ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని ‘భూమాత’ పథకంగా మార్చి అందులోని లోపాలను సరిచేయడానికి ఐదుగురితో కమిటీ వేయడం హర్షించదగ్గ విషయం. ఈ దిగువ లోపాలను సరిచేయడం ద్వారా భూమాత పథకాన్ని రైతులకు అందుబాటులోకి తేవాలి. గత ప్రభుత్వం రెవెన్యూ చట్టం ‘పాసుపుస్తకాల చట్టం - 1971’ లోని సెక్షన్ 26ను మార్పు చేస్తూ 2020 సెప్టెంబర్ 9న శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా రూపొందించారు. దానికి ‘ధరణి’ అని పేరు పెట్టారు. 17 సెక్షన్లతో ఈ చట్టాన్ని రూపొందించారు.
ఈ చట్ట మార్పిడితో రైతుల సమస్యలు అన్ని పరిష్కారం అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గత లోపాలకు తోడు, అదనపు లోపాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం నాటి ఆర్థికమంత్రి హరీష్‌రావు నాయకత్వాన వేసిన కమిషన్ కూడా ధరణిలో 20 లోపాలు ఉన్నట్లు గుర్తించింది. మీ సేవ ద్వారా లోపాలు సరిదిద్దుకోవాలని చెప్పినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్కలోపం సరికాలేదు.
అసైన్డ్ భూముల అక్రమ స్వాధీనం
ధరణిని ప్రారంభించిన ప్రభుత్వం దళితుల, వెనకబడిన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తమ ఫాంహౌస్‌ల కోసం బలవంతపు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు ‘ప్రజావాణిలో వేల దరఖాస్తులు వచ్చాయి. పల్లెవనం, డబుల్బెడ్రూం, ప్రాజెక్టులు, రహదారుల పేరుతో పేదల భూములను నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
పట్టాదారుకు, సాగుదారుకూ పాస్‌బుక్ ఇవ్వాలి
పురాతన కాలం నుండి వస్తున్న రెవెన్యూ రికార్డుల్లోని ‘సాగుదారుల కాలం(ఖాస్తు కాలం)ను తొలగించారు. దీని వల్ల వాస్తవ సాగుదారులకు నష్టం వాటిల్లింది. తెలంగాణలో సాదాబైనామాలపై కొనుగోలు చేసినవారు, కౌలుకు చేసేవారు, భూములు తాకట్టు పెట్టుకున్నవారు తమ హక్కులు కోల్పోయారు. రెవెన్యూచట్టంలోని సెక్షన్-26 ప్రకారం (1) పట్టాదారుకు (2) వాస్తవ సాగుదారుకు (3) కౌలుదారుకు (4) స్వాధీనపు దారుకు పాసుపుస్తకాలు ఇవ్వాలి. పట్టాదారుకు ఇచ్చే పాసుపుస్తకంతో పాటు, వాస్తవ సాగుదారుకు మరో పాసుపుస్తకం ఇవ్వాలని చట్టం చెప్పింది. దాన్ని గత ప్రభుత్వం తొలగించడం వల్ల లక్షల మంది తమ స్వాధీనపు హక్కును కోల్పోయారు. రెవెన్యూ రికార్డుల్లో తిరిగి సాగుదారుల కాలం (కౌలుదారుల కాలం)ను పెట్టాలి.
రెవెన్యూ కోర్టులను పునరుద్ధరించాలి
గతంలో తహశీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ కోర్టుల్లో రెవెన్యూ కేసులు ఫైల్ చేశారు. ఈ మూడు కోర్టులను గత ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఆ కోర్టుల్లో నడుస్తున్న అసంఖ్యాక కేసులను రద్దు చేశారు. ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రతి వివాదం ఉన్న రైతు సివిల్ కోర్టుకు వెళ్ళడం సాధ్యంకాని పని. అందువల్ల రైతులకు అందుబాటులో ఉన్న రెవెన్యూ కోర్టులను పునరుద్ధరించాలి. ఉభయుల రిజిస్ర్టేషన్‌లో ‘22ఎ నిషేధ రిజిస్టర్’ను విస్తరించారు. గతంలో ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు, అడవి బంజర్లకు మాత్రమే వర్తించిన ఈ నిషేధ చట్టాన్ని పట్టాదారులకు కూడా అన్వయింపజేశారు. ఒక భూమిలో కొంతభాగం రిజిస్ట్రేషన్ చేసి మిగతా భూమిని 22ఎ కింద నిషేధించారు.
కౌలుదారులకు కార్డులు ఇవ్వాలి
గ్రామసభల ద్వారా కౌలుదారులను గుర్తించాలి. ఒక సంవత్సరానికి ఉపయోగపడే విధంగా ‘లోన్ ఎలిజిబులిటీ కార్డు’ను ఇవ్వాలి. గతంలో 2011 చట్టం ప్రకారం కార్డులను ఇచ్చినప్పటికీ దానిలో ‘ఈ కార్డు పట్టాదారుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యంగా చెల్లదు’ అని రాయబడింది. అందువల్ల ఒక సంవత్సరానికి సంబంధించి (1) బ్యాంకు రుణాలు (2) పంటల బీమా(3) ప్రభుత్వ పరిహారాలు (4) ప్రభుత్వ పథకాలు, - సబ్సిడీలు వగైరాకు మాత్రమే ఉపయోగపడతాయి. అందువల్ల గ్రామ సభలు జరిపి ప్రతియేటా మే చివరి నాటికి కౌలుదారులకు కార్డులు ఇవ్వాలి. అందుకు ప్రస్తుతం ధరణి చట్టంలోని లోపాలను సవరించుటకు కొత్తగా సవరణ చట్టాలు చేయాలి.
మాడ్యూల్ పనిచేయలేదు. ఫీజులైతే కట్టించుకున్నారు
గత ప్రభుత్వం 13 లోపాలను సరిచేయడానికి ‘ఒక మాడ్యూల్’ నిర్ణయించి ప్రతి రైతునుంచి రూ. 950 మీ సేవ ద్వారా చెల్లించి పై లోపాలను సరిచేసుకోవాలని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. లక్షల మంది మీసేవలో ఫీజులైతే చెల్లించారు. వాస్తవానికి లోపాలు ప్రభుత్వ అధికారుల ద్వారా జరిగినవి మాత్రమే. వాటిని సరిచేయడానికి రైతులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, వేలాది రూపాయలు రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసింది. ఫీజు చెల్లించిన వారికి కూడా నేటికీ ఎలాంటి సవరణలు చేయలేదు. అందువల్ల ధరణి చట్టం ద్వారా వచ్చిన లోపాలను ‘డిజిటలైజేషన్ లోపాల పేరుతో’ గత ప్రభుత్వం దాటవేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిచేయడానికి గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి, యంత్రాంగం ద్వారా సరిచేయాలి.
వ్యవసాయేతర భూముల రిజిస్టర్ విడిగా..
వ్యవసాయేతర భూములను విడిగా రిజిస్టర్ చేసి, వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. హార్టికల్చర్ భూములకు కూడా విడిగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ‘భూమాత’ పథకాన్ని సమగ్రంగా తయారుచేయడానికి వ్యవసాయ భూములకు మాత్రమే పాసుపుస్తకాలు ఇవ్వాలి. వానాకాలం సాగుచేస్తున్న భూములలో 50శాతం యాసింగిలో సాగుచేయరు. దీని వల్ల బడ్జెట్‌పై అదనపు భారం పడుతున్నది.
భూసర్వే జరగాలి
1940లో రాష్ట్రంలో భూసర్వే జరిగింది. నేటి వరకు ఎలాంటి సర్వేలు జరగలేదు. అక్రమార్కులు రికార్డులను మార్పులు చేశారు. భూసర్వే జరపడానికి ఈ ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేయాలి. కొనుగోలు చేసిన నాటి రిజిస్ర్టేషన్ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) అమలు చేయాలి. దేవాదాయ, ధర్మాదాయ, వక్స్, భూదాన భూములను సర్వే చేసి భూ ఆక్రమణల నుంచి రక్షించాలి.
కోనేరు సిఫార్సులు అమలు చేయాలి
కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ, సీలింగ్, బంజరు భూము లను పేదలకు పంచాలి. 1973 భూ సంస్కరణల చట్టంలోని లోపాలను సరిదిద్దాలి. క్యాబినేట్ ఆమోదంతో సీలింగ్ చట్టాలకు తూట్లు పొడిచే విధంగా గత ప్రభుత్వం భూములను కేటాయించింది. ఫాంహౌస్‌ల సంస్కృతి విస్తరించి అసైన్డ్ భూములను లాక్కున్నారు. వీటిని తిరిగి లావాణీ పట్టాదారులకు భూములను ఇవ్వాలి. ధరణి చట్టంలోని లోపాలను సవరించాలి.
13 లక్షల మందికి పాస్‌బుక్‌లు రాలేదు
ప్రభుత్వ అధికారులు చేసిన తప్పుల వలన, అనగా రికార్డులు ఉద్దేశపూర్వకంగా తప్పులు రాయడంతో లక్షలమందికి పాస్వుస్తకాలు రాలేదు. దీనిపై వేసిన కేబినెట్ కమిటీ ధరణి లోపాలవల్ల 13లక్షల మందికి పాసుపుస్తకాలు ఇవ్వలేదని నివేదికిచ్చింది. ధరణి చట్టంలోని సెక్షన్-8లో వారసత్వంగా వచ్చిన ఆస్తిని కూడా వారసులకు రిజిస్ట్రేషన్ చేయాలని, అందుకు మ్యుటేషన్ ఫీజు చెల్లించాలని నిర్ణయించారు. వారసత్వంగా వచ్చే ఆస్తికి ధరణి వచ్చే నాటికి ఎలాంటి రిజిస్ట్రేషన్లుగాని, ఛార్జీలుగాని లేవు. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. కుటుంబ ‘భాగస్వామ్య పత్రం(పైస్లానామ)’ ద్వారా వారసత్వ హక్కులుగా మార్చాలి.
అనేక లోపాలు
ధరణి వెబ్‌సైట్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన లోపాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి.
1) చనిపోయిన పట్టాదారు పేరుమీద పాసుపుస్తకాలు వచ్చాయి.
2) ఆధార్ తప్పుగా నమోదైనవి.
3) పాసుపుస్తకాలలో ఫొటోలు తప్పుగా ఉన్నవి. 4) పట్టాదారు పేరు తప్పుగా రాయబడినవి. 5) వ్యవసాయేతర భూములకు (నాలా) పాసుపుస్తకాలు ఇచ్చినవి. 6) పాసుపుస్తకంలో తక్కువ విస్తీర్ణం రాసినవి. 7) ఒకే ఖాతాను రెండుచోట్ల రాసినవి. 8) సర్వే నెంబర్లలో తప్పులు రాసినవి. 9) అమ్ముకున్న అసైన్డ్ భూములకు పాసుపుస్తకాలు ఇచ్చినవి. 10) అటవీశాఖతో వివాదాలున్న భూములకు పాసుపుస్తకాలు ఇచ్చినవి. ఇవేకాక మరికొన్ని లోపాలు ఉన్నాయి.
- సారంపల్లి మల్లారెడ్డి, ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు