కాంగ్రెస్ కు సోనియా పూర్వ వైభవం తీసుకొస్తారా?

ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్​గా వీటిని అన్ని రాజకీయ పార్టీలతో పాటు పొలిటికల్​ ఎనలిస్టులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ ప్రెసిడెంట్​ సోనియా గాంధీ ఇప్పటి నుంచే ప్లాన్స్​ వేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్​ను ఇరుకునపెట్టడం ద్వారా పార్టీ కేడర్​లో జోష్​ నింపాలని భావిస్తున్నారు. ఇందుకోసం ద్విముఖ వ్యూహాన్ని రెడీ చేస్తున్నారు. అయితే సోనియా ప్లాన్లు ఎంత వరకు వర్కవుట్​ అవుతాయి? కాంగ్రెస్​ పార్టీ మళ్లీ జనాలకు కనెక్ట్​ అవుతుందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం ద్వారా బీజేపీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీపై అన్ని వైపుల నుంచి దాడి చేయడం ద్వారా కాంగ్రెస్​లో కొత్త ఉత్సాహం నింపాలని సోనియాగాంధీ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. నవంబర్​ 14 నుంచి 29వ తేదీ వరకూ పక్షం రోజుల పాటు జన్​జాగరణ్​ అభియాన్​ పేరుతో నిరసనలను కాంగ్రెస్​ పార్టీ చేపట్టింది. సోమవారం నుంచి డిసెంబర్​ 23 వరకు జరిగే పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల సాక్షిగా రెండో దశ పోరాటం చేయాలని భావిస్తోంది. 

పార్లమెంట్​ వేదికగానూ..
కాంగ్రెస్​ ప్రారంభించిన జన్​జాగరణ్​ అభియాన్​ కార్యక్రమాలు ముగిసే రోజునే పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. పార్లమెంట్‌‌‌‌ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీ తెలివైన వ్యూహంతో ముందుకెళ్లాలి. దేశంలోకి చైనా చొరబాట్ల, పెగాసస్ స్పైవేర్‌‌‌‌‌‌‌‌ వంటి జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలకు సంబంధించి కేంద్రంపై ముప్పేట దాడి చేయాలని కాంగ్రెస్‌‌‌‌ నిర్ణయించుకుంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి సమస్యలపైనా గళమెత్తనుంది. ఇతర ప్రతిపక్షాలతో కలసి పని చేసేందుకు విస్తృత స్థాయిలో సమన్వయం చేసుకునే దిశగా కూడా కాంగ్రెస్‌‌‌‌ చొరవ తీసుకుంటోంది. పార్లమెంట్‌‌‌‌లో అన్ని పార్టీలను ఒక్కటి చేయడం అనేది మంచి ఉపాయమే. కాంగ్రెస్​ నాయకులు ప్రతిపక్షాలతో ఈ దిశగా చర్చలు జరుపుతున్నారు. అవి కొలిక్కి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది.

ప్రతిపక్షాల ఐక్యత కొనసాగుతదా?
వర్షాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలు, పెగాసస్ అంశాలతో ప్రతిపక్షాలు ఐక్యత సాధించాయి. రాబోయే శీతాకాల సమావేశాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు పునరావృతం అవుతాయి. ముఖ్యంగా ధరల పెరుగుదల, వ్యవసాయ చట్టాలు ఇంకా కీలక అంశాలే. వర్షాకాల సమావేశాల్లో మాదిరిగానే శీతాకాల సమావేశాల్లోనూ అపొజిషన్​ పార్టీల మధ్య సమన్వయం కొనసాగాలి. పెగాసస్‌‌‌‌పై పార్లమెంట్​లో చర్చ జరగాలని కాంగ్రెస్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేస్తోంది. కోర్టు విచారణలో ఉందనే నెపంతో కేంద్రం తప్పించుకునే అవకాశం లేదని ఆ పార్టీ భావిస్తోంది. పెగాసస్ ప్రాథమిక హక్కులకే కాకుండా జాతీయ భద్రతను ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పెగాసస్​పై చర్చకు పట్టు
వర్షాకాల సమావేశాలకు ఇప్పటికీ రెండు చెప్పుకోదగ్గ అంశాలున్నాయి. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఓ గ్రూప్‌‌‌‌ ఆఫ్​ టెక్నాలజీస్‌‌‌‌ ప్రభుత్వాలకు మాత్రమే సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ విక్రయిస్తుందని ఇజ్రాయెల్‌‌‌‌ అధికారికంగా ఒప్పుకుంది. అదేవిధంగా ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఓను బ్యాన్‌‌‌‌ చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఓ నుంచి పెగాసస్‌‌‌‌ను కొనుగోలు చేసిందా? లేదా, ప్రభుత్వ ఏజెన్సీ ఏదీ దీనిని పొందలేదా? అనే అంశాలను పార్లమెంట్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ లేవనెత్తాలి. ఈ అంశంపై సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసినా పార్లమెంట్‌‌‌‌లో దీనిపై చర్చకు అడ్డులేదనేది కాంగ్రెస్‌‌‌‌ వాదన. పార్లమెంట్​లో లేవనెత్తడమే కాదు ప్రధాని లేదా హోంమంత్రి సమక్షంలో సభలో చర్చ జరిగేలా ప్రయత్నించాలి. చైనా చొరబాట్లు అనేది సున్నితమైన అంశం. దీనిని కూడా పార్లమెంట్​ లో లేవనెత్తాయి. అయితే ఈ అంశంలో ప్రతిపక్ష నాయకులెవరూ బాధ్యతారహిరంగా మాట్లాడకూడదు. దీనిపై చర్చను ప్రారంభించాల్సింది కేంద్రమే. కానీ అటువైపు నుంచి అలాంటి ప్రయత్నాలేవీ కనిపించడం లేదు.

వ్యవసాయ చట్టాల రద్దుపై..
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేలా ఒకే బిల్లును తీసుకొచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ అంశంపై కూడా కాంగ్రెస్‌‌‌‌ చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ చట్టాలను ఎందుకు తెచ్చారో పునరాలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎటువంటి కంగారు లేనప్పటికీ ఆర్డినెన్స్​ ద్వారా ఈ చట్టాలను తెచ్చింది. వ్యవసాయ చట్టాలను చట్టబద్ధం చేసే ముందు బిల్లులను పార్లమెంట్‌‌‌‌లో ప్రవేశపెట్టి, స్టాండింగ్‌‌‌‌ కమిటీకి పంపి పార్లమెంట్‌‌‌‌ లో చర్చకు తేవలసింది. అంతేకాకుండా, చట్టాల రద్దుకు ఏడాది ఎందుకు పట్టింది? 750 మంది రైతుల బలిదానానికి ఎందుకు దారి తీసింది? అనేదానిపైన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. 

ఎంఎస్​పీ చట్టం కోసం..
ఇంతే కాకుండా, కనీస మద్దతు ధర(ఎంఎస్‌‌‌‌పీ) కోసం చట్టబద్ధ హాదా కోసం కాంగ్రెస్​ ఒత్తిడి తేవాలి. వ్యవసాయ సేకరణలో ప్రైవేట్ రంగాన్ని తీసుకురావడానికి, ఎఫ్ సీఐ, పబ్లిక్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్‌‌‌‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఇది కీలకమైనది. ఎంఎస్‌‌‌‌పీ అనేది ఇప్పటి వరకు కార్యనిర్వాహక నిర్ణయంగా ఉన్నందున పంటల సేకరణ, ఆహార భద్రతకు సంబంధించి సమగ్రమైన విధానం ఇవ్వడంలో ఎలాంటి సమస్యా లేదు. ఇప్పుడు ప్రభుత్వం తనకు తాను వెనక్కి తగ్గి, ప్రైవేట్‌‌‌‌ రంగానికి ఎక్కువ అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నందున ఎంఎస్‌‌‌‌పీ కోసం చట్టబద్ధత అనేది చాలా అవసరం. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నందున రాజకీయంగా ఈ అంశం సమసిపోయింది. అయితే వీటిపై ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చను ముందుకు నడపడంపై కేంద్రం దృష్టి పెట్టాలి. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నాటి పరిస్థితులు పునరావృతం కారాదని, శీతాకాల సమావేశాలు సజావుగా జరగాలనే కాంగ్రెస్​ భావిస్తోంది. సోనియాగాంధీ కూడా కాంగ్రెస్‌‌‌‌ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో దానిపై చర్చకు కేంద్రం అనుమతిస్తే, శీతాకాల సమావేశాలు మరింత ఫలవంతంగా ఉండవచ్చు.