
- మంచిర్యాల జిల్లాలో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట
- ఫారెస్ట్ ఆఫీసర్లు వదిలిన జింకలు, దుప్పులు మాయం
- తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తున్న ఆఫీసర్లు
- వేటగాళ్లతో మిలాఖత్ అయి కేసుల నుంచి తప్పిస్తున్నారని ఆరోపణలు
మంచిర్యాల/జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లాలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. అడవితో పాటు శివారు ప్రాంతాల్లోని పొల్లాల్లో కరెంట్ వైర్లు పెట్టి జంతువులను హతమారుస్తున్నారు. వేటగాళ్లు ఏర్పాటు చేసే ఉచ్చులకు జింకలు, దుప్పులు, అడవి పందులు బలవుతున్నాయి. ఇలా చంపిన జంతువుల మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో అమ్ముకుంటున్నారు.
ఈ విషయం ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలిసినా తూతూమంత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. వేటను కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ఆఫీసర్లు వేటగాళ్లతో మిలాఖత్ అయి కేసుల నుంచి తప్పిస్తున్నారని.. ఇందుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
నీళ్ల కోసం పొలాల వైపు..
జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ కోర్, బఫర్ ఏరియా, ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిధిలో వందల సంఖ్యలో జింకలు, కృష్ణ జింకలు, దుప్పులు, నీలుగాయి, సాంబార్, అడవి పందులు, కుందేళ్లతో పాటు వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. ప్రస్తుతం ఎండకాలం కావడంతో అడవుల్లోని వాగులు, కుంటలు ఎండిపోయాయి. నీళ్లు దొరకక వన్యప్రాణులు దాహార్తితో తల్లడిల్లుతున్నాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంత సమీపంలోని పొలాల వైపు వస్తున్నాయి. ఇదే అదనుగా తీసుకున్న వేటగాళ్లు కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసి జంతువులను చంపుతున్నారు.
తర్వాత వాటి మాంసాన్ని కిలో రూ.500 నుంచి రూ.1000 చొప్పున అమ్ముతున్నారు. జన్నారం, చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ల పరిధిలో వన్యప్రాణుల వేట జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కడెం కెనాల్, గొల్లవాగు, నీల్వాయి వాగు, ర్యాలీవాగు ప్రాజెక్ట్‌లు, అటు ప్రాణహిత, గోదావరి తీర ప్రాంతాల్లో అటవీ జంతువులను వేటాడుతున్నారు. కొన్ని నెలల కిందట ఫారెస్ట్ ఆఫీసర్లు జింకలను తీసుకొచ్చి జైపూర్, భీమారం మండలాల్లోని అడవుల్లో వదిలిపెట్టారు. వీటిలో చాలా వరకు మాయమయ్యాయి. భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పెద్ద సంఖ్యలో జింకలను వేటాడుతున్నట్టు సమాచారం.
ఇటీవల జరిగిన ఘటనలు
మార్చి 31న జైపూర్ మండలం గంగిపల్లి శివారులోని పొలాల సమీపంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి రెండు చుక్కల దుప్పులు చనిపోయాయి.
కొంతకాలం కిందట భీమారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జింకను వేటాడాడు. ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందడంతో.. సదరు వ్యక్తి ఇంట్లో తనిఖీ చేయగా జింక తల దొరికింది. కానీ అతడు జింకను వేటాడలేదని, మేకలమంద వెంట ఉన్న కుక్కలు జింకను చంపాయని కేసును నీరుగార్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భీమారం మండలంలో అటవీ సమీప గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొంతకాలంగా జింకలను వేటాడుతూ మాంసం అమ్ముతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసిన వ్యక్తి, కలప దందా చేసే మరో వ్యక్తి వేట వెనుక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జైపూర్ మండలం ఇందారం, రసూల్‌పల్లి సమీపంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం కరెంట్ వైర్లు అమర్చగా వాటికి తగిలి రెండు గేదెలు చనిపోయాయి.
నాలుగు నెలల కిందట హాజీపూర్ మండలం కొలాంగూడకు చెందిన ఐదుగురు వ్యక్తులు సమీపంలోని అడవిలో కరెంట్ వైర్లు ఏర్పాటు చేసి ఓ సాంబార్‌ను చంపేశారు. వారిపై ఫారెస్ట్ ఆఫీసర్లు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఎలక్రిసిటీ యాక్ట్ 2003 కింద కేసు నమోదు చేశారు.
గతేడాది ఆగస్టులో చెన్నూర్ మండలం బుద్దారం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వేట కుక్కలతో నీల్గాయిని చంపి చింతలపల్లి దగ్గర మాంసం అమ్ముతుండగా ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. వీరిపై కేసు ఫైల్ చేసిన కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది.
నిందితులను తప్పించే ప్రయత్నం
వన్యప్రాణులను వేటాడి, వాటి మాంసాన్ని అమ్ముతున్న విషయం ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జైపూర్ మండలం గంగిపల్లిలో ఇటీవల రెండు చుక్కల దుప్పులను హతమార్చిన కొందరు వ్యక్తులు వాటి మాంసాన్ని అమ్ముతామని తెలిసిన వారికి సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు గంగిపల్లి శివారుకు రాగానే వారిని చూసి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మరో ఇద్దరు మాంసం అమ్ముతూ పట్టుబడ్డారు. అయితే నిందితుల వివరాలను.. మీడియా ప్రతినిధులు అడిగేంత వరకు ఆఫీసర్లు బయటపెట్టకపోవడంతో గమనార్హం.
పరారైన ఇద్దరి వివరాలు తెలిసినప్పటికీ వారిని పట్టుకోక పోగా.. కేసు నమోదైన ఇద్దరిని రిమాండ్‌కు తరలించలేదు. అయితే వారు దుప్పులను వేటాడలేదని, పొలాల్లో పెట్టిన కరెంట్ వైర్లకు తగిలి అవి చనిపోయాయంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పరారైన ఇద్దరిని కేసు నుంచి తప్పించేందుకు రూ.7 లక్షలకు డీల్ కుదిరినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. గంగిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంచిర్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌లోని ఇద్దరు ఆఫీసర్లతో మాట్లాడి డీల్ సెట్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎఫ్ఆర్‌వో రత్నాకర్‌ను వివరణ కోరగా.. ఆరోపణలను ఆయన ఖండించారు. చుక్కల దుప్పుల మాంసం అమ్ముతూ పట్టుబడిన వారిపై కేసు ఫైల్ చేశామని, ఆ ఫైల్ ప్రస్తుతం డీఎఫ్‌వో దగ్గర ఉందన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని చెప్పారు.