కార్చిచ్చులో 93 మంది మృతి

కార్చిచ్చులో 93 మంది మృతి
  • చనిపోయిన వారిని గుర్తించే పనిలో రెస్క్యూ  బృందాలు
  • మృతుల సంఖ్య పెరగవచ్చని అమెరికా అధికారుల ఆందోళన

లహైనా(హవాయి): అమెరికాలో హవాయి స్టేట్​లోని మౌయి ఐలాండ్ లో చెలరేగిన భీకర కార్చిచ్చులో మృతుల సంఖ్య 93కు చేరింది. గత శతాబ్ద కాలంలో అమెరికాలో ఇదే అతిభయంకరమైన అగ్నిప్రమాదం. ఈ దావానలంలో చనిపోయిన వారిని గుర్తించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. జాగిలాల సాయంతో మృతదేహాలను వెలికితీస్తున్నారు. వెలికి తీసిన డెడ్ బాడీలను డీఎన్ఏ టెస్టు కోసం తరలించారు. పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు  చెప్పారు. అగ్నిప్రమాదంలో మొత్తం లహైనా పట్టణమంతా కాలిపోయింది. ఇండ్లు, దుకాణాలన్నీ తగలబడిపోయాయి. చనిపోయిన వారిని గుర్తించడం చాలా కష్టంగా ఉందని, ఇప్పటి వరకూ ఇద్దరిని మాత్రమే గుర్తించామని అధికారులు తెలిపారు.

హవాయి చరిత్రలోనే అతిపెద్ద విపత్తు

లహైనా పట్టణాన్ని హవాయి స్టేట్  గవర్నర్  జాష్  గ్రీన్  శనివారం మరోసారి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హవాయి చరిత్రలోనే అది అతిపెద్ద విపత్తని పేర్కొన్నారు.  ‘‘దావానలంలో ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారిన వారికి ప్రస్తుతం ఇండ్లు ఏర్పాటు చేయడమే ఇప్పుడు ముఖ్యం. ఇండ్లు కోల్పోయిన వారందరికీ నివాసాలు ఏర్పాటు చేస్తం. బాధితుల కోసం ఎమర్జెన్సీ మేనేజర్లు ఇప్పటికే స్థలాల కోసం చూస్తున్నారు. కనీసం 4,500 మందికి షెల్టర్  అవసరం. వెస్ట్ మౌయి ప్రాంతంలోనే దాదాపు 2,200 బిల్డింగులు డ్యామేజ్  అయ్యాయి. వాటిలో 86 శాతం నివాస భవనాలే. డ్యామేజ్  అయిన విలువ మొత్తం రూ.49 వేల కోట్లు ఉండవచ్చు. రికవర్  కావడానికి చాలా కాలమే పట్టవచ్చు” అని జాష్​ పేర్కొన్నారు. కార్చిచ్చుకు కారణమేంటో తెలియరాలేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

కార్చిర్చులకు 85% మానవ తప్పిదాలే కారణం

అమెరికాలో 2000 నుంచి 2017 వరకు సంభవించిన కార్చిచ్చులకు మానవ తప్పిదాలే కారణమని యూఎస్  ఫారెస్ట్  సర్వీస్  గణాంకాలు చెబుతున్నాయి. చాలా మంది అడవుల్లో క్యాంపులకు వెళ్లినపుడు చెత్తను కాల్చేయడం, సిగరెట్లను ఆర్పివేయకుండా అలాగే పారేయడం వంటి చర్యలతో అడవులకు మంటలు అంటుకుంటున్నాయి. అగ్నిపర్వతాలు బద్దలై లావా కారణంగా మంటలు చెలరేగడం, పిడుగుపాటు వల్ల అగ్నిప్రమాదం జరిగి కార్చిచ్చుకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం కార్చిచ్చు సంభవించిన మౌయి టౌన్.. హవాయిలో అగ్ని పర్వతాలున్న ఆరు ప్రాంతాల్లో ఒకటి. తీవ్రమైన కరువు వల్ల ఆ ప్రాంతమంతా పొడిగా మారిందని, ఇది కూడా కార్చిచ్చుకు కారణమై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.