మానవ మేధస్సుకు ఏఐ సవాలుగా మారనుందా?

మానవ మేధస్సుకు ఏఐ సవాలుగా మారనుందా?

మానవులలో సహజ మేధస్సు అంటే జన్యుశాస్త్రం,  పరిణామం అనుభవాల ద్వారా రూపొందిన మెదడు సహజ పనితీరు నుంచి ఉత్పన్నమయ్యే సామర్థ్యాల ప్రక్రియలు.  వీటిలో  భావోద్వేగ ప్రక్రియలు, సృజనాత్మకత, సమస్య పరిష్కారం, సామాజిక  నైపుణ్యాలు,  స్వీయ అవగాహన ఉంటాయి.  కంప్యూటర్  ప్రోగ్రామింగ్ చేసిన  కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​) వలె కాకుండా  మానవ  మేధస్సు.. జీవశాస్త్రం,  భావోద్వేగాలు, అనుభవాలు  పర్యావరణంతో నిరంతర  పరస్పర చర్యల  ద్వారా రూపొందింది.  

ఇది ఆలోచన, హేతుబద్ధమైన అంశాలకు మాత్రమే పరిమితం కాదు.  సానుభూతి,  సృజనాత్మకత వ్యక్తిగత వృద్ధిని కూడా కలిగి ఉంటుంది. అయితే, కృత్రిమ మేధ మానవ  విధుల కంటే అల్గోరిథం, డేటా గణన ప్రక్రియల ద్వారా  పనిచేస్తుంది.  కృత్రిమ మేధస్సు అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం.  ఇది నిర్దిష్ట  పనులలో మానవ మేధస్సును అనుకరించగలడం లేదా అధిగమించగల వ్యవస్థలను  సృష్టించడానికి  ప్రయత్నిస్తుంది.  

సహజ మేధస్సు (మానవ మేధస్సు),  కృత్రిమ మేధస్సు (AI)  పరస్పరం ఆధారపడటం అనేది ఒక అవసరమైన సంక్లిష్టమైన సంబంధం.  ఈ  రెండు రకాల మేధస్సులు వాటి స్వభావంలో ప్రాథమికంగా భిన్నంగా ఉన్నప్పటికీ, ఒకటి  జీవసంబంధమైనది,  మరొకటి గణనపరమైనది.  సహజ మేధస్సు, కృత్రిమ మేధస్సుల  మధ్య సంబంధం వ్యతిరేకత కంటే సహజీవనమైనది.   కృత్రిమ మేధస్సు అనేది మానవ సామర్థ్యాలను పెంచగల,  విస్తరించగల  శక్తిమంతమైన సాధనం.   

అయితే,  కృత్రిమ మేధస్సు చేయలేని  నైతిక పర్యవేక్షణ,  సృజనాత్మకత, సూక్ష్మ నిర్ణయం తీసుకోవడానికి మానవ మేధస్సు అవసరం.  కృత్రిమ మేధస్సు  గణనశక్తితో  మానవ జ్ఞానం,  సృజనాత్మకత,  నైతిక విలువల కలయిక  సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి,  సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి  అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.  

సాధారణంగా కృత్రిమ మేధస్సు (AI)  మానవ మేధస్సును నాశనం చేస్తుందనే ఆందోళన నెలకొంది. ఇది  మన  సామర్థ్యాలు,  అభ్యాసం,  సామాజిక పరస్పర చర్యలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై వివిధ వాదనల నుంచి వచ్చింది.  ఏఐ  స్వయంగా సహజ మేధస్సును  నేరుగా నాశనం చేయకపోయినా, అది రోజువారీ జీవితంలో కలిసిపోయిన విధానం మానవ,  సామాజిక అభివృద్ధిపై  సూక్ష్మమైన ప్రభావాలను చూపుతుంది.

మానవ మేధస్సును ఎలా ప్రభావితం చేస్తుంది?

ఏదైనా విషయం గుర్తుచేసేందుకు,  దిశల గమనా గమనానికి (నావిగేషన్),  లెక్కింపులు వంటి సాధారణ  పనులను కృత్రిమ మేధస్సు చేపట్టడంతో,  మానవులు తమ సొంత జ్ఞాపకశక్తి  సమస్య పరిష్కార నైపుణ్యాలపై తక్కువ ఆధారపడవచ్చు.  స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌  బహుళ ప్రయోజనాలతో  ఇకపై  ఎక్కువ వాస్తవాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 

 ప్రపంచ స్థాన నిర్ణయ వ్యవస్థ(GPS)  సాంకేతికత  ప్రాదేశిక అవగాహన అవసరాన్ని,  మ్యాప్‌‌‌‌లను ఉపయోగించి  మార్గాలను  గుర్తుంచుకోవడానికి  నావిగేట్  చేసే  సామర్థ్యాన్ని తగ్గించింది.  సెర్చ్ ఇంజన్ల  వంటి  అనేక  కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు వినియోగదారులు  వెతకకుండానే సమాచారాన్ని అందిస్తాయి.  

2025లో  కృత్రిమ మేధస్సు ధోరణులు

2025లో  ప్రపంచ  కృత్రిమ మేధస్సు  మార్కెట్  $243.72  బిలియన్లకు  చేరుకుంటుందని అంచనా వేయడమైంది.  ఉత్తర  అమెరికా  $51.58  బిలియన్లతో  అగ్రస్థానంలో ఉంది.  ఆసియా -పసిఫిక్ $32.89 బిలియన్లతో, యూరప్ $26.54  బిలియన్లతో ఉన్నాయి.  ఎక్స్‌‌‌‌ప్లోడింగ్ టాపిక్స్ పూర్తి చేసిన పరిశోధన ప్రకారం, 77% కంపెనీలు తమ వ్యాపారాలలో  కృత్రిమ మేధస్సు  వాడకాన్ని  ఉపయోగిస్తున్నాయి.  83%  కంపెనీలు  తమ  వ్యాపార ప్రణాళికలలో  కృత్రిమ మేధస్సు అగ్ర ప్రాధాన్యత  అని పేర్కొన్నాయి. 

2030 నాటికి  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కృత్రిమ మేధస్సు 15.7  ట్రిలియన్ల అమెరికన్  డాలర్లును అందిస్తుందని అంచనా.  ప్రతి 10 సంస్థల్లో  9 సంస్థలు పోటీ ప్రయోజనం  కోసం  కృత్రిమ మేధస్సుకి మద్దతు ఇస్తున్నాయి.  2025 నాటికి  కృత్రిమ మేధస్సు 85 మిలియన్  ఉద్యోగాలను తొలగించవచ్చు.  కానీ, 97 మిలియన్   కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు.  ఫలితంగా 12 మిలియన్ ఉద్యోగాలలో నికరత వస్తుంది. 

మానవ మేధస్సు లేకుండా కృత్రిమ మేధస్సు లేదు

కృత్రిమ మేధస్సు మార్కెట్ పరిమాణం సంవత్సరానికి కనీసం 120%  పెరుగుతుందని అంచనా వేయడమైంది.  ఫోర్బ్స్ సంస్థ ప్రకారం,  వ్యాపారంలో  కృత్రిమ మేధస్సు  అత్యంత సాధారణ ఉపయోగాలు  కస్టమర్ సర్వీస్ లో  56%,  సైబర్ సెక్యూరిటీ మోసం నిర్వహణలో 51%,  డిజిటల్ పర్సనల్ అసిస్టెంట్లులో 47%,  కస్టమర్  రిలేషన్​షిప్​ మేనేజ్‌‌‌‌మెంట్ లో 46%,  ఇన్వెంటరీ మేనేజ్‌‌‌‌మెంట్ లో 40% గా అంచనా వేయడమైనది.  

అదేవిధంగా 2035 నాటికి $3.8 ట్రిలియన్ల లాభం చేకూరుతుందని ఓ అంచనా.  ఈ కృత్రిమ మేధస్సు ఆధారిత యుగంలో,  వ్యాపారాలు,  వినియోగదారులు, విధాన నిర్ణేతలు సహకరించడం అత్యవసరం. కృత్రిమ మేధస్సు నిజమైన సామర్థ్యం మన సమష్టి చేతుల్లోనే ఉంది.  మానవ మేధస్సు లేకుండా కృత్రిమ మేధస్సు లేదు.  కృత్రిమ మేధస్సుని  మానవులకు పూర్తి ప్రత్యామ్నాయంగా కాకుండా మానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే ఉత్పాదకత మెరుగుదల సాధనంగా చూడాలి.

ఏఐ  ప్రభావాన్ని ఎలా తగ్గించాలి?

ఆలోచనలు,  కంటెంట్,  డిజైన్‌‌‌‌లను  రూపొందించడానికి  కృత్రిమ మేధపై అతిగా ఆధారపడటం మానవ సృజనాత్మకత తగ్గడానికి దారితీయవచ్చనే ఆందోళన ఉంది.  ప్రజలు కృత్రిమ మేధ ఆధారిత సూచనలు లేదా కంటెంట్‌‌‌‌పై ఎక్కువగా  ఆధారపడటం ప్రారంభిస్తే,  వినూత్నంగా ఆలోచించే సొంత సామర్థ్యం తగ్గిపోవచ్చు.  కృత్రిమ మేధ  ద్వారా  వివిధ ఉద్యోగాలు,  పరిశ్రమల  ఆటోమేషన్  కూడా మానవ అభివృద్ధిని  ప్రభావితం చేస్తుంది.  

ప్రజలు తమ  సంప్రదాయ పాత్రల నుంచి  స్థానభ్రంశం చెందినప్పుడు, ఈ ఉద్యోగాలకు అవసరమైన సమస్య పరిష్కారం,  కమ్యూనికేషన్ ,  సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వారికి అవే అవకాశాలు ఉండకపోవచ్చు.  ఇది వ్యక్తిగత,  సామాజిక అభివృద్ధిలో స్తబ్ధతకు దోహదం చేస్తుంది.  

కృత్రిమ మేధస్సు మన దైనందిన జీవితాల్లో మరింత సమగ్రంగా మారుతున్నందున, మానవులు వారి సహజ మేధస్సును పెంపొందించుకోవడం కొనసాగించేలా చూసుకోవడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.  కృత్రిమ మేధస్సు సాధనాలపై అతిగా ఆధారపడటాన్ని పరిమితం చేయడం సమగ్ర శ్రేయస్సుపై దృష్టి పెట్టడం చేయాలి. 

- డా. పి.ఎస్.చారి, ప్రొఫెసర్-