‘‘జుట్టు రాలుతోంది.. నూనె పెట్టొచ్చు కదా! జుట్టు బాగా పెరగాలంటే తలకి నూనె పెడుతుండాలి. నూనె పెట్టకపోతే జుట్టు ఎర్రగా అవుతుంది. చివర్లు చిట్లిపోతాయి. తెల్లజుట్టు తొందరగ వస్తుంది. అప్పట్లో నూనె మంచిగ పెట్టుకునేవాళ్లం. అందుకే ఇంత వయసొచ్చినా మాకు తెల్ల జుట్టు రాలేదు. మీకు చిన్న వయసుకే వస్తోంది’’ అంటుంటారు చాలామంది అమ్మలు. జుట్టు విషయానికొచ్చేసరికి అమ్మ, అమ్మమ్మ, నానమ్మ అందరిదీ ఇదే మాట. మరి ఇంతకీ నూనె పెట్టాలా? వద్దా?
నూనె పెడితే జుట్టు పెరుగుతుందని అందరూ చెప్తుంటారు. అందుకోసం నేచురల్, హెర్బల్ ఆయిల్ అంటూ మార్కెట్లో ఉన్న అన్ని రకాల నూనెలు ట్రై చేస్తుంటారు కొందరు. కానీ, తలకు నూనె పెట్టడం వల్ల జుట్టు పెరగదు. జుట్టు దానంతట అది నేచురల్‌గా పెరగాలే తప్ప, నూనె పెట్టడం వల్ల జుట్టు పెరగడం అనేది ఉండదు అంటున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ జై శ్రీ శరత్.
అలాగే చుండ్రు సమస్యకు కూడా నూనె పెట్టడమే పరిష్కారం అనుకుంటారు. అది కూడా నిజం కాదు. చుండ్రు అనేది స్కాల్ప్ కండిషన్‌ని బట్టి వస్తుంది. దాన్ని పోగొట్టాలంటే వేరే మార్గాలున్నాయి అన్నారు కూడా.
నూనె ఎందుకంటే...
నూనె పెట్టడం వల్ల మాడు చల్లబడుతుంది. ప్రొటీన్‌ను జుట్టుకు అందిస్తుంది. రోజంతా పనిచేసి మెదడు అలసిపోతుంది. కాసేపు నూనెతో మర్దన చేస్తే ఆ ఒత్తిడి తగ్గుతుంది. ఒంట్లో ఉన్న వేడి తలలో నుంచి బయటకు వచ్చేస్తుంది. అంతేకాకుండా రెగ్యులర్‌గా నూనె రాసుకోవడం వల్ల జుట్టుకు మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. కొబ్బరి, బాదం, ఉల్లి గడ్డతో చేసే నూనెలు జుట్టుకు కండిషనర్‌లా పని చేస్తాయి. నూనె రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లకు పోషణ అందుతుంది. దాంతో జుట్టు పొడిబారదు. అంతేకాదు, జుట్టు కుదుళ్లకు ఒక పొరలా రక్షణ ఇస్తుంది. కాబట్టి జుట్టుకు నూనె రాసుకోవాలి. అంతేకానీ జుట్టు పెరగాలని నూనె రాస్తుంటే కనుక అది అపోహే.