
చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం జూన్ 2న కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని వాసవి గార్డెన్‌లో నిర్వహించిన అఖిలపక్ష, జేఏసీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. చేర్యాల 60 ఏళ్ల కిందనే నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీగా, వరంగల్ జిల్లాలో పంచాయితీ సమితిగా, తాలూకా కేంద్రంగా, అసెంబ్లీ కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. అభివృద్ధిలో హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, ఆలేరు పట్టణాల కంటే ముందుండేదన్నారు.
కానీ, పాలకుల నిరాదరణకు గురై చిన్న మండలంగా మారిందని వాపోయారు. కనీసం రెవెన్యూ డివిజన్ చేయాలని కోరినా నేటి పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జూన్ 2న అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యోగులతో మీటింగ్ పెట్టి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆగంరెడ్డి, మల్లారెడ్డి, ఆది శ్రీనివాస్, అందె అశోక్, అందె బీరయ్య, కొమ్ము నర్సింగరావు, కళావతి, యాదయ్య, బుట్టి సత్యనారాయణ, తడ్క లింగమూర్తి, ఈరి భూమయ్య, ప్రశాంత్, రాజు, రాజిరెడ్డి, రాము, సుదర్శన్, అరుణ్ కుమార్
పాల్గొన్నారు.