హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు హాజరు కావాలని నటుడు అల్లు అర్జున్‌కి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2024, డిసెంబర్ 24 ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు పోలీసులు. దీంతో పోలీసుల విచారణకు అల్లు అర్జున్ హాజరు అవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పోలీసుల నోటీసులతో బన్నీ అలర్ట్ అయ్యారు. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 23) రాత్రి తన ఇంట్లో లీగల్ టీంతో బన్నీ చర్చలు జరిపారు. విచారణకు హాజరవ్వాలా..? సమయం కోరలా..? అనే దానిపై న్యాయవాదుల నుండి బన్నీ ఓపినియన్ తీసుకున్నట్లు సమాచారం.
ఒక వేళ విచారణకు వెళ్తే పోలీసులు ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది.. వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనే దాని గురించి అడిగి తెలుసుకున్నట్లు టాక్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్న అల్లు అర్జున్ ఇవాళ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పుష్ప 2 ఇష్యూ ఇప్పటికే ముదరడంతో దానిని మరింత పెద్దది చేయకుండా పోలీసుల విచారణకు హాజరు కావాలని బన్నీ నిర్ణయించకున్నాడట. మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు స్టైలిస్ స్టార్ బయలుదేరనునట్లు సమాచారం.
ALSO READ : దా..పుష్ప..విచారణకు రావాలని అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ను విచారించి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియో ఆధారంగా బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలిసింది. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని బన్నీ నివాసం వద్ద ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడానికి జూబ్లీహిల్స్ పోలీసులు రెండు ప్లాటున్స్ సిద్ధం చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు కూడా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో పీఎస్ దగ్గర కూడా పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు.