ప్రస్తుతం ప్రపంచం మొత్తం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో బీజీగా ఉందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నేషనల్ పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు. గత మూడు నెలలుగా కేసీఆర్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంకా చాలా మంది నేతలను కలిశారు. అలాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ ఆయన టచ్‌లో ఉన్నారు. తాజాగా రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రత్యేకంగా పార్టీ ఆఫీసును ఏర్పాటు చేసిన ఆయన.. అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతామని కూడా చెబుతున్నారు. అయితే కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి వెళితే సీఎం సీటును వదులు కుంటారా? అనేది ఒక ప్రశ్న. దీనికి సమాధానం దొరకాలంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకూ ఆగాల్సిందే.
ఎనిమిదేండ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు. కానీ, ఇప్పుడు గుడ్ గవర్నెన్స్‌కు సంబంధించి ఆయన దగ్గర మంచి ఐడియాలు అయిపోయినట్టుగా కనిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవ్వడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కేసీఆర్ సొంత ఐడియా అయిన రైతుబంధును పక్కనపెడితే, మిగతా అన్ని స్కీములు కూడా దేశవ్యాప్తంగా వేరే పేర్లతో అమలవుతూనే ఉన్నాయి. ఏదైనా ఉచితంగా ఇవ్వడం కొత్తదనాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఓటర్లు ప్రతీదీ ఉచితంగా కావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో అవినీతి లేని గుడ్ గవర్నెన్స్‌ను కూడా కోరుకుంటున్నారు. మంచి పాలనను అందించడం అనేది గొప్ప నైపుణ్యం.
పెరుగుతున్న వ్యతిరేకత
గతంలో తెలంగాణ ఓటర్లు, కేసీఆర్ మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు కనుమరుగైపోయింది. మరోవైపు బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తాను పోటీలో ఉంటానని సంకేతాలు ఇస్తోంది. కేసీఆర్ పాపులారిటీ తగ్గడం మొదలుకావడంతో ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. తనకు మద్దతు ఇస్తే జాతీయ రాజకీయాలను హస్తగతం చేసుకుంటానని తెలంగాణ జనాలకు చెబుతున్నారు. తాను ఢిల్లీ గద్దె నెక్కితే, తెలంగాణ ఓటర్లు వారు కోరుకున్నది సాధించుకునేందుకు నేషనల్ బడ్జెట్ తలుపులు తెరుచుకుంటాయని కేసీఆర్ ఓపెన్‌గానే చెబుతున్నారు. కానీ ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి కథలు నమ్మేందుకు తెలంగాణ ఓటర్లు అమాయకులా? వారు నేషనల్ బడ్జెట్‌ను చేజిక్కించుకోగలరా అనేది కూడా ప్రశ్నే.
సీఎంలను కలిస్తే మద్దతు దొరికినట్టేనా?
- కొందరు ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రులను కలవడం ద్వారా కేసీఆర్ జాతీయ నాయకత్వాన్ని సాధించారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోంది. ఇది వాస్తవ దూరం. ముఖ్యమంత్రిని ఎవరైనా కలుస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. తన నాయకత్వాన్ని అంగీకరించేలా ప్రతిపక్షాలను కేసీఆర్ తనవైపు తిప్పుకున్నారని, ఇక ఢిల్లీ పీఠం ఆయన కోసం ఎదురుచూస్తోందనేలా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. ఇప్పటి విజయ గాథలనే 2024లో పరిగణనలోకి తీసుకోవాలి.
- కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విషయంలో కూడా కేసీఆర్ దూకుడుగా వెళ్లడం లేదు. భవిష్యత్‌లో గాంధీలతో కలిసి కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. కాంగ్రెస్‌తో కేసీఆర్ పొత్తు పెట్టుకోవడం రాజకీయంగా మంచి ఎత్తుగడే. అయితే కేసీఆర్ ఢిల్లీలోనే కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తారా లేక తెలంగాణలో కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారా? అనేది ఒక్కటే ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న.
- వీటికి తోడు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్ సర్వేల తర్వాత తమ సీట్లు కోల్పోయే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లో.. ప్రశాంత్ కిషోర్ అసహనాన్ని, అస్థిరత్వాన్ని కలిగించారనడంలో
- ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఇది కూడా ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. తమను తప్పిస్తారని భావిస్తే చాలా మంది తిరుగుబాటు నేతలు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తారు.
ఫుల్ టైం నేషనల్ పాలిటిక్స్‌లో ఉంటరా?
- ఇప్పుడు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. కేసీఆర్ పూర్తిస్థాయి సమయాన్ని జాతీయ రాజకీయాల కోసం కేటాయిస్తారా అనేదే. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనేది కూడా మరో ప్రశ్న. లేదంటే, మిగతా ప్రతిపక్షాల ముఖ్యమంత్రుల మాదిరిగా కేసీఆర్ కూడా పార్ట్‌టైం నేషనల్ లీడర్‌గా ఉండాలి. తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రిగా, కేసీఆర్ వారసునిగా కేటీఆర్ అవుతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి వెళ్లడానికి ఒక రకంగా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం కూడా ఒక కారణమనే వాదన ఉంది.
- వాస్తవానికి నరేంద్రమోడీని ఢీకొట్టేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పెద్దపీట వేస్తే ఉపయోగం ఏమీ ఉండదు. పశ్చిమబెంగాల్ లేదా మహారాష్ట్రలో కేసీఆర్ ఏం చేయగలరు? కేసీఆర్‌కు ఏదైనా చేయగలిగిన ప్రదేశం ఉందంటే అది తెలంగాణ మాత్రమే. ఇక్కడ ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇది అన్ని ప్రతిపక్షాలకూ తెలుసు. లేక సీఎం పదవికి రాజీనామా చేసి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా పెట్టడానికి ఇదో సాకా? అనేది కాలమే చెపుతుంది.
- ఒకవేళ చాలా మంది మినిస్టర్లను తప్పించాలని ప్రశాంత్ కిశోర్ సూచిస్తే.. ఆ పనిని కేసీఆర్ చేయగలరా? లేదంటే కొత్త ముఖ్యమంత్రి ఆ పని చేయగలరా? గుజరాత్లో బీజేపీ చేసిన మాదిరిగా పాత ఎమ్మెల్యే అభ్యర్థులకు సీట్లు ఇవ్వొద్దని ప్రశాంత్‌కిశోర్ సూచించగలరా? ఇదే జరిగితే రాజకీయంగా చాలా చిచ్చు రేగే అవకాశం ఉంటుంది. దీనిని కేసీఆర్ ఎలా కంట్రోల్ చేయగలరు? తాను సీఎం పీఠం నుంచి దిగి కేటీఆర్‌కు ఆ పదవి కేటాయించాలని భావిస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో దానికి అడ్డుచెప్పే నాయకులు ఎవరూ ఉండరు.
ఏదైనా సీక్రెట్ స్క్రిప్ట్ ఉందా?
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరొకరిని నియమించడానికి కేసీఆర్ కు మంచి సాకు దొరుకుతుంది. ఫుల్ టైం ఢిల్లీకే సమయాన్ని కేటాయిస్తానని కేసీఆర్ చెప్పొచ్చు. అది నిజం అనిపించేలా కూడా ఉంటుంది. అయితే అసలు లక్ష్యం తక్కువ కాలానికి అయినా మరొకరిని ముఖ్యమంత్రిగా చేయడమే కావచ్చు. అందువల్ల, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని, వెంటనే మరొకరికి ఆ పదవి అప్పగించడానికి జాతీయ రాజకీయాలు మంచి మార్గం కావచ్చు. ఈ నెల 10, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు, కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళతారా? లేక హైదరాబాద్‌లోనే ఉంటారా? అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ దారుణంగా దెబ్బతింటే, కేసీఆర్ అప్పుడు ఢిల్లీ వెళతారు. అలాకాకుండా బీజేపీ మెరుగైన పనితీరు కనబరిస్తే, అప్పుడు కేసీఆర్ తెలంగాణకే పరిమితం కావొచ్చు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 25 ఏండ్ల పాటు పదవిలో ఎలా ఉన్నారనే కేసీఆర్ స్టడీ చేసినట్లయితే ఈ డ్రామా అంతా అవసరం లేని ప్రక్రియగా మనకు కనిపిస్తుంది. పట్నాయక్ గెలుపు ఫార్మూలా ఏమిటంటే, తక్కువ కనిపించడం, తక్కువ మాట్లాడటం, తొందర పడకపోవడం, బంధువులను తన చుట్టూ ఉంచుకోకపోవడమే. నవీన్ పట్నాయక్ ఒరియా భాషను కూడా సరిగ్గా మాట్లాడలేరు. కానీ, ఆయన ఎప్పుడూ తాజాగా ఉంటారు. నిన్ననే ముఖ్యమంత్రి పీఠం ఎక్కినట్టుగా ఆయన నడుచుకుంటారు.
:: పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్