
తెలంగాణలో బీసీవాదం రాజకీయంగా ప్రధానంగా మారినప్పటికీ.. అది బీసీల రాజ్యాధికార దిశగా చేరుతుందా? అనేది పెద్ద ప్రశ్న. రాష్ట్ర రాజకీయాలు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే, బీసీ సంఘాల ఐక్యత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ ముఖ్యమంత్రి వాదనను బలంగా వినిపించింది. కానీ, అదే సమయంలో బీజేపీ బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు బీసీ సంఘాల నుంచి వస్తూనే ఉన్నాయి.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో నష్టం కలిగిస్తాయని ఒకవైపు భారతీయ జనతా పార్టీని బీసీ వ్యతిరేక పార్టీగా విమర్శిస్తూనే మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గెలుపును బీసీ సంఘాలు తమ విజయంగా పేర్కొనడం కొంత అయోమయాన్ని కలిగిస్తోంది.
ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి మాదిగల ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకున్న బీజేపీ.. బీసీ ఉద్యమ నాయకులు ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా బీసీ ఓటు బ్యాంకుపై గురిపెట్టింది.
బీసీ ఓట్లపై బీఆర్ఎస్ గురి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నామని చెపుతున్నా.. కొన్ని విషయాలలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటోంది. కామారెడ్డి డిక్లరేషన్ బీసీల సాధికారత కోసం కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అది కార్యరూపం దిద్దుకునే అవకాశం ఇంకా లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేసినప్పటికీ, బీసీల జనాభాను తక్కువగా చూపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ అనుకూలతపై బీసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాగలమనే నమ్మకంతో పనిచేస్తోంది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే బీసీల జనాభాకు అద్దం పట్టిందని బీసీ సంఘాలు భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీ పోరాటాలకు మద్దతు ఇవ్వడం ద్వారా బీసీ ఓట్లను సాధించాలనే వ్యూహంతో ఉంది.
ఇందులో భాగంగానే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి మద్దతు తెలిపింది. ఇటీవల శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసినా, కవిత మాత్రం బీసీల పక్షాన మాట్లాడడానికి సభలోనే ఉన్నారు. బీసీల పల్లకి మోయడానికి కవిత ముందుకొస్తే తమకు అభ్యంతరం ఎందుకు ఉంటుందని బీసీ నాయకులు అంటున్నారు.
బీసీ ఓటు బ్యాంకు వల్ల ఎవరికి ప్రయోజనం?
ప్రస్తుతం బీసీ ఓటు బ్యాంకు పూర్తిస్థాయిలో ఏ పార్టీకి ప్రయోజనం కలిగించనట్లు కనిపిస్తోంది. బీసీ వర్గ మద్దతు బీజేపీకి లభిస్తే, అది కాంగ్రెస్, బీఆర్ఎస్ కు నష్టం. కాంగ్రెస్ బీసీలను ఆకర్షించడానికి ప్రయత్నించినా, పూర్తిస్థాయిలో వేరే వర్గాల మద్దతు కోల్పోవచ్చు. బీఆర్ఎస్ తిరిగి బీసీ వర్గాన్ని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బలమైన ఆధిపత్యం సాధించలేకపోతుంది.
ఇప్పటివరకు వివిధ రాజకీయ పార్టీలలో బీసీ అభ్యర్థులు గెలిచినా, బీసీల సాధికారతకు పెద్దగా ప్రయోజనం కలగలేదనే వాదన బలంగా ఉంది. దీనికి ప్రధాన కారణం బీసీలకు ప్రత్యేక రాజకీయ శక్తిగా మారే అవకాశం లేకపోవడం. బీసీవాదంతో కొందరు
వ్యక్తులు ఎదుగుతున్నారే తప్ప, ముఖ్యమంత్రి పీఠాన్ని పొందలేకపోతున్నామనే నిస్పృహ బీసీల్లో ఉంది. పార్టీలు సైతం ముఖ్యమంత్రి పీఠానికి బీసీలను అంతే దూరంలో ఉంచాయి. తెలుగుదేశం పార్టీలో దేవేందర్ గౌడ్, టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీలో డీ..శ్రీనివాస్ వంటివారిని నెంబర్ 2 స్థానానికే పరిమితం చేశారు.
బీసీ పార్టీ ఏర్పాటుకు ప్రాధాన్యం
ప్రస్తుతం బీసీలు ఎదుర్కొంటున్న పరిస్థితిని మార్చాలంటే స్వతంత్రంగా బీసీ రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి. ఒక బీసీ- కేంద్రిత పార్టీని ప్రారంభించి, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వ్యూహాత్మకంగా ప్రయోజనం కలిగించవచ్చు. దీనికి తాజా ఉదాహరణ పవన్ కల్యాణ్ వ్యూహం.
గత ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి భంగపడ్డా, మళ్ళీ తేరుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని డిప్యూటీ సీఎం కాగలిగారు. రాబోయే ఎన్నికలలో స్వతంత్రంగా ఎదగడానికి ఒక బాట వేసుకున్నారు. ఇదే ఫార్ములాను తెలంగాణలో సైతం బీసీ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ప్రయోగించాలి. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా, ఇప్పటివరకు బీసీ సంఘాల మధ్య విభేదాలు స్పష్టంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.
బీసీ జాక్!
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణవాదులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆంధ్రవారిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ వాడిన భాష, వ్యూహాన్ని తీన్మార్ మల్లన్న ప్రయోగిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. యువతను ఆకర్షించడంలో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. కొన్ని దశాబ్దాలుగా బీసీల కోసం పనిచేస్తున్న సంగెం సూర్యారావుతో కలిసి బీసీ జాక్ ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించారు.
బీసీ నాయకులు ఈసారి రాజ్యాధికార దిశగా పనిచేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. బీసీ ఐక్యత మరింత బలోపేతం కావాలి. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు స్వతంత్ర అభ్యర్థులను నిలపడం, బీసీ సంఘాలు మద్దతుగా నిలిచి కొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించగలిగితే భవిష్యత్తులో బీసీ రాజకీయ పార్టీకి అవకాశం ఉంటుంది.
- యర్రమాద , వెంకన్న నేత-