సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 10 ఏండ్లలో తొలిసారిగా కేంద్రంలో బీజేపీ సొంతంగా పూర్తి మెజారిటీని పొందలేకపోయింది. ఏడు రాష్ట్రాలలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 13 సీట్లలో 10 స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంది. ఈనేపథ్యంలో బీజేపీ తన ఎన్నికల వ్యూహంపై మళ్లీ పునరాలోచించనుంది.
జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు పెరగడంతో బీజేపీకి రాజకీయంగా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు వ్యూహాలను మార్చి తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఉత్తరప్రదేశ్ బీజేపీలో కలకలం రేగుతోంది. ప్రభుత్వం కంటే ఆర్గనైజేషన్ పెద్దదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇటీవల ప్రకటించారు. నేతల మధ్య విభేదాలు పెరుగుతుండటం పరిగణనలోకి తీసుకున్న పార్టీ కేంద్ర నాయకత్వం సమస్యల పరిష్కారానికి నడుం కట్టింది.
మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ వంటి ముఖ్యమైన రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున.. బీజేపీ మళ్లీ హార్డ్ హిందూత్వానికి తిరిగి రావాలని ఆలోచిస్తుందా? రాజకీయ పరిశీలకుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. హిందూత్వ ఎజెండాకి తిరిగి రావాలని పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. హిందూత్వమే ఒక్కటే అధికార పార్టీ బీజేపీలోని అన్ని పార్శ్వాలను కవర్ చేయగలదు.
ఇది కాషాయ పార్టీ ఓట్‌బేస్‌ను ఏకీకృతం చేయడంతో పాటు బీజేపీ కార్యకర్తలకు కూడా శక్తినిస్తుంది. కుల గణన, హిందువుల మధ్య విభేదాలకు మరింత పదునుపెట్టే దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీలు) మరిన్ని రిజర్వేషన్లు కల్పించడంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎత్తుగడను బీజేపీ హిందూత్వమే సమర్థంగా ఎదుర్కోగలదు.
లోక్‌సభ ఎన్నికల్లో ముజ్రా, మంగళసూత్రం పనిచేయలేదు
బీజేపీకి ఉన్న అనుకూల అంశం ఏమిటంటే.. హిందూత్వానికి వివిధ కులాలు, విభాగాలను ఏకం చేయగల సామర్థ్యం ఉంది. ఇది హిందూత్వ ఎజెండా మళ్లీ జీవం పోసుకోవడానికి సహాయపడుతుంది. మటన్, మచ్లీ, ముజ్రా, మంగళసూత్రం, ముస్లింలకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కోవడం.. ప్రచారం వల్ల బీజేపీ ఆశించిన స్థాయిలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాకపోవడం, పార్టీ సొంతంగా అధికారం నిలబెట్టుకోవడంలో విఫలం అవడం వల్ల బీజేపీకి హిందూత్వ ఎజెండా తప్పనిసరి అనిపిస్తోంది.
హిందూత్వ ఎజెండా వైపే బీజేపీ మొగ్గు
ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి హిందూత్వ ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కొత్త థీమ్‌లు ఇప్పుడు గుర్తించనున్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఇటీవల మాట్లాడుతూ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే నినాదాన్ని వదిలివేసి, దాని స్థానంలో జో హమారే సాథ్, హమ్ ఉన్కే సాథ్ అనే కొత్త నినాదాన్ని పెట్టాలని అన్నారు.
ఒక విధంగా, 2019లో గెలిచిన 18 ఎంపీ స్థానాల నుంచి బీజేపీ సీట్ల సంఖ్య 2024లో 12కి పడిపోయిందని, టీఎంసీ వెనుక ఉన్న ముస్లింల ఏకీకరణ కారణంగా రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలిందని అధికారి ఆరోపించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనేది గత 10 సంవత్సరాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత కమిట్మెంట్. సబ్ కా ప్రయాస్, సబ్ కా విశ్వాస్‌లను జోడించడం ద్వారా ప్రధాని మోదీ దానిని మెరుగుపరిచారు. జో హమారే సాత్, హమ్ ఉన్కే సాథ్‌తో భర్తీ చేయాలని బహిరంగంగా వాదిస్తున్నారు.
మహారాష్ట్రలో ఎన్డీఏకు..ఇండియా కూటమి షాక్
2023లో కర్ణాటకలో లాగ గతంలో జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో హిందూత్వ కార్డ్ పని చేయలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో, హిజాబ్ నిషేధం, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌లను తొలగించడం వంటి అంశాలు ఓటర్లను ఉత్సాహపరచడంలో విఫలమయ్యాయి. ఏది ఏమైనప్పటికీ 2023లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఓటర్లను ఒప్పించగలిగింది.
ఇప్పుడు, మహారాష్ట్ర, హర్యానా వంటి ప్రధాన రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి హిందూత్వ కార్డు మాత్రమే ఆశాజనకంగా మిగిలింది. మహారాష్ట్రలో షాకింగ్ విషయం ఏమిటంటే, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎన్డీయే కూటమి 48 లోక్‌సభ స్థానాల్లో 41 స్థానాలను కైవసం చేసుకున్నది. కానీ, 2024లో ఇండియా కూటమి మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి షాక్ ఇచ్చి 48 సీట్లలో 30 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే, రెండు కూటముల మధ్య ఓట్ల షేర్లలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది.
మహా అసెంబ్లీ బరిలో ఎంఎన్ఎస్
లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి 44.92 శాతం ఓట్లు రాగా, అధికార మహాయుతి కూటమికి 43.54 శాతం ఓట్లు వచ్చాయి. హిందూత్వ కార్డు ఉపయోగిస్తే.. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడిపై మహాయుతి కూటమి ఆధిక్యతను సాధించి విజయవంతం అవుతుందని బీజేపీ లెక్కలు చెబుతున్నాయి. రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) 288 అసెంబ్లీ స్థానాల్లో 250 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. ఇది నేరుగా ఎన్డీయే ఓట్ల శాతాన్ని తగ్గించవచ్చు.
హిందూత్వ కార్డు ద్వారా మాత్రమే రాజ్ థాకరే ఎంఎన్ఎస్ను బీజేపీ సమర్థంగా ఎదుర్కోగలదు. 10 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో కాషాయ పార్టీ బలహీనంగా ఉంది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ఏదైనా మేలు చేయగలిగేది ఒక్క హిందూత్వ కార్డు మాత్రమే. జార్ఖండ్‌ను తిరిగి గెలుచుకోవడంతో పాటు మహారాష్ట్ర, హర్యానాలను నిలుపుకోవడానికి బీజేపీ ఇదే వ్యూహాన్ని అవలంబించవచ్చు.
కన్వారియా యాత్ర
హిందూ క్యాలెండర్ మాసమైన పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా తినుబండారాలు, షాపుల యజమానులు తమ పేర్లను ప్రదర్శించాలని, కన్వారియా యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణాలపై వివరాలకు సంబంధించిన యూపీ సీఎం యోగీ ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వెలువడుతుండటంతోపాటు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి మతపరమైన విభజన మరింత పెరిగేందుకు దారితీస్తోంది.
యోగీ ఆ వివాదానికి ముగింపు పలికిన నేపథ్యంలో, ఉత్తరాఖండ్ అటువంటి ఆర్డర్‌తో ముందుకు వచ్చింది. షాపు యజమానుల పేర్లను ప్రదర్శించడంపై ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా పోలీసు ఆదేశాలతో ఇదంతా ప్రారంభమైంది. ప్రస్తుతం బీజేపీకి కీలక మిత్రపక్షం, నితీశ్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) ఈ చర్యను తీవ్రంగా విమర్శించింది. దీంతో రాజకీయంగా ఎదురుదెబ్బ తరువాత ముజఫర్‌నగర్ పరిపాలన కన్వారియా యాత్ర మార్గంలో తినుబండారాల యజమానుల పేర్లను స్వచ్ఛందంగా ప్రదర్శించవచ్చని చెబుతూ తన ఆర్డర్‌ను ప్రభుత్వం సవరించింది.
అస్సాం సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమ రాష్ట్రంలో జనాభా మార్పుల అంశాన్ని లేవనెత్తారు. ముస్లిం జనాభా ప్రతి 10 సంవత్సరాలకు 30 శాతం పెరుగుతోంది అని తెలిపారు. ముస్లింల జనాభా ఇప్పుడు 40 శాతం ఉందని, 2041 నాటికి అస్సాం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్వయంగా పేర్కొన్నారు.
భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ తర్వాత, ముస్లింలు ఆధిక్యంలోకి వస్తారనే భయాలకు ఆజ్యం పోస్తూ, అస్సాం రెండవ ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా అవతరించడం ద్వారా ఆయన ముస్లిం వ్యతిరేకతను కొత్త శిఖరానికి పెంచుతున్నారు.
- అనితా సలూజా,సీనియర్ జర్నలిస్ట్ (ఢిల్లీ)