఐదుగురు మృతి 
  • ఇంకా అదుపులోకి రాని మంటలు 
  • 1.37 లక్షల మంది తరలింపు 
  • హాలీవుడ్ కూ మంటల వ్యాప్తి
  • పలువురు సెలబ్రిటీల ఇండ్లు కూడా దగ్ధం 

వాషింగ్టన్:  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెలిస్ లో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. మంగళవారం లాస్ ఏంజెలిస్ కుఈశాన్య ప్రాంతంలో ప్రారంభమైన కార్చిచ్చు వల్ల ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు.

 సిటీలో ఖరీదైన ప్రాంతాలు అగ్నికీలలకు ఆహుతి అయ్యాయి. దాదాపు 1.37 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హాలీవుడ్  హిల్స్ లోనూ మంటలు వ్యాపించాయి. 

ఆ మంటలకు ‘సన్ సెట్  ఫైర్’గా పేరుపెట్టారు. 20 ఎకరాలకు వ్యాపించిన ఈ సన్ సెట్ ఫైర్.. రన్ యెన్  కన్ యోన్, వాటెల్స్ పార్క్  మధ్య ఇంకా మండుతూనే ఉంది. ఆస్కార్  అవార్డుల వేడుక జరిగే డాల్బీ థియేటర్ కూ ముప్పు పొంచి ఉందని అధికారులు చెప్పారు. 

మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లు ఎంతగా ప్రయత్నిస్తున్నా అదుపులోకి రావడం లేదు. బుధవారమంతా తరలింపు ప్రక్రియ చేపట్టారు. సెలబ్రిటీలు ఉండే హాలీవుడ్  బౌల్ వార్డ్ కు స్థానికులను తరలించారు. 

లాస్ ఏంజెలిస్, దాని పొరుగున ఉన్న వెంటూరా కౌంటీలో ఆరు కార్చిచ్చులు సంభవించాయని అధికారులు తెలిపారు. మొదట్లో పాలిసేడ్స్ లో ప్రారంభమైన కార్చిచ్చు లాస్ ఏంజెలిస్ చరిత్రలోనే అత్యంత భయంకరమైనదని చెప్పారు. 

ఈ దావానలం కారణంగా దక్షిణ కాలిఫోర్నియా అంతటా పొగ వ్యాపించిందని, దీంతో 1.7 కోట్ల మందికి గాలిపీల్చడం సమస్యగా మారిందని తెలిపారు.

25 లక్షల మంది చీకట్లోనే

కార్చిచ్చు కారణంగా వెంటూరా కౌంటీలో కరెంట్  సప్లై ఆగిపోయింది. దీంతో 15 లక్షల మంది బుధవారం అంతా చీకట్లోనే గడిపారు. లాస్ ఏంజెలిస్ కౌంటీలోనూ దాదాపు 10 లక్షల మందికి ఇదే సమస్య ఎదురైంది. 

దీనికితోడు మంటలను ఆర్పేందుకు చాలినన్ని నీళ్లు లేక ఫైర్ ఫైటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో ఉన్న ఈతకొలనులు, కుంటల నుంచి నీరు సేకరించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇక, వెల్డ్ ఫైర్  కారణంగా హాలీవుడ్  సెలబ్రిటీలు బిల్లీ క్రిస్టల్, మేండీ మూర్, జేమీ లీ కుర్టిస్, పారిస్  హిల్టన్  ఇండ్లు కాలి బూడిదయ్యాయి. మరికొందరి సెలబ్రిటీల ఇండ్లు కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. 

 కాగా, అధ్యక్షుడు జో బైడెన్  కొడుకు హంటర్  బైడెన్  ఇల్లు కూడా కార్చిచ్చులో కాలి బూడిదైపోయింది. ఆయన కారు కూడా దగ్ధమైంది.  మరోవైపు, కార్చిచ్చు కారణంగా ఆస్కార్  నామినేషన్లకు ఓటింగ్ ను రెండు రోజుల పాటు  వాయిదా వేశారు.  .