
- ప్రాజెక్టు ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకొస్తుందా?
- ఇప్పటికే పంప్‌హౌస్ తవ్వకం 90%, అప్రోచ్ చానెల్ పనులు 14% పూర్తి
- వాటిని పూడ్చడం, అడవులను పెంచడం పెద్ద సవాలే
- అవన్నీ చేస్తేనే ఈసీ వస్తుందంటున్న ఎక్స్‌పర్ట్స్
- కూటమిని అడ్డుపెట్టుకుని ఈఏసీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ కుట్రలు!
హైదరాబాద్, వెలుగు: రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీశైలం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తోడేసుకుని రాయలసీమకు తరలించే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుందా? వెనకడుగు వేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఎక్స్‌పర్ట్స్ అప్రైజల్స్కమిటీ (ఈఏసీ) మీటింగ్‌లో ప్రాజెక్టు పనులను ఆపేసి ఆ ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే ఏపీ అక్కడ పనులను చాలా వరకు చేసేసింది.
డీపీఆర్మాటున తవ్వకం పనులను 90% చేసింది. దాంతోపాటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్‌కు అప్లై చేసుకోవడంతో.. ప్రాజెక్ట్ పనులు డీపీఆర్వరకే చేశారా? లేదంటే ఎక్కువ చేశారా? అంటూ ఈఏసీ ప్రశ్నించింది. పంప్‌హౌస్ పనులు 90% పూర్తికాగా.. అప్రోచ్ చానెల్ పనులు 14% వరకు కంప్లీట్చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని యథాతథ స్థానానికి తీసుకురావాలంటే వాటన్నింటినీ పూడ్చేయాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్చెబుతున్నారు.
ఇప్పటికే అక్కడ పర్యావరణానికి నష్టం జరిగిందని, దానిని భర్తీ చేసేందుకు అడవులను ఏపీ ఎలా రీస్టోర్ చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికిప్పడు అడవుల పెంపకం అన్నది సవాలుతో కూడుకున్నదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. పూర్వ స్థితికి తీసుకొచ్చాకే ఏపీ ప్రాజెక్టుకు మళ్లీ కొత్తగా ఈసీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాకాని పక్షంలో ప్రాజెక్టు ముందుకు పడే పరిస్థితులు లేవని చెబుతున్నారు. ఇటు ప్రాజెక్టును పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ఎలాంటి పద్ధతులు పాటిస్తుందన్నదీ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మళ్లీ కుట్రలకు
ఇప్పటికే గోదావరి– బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు, ఆర్థిక సాయం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ కుట్రలకు తెరలేపారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ప్రాజెక్ట్ విషయంలోనూ కూటమిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేసే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు.
ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేందుకు సన్నాహాలూ చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. కూటమిని అడ్డుపెట్టి ఈఏసీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టును ప్రారంభించిన నేపథ్యంలో ఆ పనులను మళ్లీ పూర్వ స్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఉండదని కేంద్రానికి చెప్పేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అవసరమైతే పర్యావరణానికి జరిగిన నష్టానికిగాను పెనాల్టీ చెల్లించేందుకు రెడీ అవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తగ్గేది లేదంటున్న తెలంగాణ..
రాయలసీమ లిఫ్ట్ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలంగాణ సర్కార్ తేల్చి చెబుతున్నది. ఆ ప్రాజెక్టును ఆపేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. రైతు గవినోళ్ల శ్రీనివాస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వేసిన పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యింది. కానీ, ఏనాడూ గట్టిగా వాదనలు వినిపించిన పాపానపోలేదు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆ ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి వేర్వేరుగా లేఖలు రాశారు.
ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఏపీ చేపడుతున్న ఆ అక్రమ ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ట్రిబ్యునల్‌లోనూ రాయలసీమ లిఫ్ట్‌కు వ్యతిరేకంగా మన అధికారులు గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే నీటి వాటాల్లో తీవ్రమైన అన్యాయం జరిగిందని, కేటాయింపులు తేలకుండానే ఏపీ ప్రాజెక్టులను చేపడుతూ కుట్రలకు తెరదీస్తున్నదని ట్రిబ్యునల్‌లో, కేంద్రానికీ పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇప్పటికే 4 గేట్లున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 14 గేట్లకు పెంచి లక్షన్నర క్యూసెక్కులు తీసుకుపోయేలా చేశారని, ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే శ్రీశైలంలో కనీసం అడుగు కూడా మిగలదని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నీళ్లన్నీ కిందకు వెళ్లకుండానే వెనకనుంచి వెనక్కే ఏపీ మళ్లించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టును అడ్డుకుని తీరేలా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తున్నది.