బొందివాగు రంది తీరేదెన్నడో? మళ్లీ ముంపు తప్పదేమోనని వరంగల్ ప్రజల ఆందోళన

బొందివాగు రంది తీరేదెన్నడో?  మళ్లీ ముంపు తప్పదేమోనని వరంగల్ ప్రజల ఆందోళన
  • మరో రెండు నెలల్లో వానాకాలం ప్రారంభం 
  • ఆ లోపు  పనులు పూర్తయ్యేలా కనిపించట్లేదు  
  • మళ్లీ ముంపు తప్పదేమోనని స్థానికుల్లో ఆందోళన

హనుమకొండ, వెలుగు : వానాకాలమొస్తే.. వరంగల్ ప్రజలను బొంది వాగు ముంపు భయం వెంటాడుతుంది. దీని డెవలప్ మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ.158.5 కోట్లు కేటాయించింది.  అయినా.. కాలనీలను ముంచేసే నాలా పనులకు మోక్షం కలగడం లేదు. గతేడాది మంత్రులు శంకుస్థాపన చేశారు. కానీ డిజైనింగ్​మార్పుల తో పనులు ఇంకా చేపట్టలేదు. ఇంకో రెండు నెలల్లో వానాకాలం షురూ కానుంది. ఆ లోపు పనులు పూర్తి అయ్యేలా కనిపించడంలేదు. దీంతో వాగు ముంపు కాలనీలవాసుల్లో ఆందోళన పట్టుకుంది. 

హనుమకొండ నాలా కంప్లీట్

వరంగల్ సిటీలో 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగి దాదాపు 200 కాలనీలు నీట మునిగాయి. ఇందుకు వరద నీటి నాలాలు ఆక్రమణకు గురవడం, 10 నుంచి 12 వేల క్యూసెక్కుల వరదనీటిని కూడా తట్టుకునే పరిస్థితిలో  లేకపోవడంతోనే మునిగిపోయినట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. దీంతో  నయీంనగర్​నాలా, బొందివాగు నాలా విస్తరణ, రిటైనింగ్​వాల్స్ నిర్మాణ పనులకు ఇరిగేషన్​ఆఫీసర్లు ప్రతిపాదనలు చేశారు. ముందుగా నయీంనగర్​నాలా అభివృద్ధి పనులను రూ.వంద కోట్లతో ఏడాదిన్నర కింద చేపట్టి కంప్లీట్ చేశారు. దీంతో ముంపు ముప్పు తప్పింది. కానీ.. బొందివాగు నాలా అభివృద్ధికే  అడుగులు పడడంలేదు.  

నాలా రెండు వైపులా ఆక్రమణ 

వరంగల్ శివారు తిమ్మాపూర్, కొండపర్తి, అమ్మవారిపేట, భట్టుపల్లి, రంగశాయిపేట బెస్తం చెరువు, రంగ సముద్రం తదితర చెరువుల నుంచి వచ్చే వరద నీరు బొందివాగు, భద్రకాళీ నాలా గుండా నాగారం వైపు వెళ్లాలి. కాగా ఉర్సు రంగ సముద్రం చెరువు నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవు ఉండే బొంది వాగు నాలా రెండు వైపులా ఆక్రమణకు గురైంది. ఉర్సు చెరువు నుంచి వరంగల్ రైల్వే ట్రాక్ వరకు ఆక్రమణలతో వంకర టింకరగా తయారైంది. దీంతో వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి, చుట్టు పక్కల కాలనీలు మునుగుతు న్నాయి. దీంతో నాలాను 20 మీటర్ల మేర విస్తరించి, రిటైనింగ్​వాల్స్​నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. 

గతేడాది మార్చిలో శంకుస్థాపన చేసిన మంత్రులు

బొందివాగు డెవలప్ మెంట్ లో భాగంగా రామన్నపేట, హంటర్ రోడ్డు గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలో రెండు చోట్ల ఇన్ ఫ్లో రెగ్యులేటర్లు, అలంకార్ వైపు ఔట్ ఫ్లో రెగ్యులేటర్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. పద్మాక్షి టెంపుల్ వైపు మరో ఇన్ ఫ్లో  రెగ్యులేటర్ అమర్చేందుకు నిర్ణయించారు. ఇందుకు రూ.142 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. పలు సవరణలతో అంచనా వ్యయం రూ.158.5 కోట్లకు చేరింది.  ఇప్పటికే ఆ నిధులను ప్రభుత్వం కూడా మంజూరు చేసింది. గతేడాది మార్చి10న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్థానిక ప్రజాప్రతినిధులు నాలా పనులకు శంకుస్థాపన చేశారు. కానీ, దాదాపు 10 మీటర్లలోతు వరకు సిల్ట్ ఉండడం, అక్కడ సాయిల్​టెస్టుల్లో నేల స్వభావం సరిగా లేకపోవడంతో నాలా డిజైనింగ్​లో మార్పులు చేపట్టారు. పనులకు వరంగల్ నిట్ ఇంజినీర్లకు అప్పగించగా మార్పులు చేస్తున్నారు. మ్యాప్​ ఫైనల్ అయ్యేసరికి మరింత టైమ్ పట్టేలా కనిపిస్తోంది. 

మరో రెండు నెలల్లో వానాకాలం రానుండగా.. 

 ఏటా వానాకాలం వచ్చిందంటే బొంది వాగు నాలా హంటర్ రోడ్డు పరిధిలోని సాయినగర్, సంతోషిమాత కాలనీ, బృందావన కాలనీ, ఎన్టీఆర్ నగర్, బీఆర్​నగర్ తదితర కాలనీలను ముంచేస్తుంది. దీంతో ఆయా కాలనీ ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఈసారి కూడా నాలా అభివృద్ధి పనులు లేట్ కావడం, మరో రెండు నెలల్లో వానాకాలం రానుండగా స్థానికులకు ఇప్పటినుంచే ముంపు రంది పట్టుకుంది.  త్వరగా ఫైనల్​మ్యాప్​రెడీ చేసి పనులు చేపట్టి కాలనీలు మునగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

డెవలప్ మెంట్ మ్యాప్​ రెడీ చేస్తున్నాం..

బొంది వాగు నాలా డెవలప్​మెంట్​కు సంబంధించి ఫైనల్ మ్యాప్​ రెడీ చేస్తున్నాం. ఇప్పటికే వరంగల్ నిట్​టీమ్ డిజైనింగ్​లో మార్పులు చేస్తోంది. వారం రోజుల్లో ఫైనల్​అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. వరంగల్ లోని కాలనీలకు ముంపు ముప్పు లేకుండా చేస్తాం. 

- ఎం.శంకరయ్య, ఇరిగేషన్ ఈఈ, వరంగల్