అమెరికాలో మళ్లీ కార్చిచ్చు: నార్త్​, సౌత్​ కరోలినాలోవేల ఎకరాలు బూడిద

అమెరికాలో మళ్లీ కార్చిచ్చు: నార్త్​, సౌత్​ కరోలినాలోవేల ఎకరాలు బూడిద
  • ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు 
  • మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఫైర్ ఫైటర్లు
  • పలు చోట్ల సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

కొలంబియా: అమెరికాలో మరో కార్చిచ్చు చెలరేగింది. మొన్నటిదాకా భయంకరమైన వైల్డ్ ఫైర్స్ తో కాలిఫోర్నియా రాష్ట్రంలో లక్షల ఎకరాల విస్తీర్ణంలో అడవులు బూడిదైపోగా.. తాజాగా నార్త్, సౌత్ కరోలినా రాష్ట్రాల్లోని అడవుల్లో మంటలు అంటుకున్నాయి. శనివారం రాత్రి రెండు రాష్ట్రాల్లోనూ వ్యాపించిన మంటలకు కొన్ని వేల ఎకరాలు కాలి బూడిదయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ175 వైల్డ్ ఫైర్లను గుర్తించారు. ఈ మంటల కారణంగా ఇప్పటి వరకూ 4,200 ఎకరాలు ఆహుతయ్యాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

సౌత్ కరోలినాలో ఆ రాష్ట్ర గవర్నర్  హెన్రీ మెక్ మాస్టర్  ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ రాష్ట్రంలోని మైర్ టెల్  బీచ్  ప్రాంతంలో ఎవాక్యుయేషన్  ఆర్డర్లు జారీ చేశారు. జనం వెంటనే వారి ఇండ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఆదివారం మధ్యాహ్నంలోపు 4.9 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మంటలు వ్యాపించాయని సౌత్  కరోలినా అటవీ అధికారులు తెలిపారు. 1200 ఎకరాలు తగలబడిపోయాయని చెప్పారు. 

అయితే, మంటల కారణంగా ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ ప్రాణాలు కోల్పోవడంగానీ, గాయపడడంగానీ సంభవించలేదని వెల్లడించారు. మొత్తం 410 మంది ఫైర్ ఫైటర్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇక, నార్త్ కరోలినాలో కూడా వైల్డ్ ఫైర్  తీవ్రంగా అంటుకున్నది. ఈ రాష్ట్రంలోని నాలుగు అడవుల్లో ఇప్పటివరకూ 400 ఎకరాలు మంటలకు కాలిపోయాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోల్క్  కౌంటీలోని ట్రయోన్  టౌన్ లో ప్రజలకు అధికారులు అలర్ట్  జారీ చేశారు. హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.