2022 ఫిబ్రవరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అందరూ ప్రధాని నరేంద్రమోడీ, ఇతర నాయకుల గురించే మాట్లాడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కొద్ది ప్రాధాన్యతను మాత్రమే ఇస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో బిగ్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు కేజ్రీవాల్‌కు లేకపోలేదు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేజ్రీవాల్ పోటీ చేసినప్పుడు అందరూ ఆయనను తక్కువ అంచనా వేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 2013లో ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు కేజ్రీవాల్. 2015లోనూ, 2020లోనూ కేజ్రీవాల్ ఢిల్లీ పీఠం నిలబెట్టుకున్నారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీని, అలాగే దిగ్గజ నాయకురాలు షీలా దీక్షిత్‌ను కేజ్రీవాల్ దాదాపు కనుమరుగు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం కేజ్రీవాల్ పార్టీ పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుని పోటీ చేస్తోంది. కొన్ని సర్వేల ప్రకారం.. కేజ్రీవాల్ పార్టీ పంజాబ్‌లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, గోవాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వొచ్చు. ఒకవేళ పంజాబ్‌లో కేజ్రీవాల్ విజయం సాధించినట్లయితే, అది దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. అంతేకాదు 2024లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను లీడ్ చేసే అవకాశం కేజ్రీవాల్‌కు దక్కినా దక్కొచ్చు.
ఒంటరిగా ఎదిగి..
కేజ్రీవాల్ వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదు. అలాగే మూలాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్ మాదిరిగా జనతా పార్టీలో ముఖ్యమంత్రులుగా ఉండి.. ఆ తర్వాత జనతా పార్టీని చీల్చి అధికారాన్ని దక్కించుకోలేదు. ద గ్రేట్ తమిళియన్ కరుణానిధి 1969లో అన్నాదురై మరణం తర్వాత డీఎంకే పార్టీని చేజిక్కించుకున్నారు. 1920లో ఏర్పాటైన అకాలీదళ్‌ను ఆ తర్వాత పంజాబ్‌కు చెందిన బాదల్స్ సొంతం చేసుకున్నారు. అయితే కేజ్రీవాల్ పార్టీ కులం, మతం ఆధారంగా ఏర్పాటైనది కాదు. కొత్తతరాన్ని రాజకీయాల్లోకి ఆకర్షించారు కేజ్రీవాల్. అప్పటి వరకు ఉన్న పార్టీకి కొత్త వారికి అవకాశాలు ఇచ్చేవి కావు. ప్రోత్సహించేవి కావు. బాగా డబ్బున్నోళ్లయితేనే వారికి అవకాశం దక్కేది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాగా డబ్బున్నోళ్లు పార్టీల టికెట్లు సాధించడమే ఇందుకు ఉదాహరణ. కొత్త వారికి ఒక పార్టీ అవకాశం కల్పించినట్లయితే, ఆటోమాటిక్‌గా యంగ్ దళిత్, ట్రైబల్, మైనార్టీ, మిగతా కులాల వారికి ఒక అవకాశం దక్కుతుంది. దీంతో మంచి శక్తి కలిగిన జనం కేజ్రీవాల్‌కు చేరువయ్యారు.
నిజాయితీనే ఆయన ఇమేజ్
1. కేజ్రీవాల్‌కు నిజాయితీ కలిగిన పోరాటయోధుడనే ఇమేజ్ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేజ్రీవాల్ అవినీతి, అక్రమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అవినీతి వాసన కూడా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగతా ముఖ్యమంత్రుల మాదిరిగా కాకుండా, భారీ కాన్వాయ్‌లను కేజ్రీవాల్ అనుమతించడం లేదు. పెద్ద సంఖ్యలో పోలీసులను కూడా తన చుట్టూ ఉంచుకోవడం లేదు. నడమంత్రపు సిరితో జనాలకు దూరం కావడం లేదు. హుందాగా ప్రవర్తిస్తున్నారు. ఈ పద్ధతి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వర్గాలను, చదువుకున్న వారిని ఎట్రాక్ట్ చేస్తోంది.
2. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. రోజు లక్షలాది మంది ఢిల్లీకి రాకపోకలు సాగిస్తుంటారు. అన్ని హిందీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చి ఉద్యోగాలు, పనులు చేసుకునే వారు ఎందరో. ఎప్పుడు అందుబాటులో ఉండటం ద్వారా కేజ్రీవాల్ అంటే ఏమిటో దేశవ్యాప్తంగా తెలుస్తోంది.
3. అలాగే కేజ్రీవాల్ కులం, మతం చివరికి ఆదాయంతో కూడా అడ్డంకులు లేని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. వీటి అమలులో ఎలాంటి వివక్షతకు తావు ఇవ్వడం లేదు. అందువల్ల కేజ్రీవాల్‌కు వీటి వల్ల శత్రువులు ఏర్పడటం లేదు. అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, కొన్ని కులాల ఆధారంగా స్కీములను ప్రవేశపెట్టడం వల్ల అలాంటి పథకాల ద్వారా లాభం పోందలేని ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం పెరుగుతోంది.
4. తనకు ఎలాంటి సిద్ధాంతాలు లేవన్న ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తాను ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉన్నానని ఆయన తన చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నారు. అలాగే, మైనార్టీస్ కూడా కేజ్రీవాల్‌కు ఓటు వేస్తున్నారు. ఎందుకంటే ఆయనను బలమైన యాంటీ బీజేపీ పొలిటీషియన్‌గా వారంతా చూస్తున్నారు. కేజ్రీవాల్ తన కులం గురించి కూడా ఎక్కడా ప్రస్తావనకు రాకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు అవకాశాలు
వచ్చే ఏడాది ఎలక్షన్లు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ కేజ్రీవాల్ పార్టీ పోటీ చేస్తోంది. అయితే సర్వేలన్నీ కూడా పంజాబ్‌లో గెలిచేది కేజ్రీవాలే అని చెబుతున్నాయి. అలాగే గోవా, ఉత్తరాఖండ్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నాయి. ఒకవేళ పంజాబ్‌లో కేజ్రీవాల్ విజయం సాధించినట్లయితే అది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించడం ఖాయం. అప్పుడు ఢిల్లీకి బయట కూడా బలమైన నాయకునిగా కేజ్రీవాల్ నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితం అవుతాయి. ఆ రాష్ట్రంలోనే బలంగా ఉంటాయి. మమతాబెనర్జీ, శరత్ పవార్ లేదా ఏ ఇతర ప్రాంతీయ పార్టీ నాయకుడైనా తన రాష్ట్రాలకు బయట బేస్‌ను ఏర్పాటు చేసుకోవడం సత్తా చాటడం అంత సులువు కాదు. అందువల్ల ఒకవేళ కేజ్రీవాల్ పంజాబ్‌ను చేజిక్కించుకున్నట్లయితే, రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ లీడర్‌గా ఆయన నిలిచిపోతారు.
కేజ్రీవాల్ గెలిస్తే.. విన్నర్, లూజర్స్ ఎవరంటే..
1. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో కేజ్రీవాల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే దాని వల్ల ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే. కేజ్రీవాల్ ఢిల్లీలో గెలిచినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకుగానూ కనీసం ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. అదే పరిస్థితి పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లోనూ రిపీట్ అయితే, కాంగ్రెస్ ఓట్లన్నీ కేజ్రీవాల్‌వైపు వెళ్లిపోతాయి. ఒకవేళ కాంగ్రెస్ పంజాబ్‌లో ఓటమి పాలైతే, అప్పుడు రాహుల్‌గాంధీ మరిన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పంజాబ్‌లో వ్యవహరించిన తీరు.. కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ను వెళ్లగొట్టడంపై ఆయన ముప్పేట దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
2. రాహుల్‌గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీలకు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే టార్గెట్ ఉంది. కానీ, ఒకవేళ కేజ్రీవాల్ మంచిగా పర్ఫార్మ్ చేసినట్లయితే, మీడియాతో పాటు జనాల అటెన్షన్ కూడా కేజ్రీవాల్ వైపు మళ్లుతుంది. నరేంద్రమోడీకి జాతీయ స్థాయిలో ఆల్టర్నేటివ్గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
3. కాంగ్రెస్‌పార్టీ అంటే పడని లేదా దూరంగా ఉండే చాలా ప్రాంతీయ పార్టీలు కేజ్రీవాల్‌ను ఎంకరేజ్ చేయవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో కేజ్రీవాల్ న్యూట్రల్‌గా ఉంటారు. అలాగే కేజ్రీవాల్ వ్యక్తిత్వం బెదిరింపు ధోరణిలో ఉండదు. కేజ్రీవాల్ లోపల ఎలా ఉన్నాసరే.. బయటకు మాత్రం మిడిల్‌క్లాస్ మనిషిగా, సింపుల్‌గా, నిజాయితీగా ఉండటం ఆయనకు కలిసి వస్తుంది.
4. ఇక వాస్తవంలోకి వస్తే, కేజ్రీవాల్ వల్ల బీజేపీకి ఎలాంటి ముప్పు ఉండదు. బీజేపీ కేజ్రీవాల్‌పై తరచుగా మాటల దాడి చేస్తోంది. అయినా, కేజ్రీవాల్ వల్ల ఓట్ల పరంగా బీజేపీకి ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇతర పార్టీల పునాదులను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కేజ్రీవాల్ రాజకీయంగా ప్రాణ సంకటంగా మారే అవకాశం ఉంది.
8 వారాలు చాలా ఎక్కువ టైమే..
కేజ్రీవాల్ నేషనల్ జర్నీ మొదలు కావాలంటే.. ముందుగా ఆయన పంజాబ్ లేదంటే ఏదైనా వేరే రాష్ట్రంలో విజయం సాధించాలి. ఇప్పటికీ ఇంకా 8 వారాల సమయం ఉంది. ఈ సమయంలో చాలా మార్పులు రావొచ్చు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి హరాల్డ్ విల్సన్ 55 ఏండ్ల క్రితం ‘రాజకీయాల్లో ఒక వారం అనేది చాలా ఎక్కువ సమయం’ అని ఒక మాట చెప్పారు. అంటే 8 వారాలంటే కొన్ని జీవిత కాలాలుగా లెక్క వేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవడమో లేదా ఓడటమో జరగొచ్చు. ఎన్నికల ఫలితాలు కూడా గందరగోళంగా పెద్దగా మార్పులు లేకుండా ఉండొచ్చు. అలాగే భవిష్యత్‌ను ఇప్పుడే అంచనా వేయడం కూడా కష్టం. నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతాబెనర్జీ లేదా కేజ్రీవాల్ ఈ ఐదు రాష్ట్రాల్లో నేరుగా తలపడటం లేదు. కానీ, ఈ ఎన్నికల ఫలితాలు వీరందరిపైనా ఎంతో ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంది.
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్