కాంగ్రెస్..​ హర్యానా పాఠం నేర్చుకునేనా?

కాంగ్రెస్..​ హర్యానా పాఠం నేర్చుకునేనా?

ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరొక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చూపే ప్రత్యక్ష ప్రభావం నామమాత్రమే! కానీ, నేర్చుకోవడానికి పాఠాలు, గుణపాఠాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అవి నేర్వడానికి సిద్ధంగా లేని పార్టీలు... చేసిన తప్పులే చేస్తూ ఉండొచ్చు, పడిన గోతిలోనే మళ్లీ మళ్లీ పడొచ్చు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్‌‌‌‌ పార్టీ పరిస్థితి అదే! ఎక్కడో జరిగిన దాన్నుంచి పాఠం నేర్వనందునే హర్యానాలో ఆ పార్టీకి ఎదురైనది క్షమార్హం కాని ప్రస్తుత ఓటమి. ఏతావాతా అన్ని ఎజెన్సీల సర్వే అంచనాలే గల్లంతయిన పరిస్థితిని నిన్నటి అసెంబ్లీ ఫలితాల్లో చూశాం. ఇక ఈ తాజా ఫలితాల నుంచి గుణపాఠం నేర్వకుంటే.... రేపు మహారాష్ట్రలోనూ వారికి మరింత పరాభవం తప్పదు. అప్పుడది కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి మాత్రమే పరిమితం అవదు, దాన్ని నమ్ముకొని జట్టు కట్టిన ‘ఇండియా’ గుంపు మొత్తానికీ నష్టం చేసే రాజకీయ పరిణామమే అవుతుంది.


సాంకేతికత పెరిగిన ఆధునిక కాలంలో, కెనడా నుంచి హర్యానాకు ఎంత చూపు ఆనుతుంది అన్నది నాకు తెలియదు. కానీ, రాజకీయాల మీద ఆసక్తి, నిరంతర పరిశీలన చేసే మిత్రుడొకరు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కెనడా నుంచి వాట్సాప్‌‌‌‌ మెసేజ్‌‌‌‌ పంపాడు. ‘హర్యానాలో బీజేపీ గెలవలేదు, కాంగ్రెస్‌‌‌‌ గెలవలేదు, లోకల్‌‌‌‌ పార్టీలూ గెలవలేదు. నిజానికి అక్కడ గెలిచింది ఓబీసీలు’ అన్నది ఆయన మెసేజ్‌‌‌‌ సారాంశం. ఓబీసీలను గట్టిగా నమ్ముకున్న బీజేపీ యంత్రాంగం, పోరాట బరిని ఆ ఒక్క అంశంతో వదిలేయకుండా సకల ప్రయత్నాలు చేసి ప్రజాభిప్రాయాన్ని తిరగ రాసింది. అనూహ్య ఫలితం సాధించింది. దేశంలోని అన్ని ముఖ్య సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేసింది. జాట్‌‌‌‌లు, దళితులు, ముస్లిం మైనారిటీలు తమకు మద్దతిస్తున్నారు అని నమ్మి, నిమ్మళంగా ఉన్న కాంగ్రెస్‌‌‌‌  గెలుపు ముంగిట్లో బొక్కబోర్లా పడింది.  

సోషల్​ కెమిస్ట్రీని గమనించలేదు

కాంగ్రెస్.. ఒక్క ముస్లింలు తప్ప జాట్‌‌‌‌లు, దళితుల సంపూర్ణ మద్దతు పొందలేక పోయింది. పైగా, అలా జరిగిన ప్రచారాల వల్ల ఓబీసీలు బీజేపీ వెనకాల సమైక్యం కావడం కాంగ్రెస్‌‌‌‌ కొంప ముంచింది. మనోభావాలు దెబ్బతినే సందర్భాల్లో.. లౌకికవాదం పేరిట ముస్లింల పట్ల సానుభూతితో స్పందిస్తూ, అటువంటి ఘటనలే హిందువులకు జరిగినపుడు కాంగ్రెస్‌‌‌‌ పాటిస్తున్న మౌనం వారికి నష్టం కలిగిస్తోంది. రాను రాను కాంగ్రెస్‌‌‌‌ ముస్లింల పార్టీగా మారుతోందని, అందుకే తమకు ముస్లింలు ఎక్కడా ఒక్క ఓటు వేయట్లేదంటూ బీజేపీ చేస్తున్న ‘ప్రచార ట్రాప్‌‌‌‌’లో కాంగ్రెస్‌‌‌‌ పడిపోతోంది. వారి వ్యవహారం అలాగే ఉంటోంది. ఇది, బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ ముఖాముఖి తలపడుతున్న రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాదిన కాంగ్రెస్‌‌‌‌ను వెనక్కే నెడుతోంది. పొత్తు కుదరక, విడిగా పోటీ చేసిన ‘ఇండియా’ కూటమి పక్షం ఆమ్‌‌‌‌ ఆద్మీ పార్టీ (ఆప్‌‌‌‌)కి దాదాపు 2 శాతం ఓట్లు దక్కడం కూడా కాంగ్రెస్‌‌‌‌ అవకాశాలను దెబ్బతీసింది. కానీ, కాంగ్రెస్‌‌‌‌ ముఖ్య నాయకులు భూపీందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ హుడా,  కుమారి షెల్జా, రణ్‌‌‌‌దీప్‌‌‌‌ సూర్జేవాలాలు ‘నాకు ముఖ్యమంత్రి పదవి’ అంటే, ‘అహా కాదు నాకే’ అంటూ ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు వరకు కొట్టుకోవడం అనైక్యతకు పరాకాష్ట. 

అంచనాలెందుకు తప్పి ఉంటయ్‌‌‌‌?

2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 5 స్థానాలు కాంగ్రెస్‌‌‌‌కు కోల్పోయి 5 స్థానాలకే పరిమితమైంది. ఓటు వాటా కూడా బీజేపీకి తరుగుతుంటే కాంగ్రెస్‌‌‌‌కు పెరుగుతూ వచ్చింది. ‘హర్యానాలో ఈసారి కాంగ్రెస్‌‌‌‌ పుంజుకుంటోంది, గెలుపు ఖాయం’ అన్నది కొన్ని నెలలుగా అందరి నోళ్లలో నానుతున్న మాట. పోలింగ్‌‌‌‌ రోజు సాయంత్రం వెల్లడైన సర్వే సంస్థల సగటు కూడా, సాధారణ మెజారిటీకి తగ్గకుండా 46 నుంచి 56 సీట్ల మధ్య కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి వస్తాయనే వెల్లడయింది. మరి, ఫలితం ఎందుకు వికటించింది?  కాంగ్రెస్‌‌‌‌ నాయకత్వ అతి విశ్వాసం, పార్టీ కార్యకర్తల అలసత్వం వల్ల ‘చేతి’కందింది కూడా జారిపోయింది. 2024 ఎన్నికల నుంచి కాంగ్రెస్‌‌‌‌కు ఆదరణ పెరుగుతోందన్న భావనను నిరూపించుకునే చక్కటి అవకాశాన్ని చేజార్చుకుంది. స్థానిక కార్యకర్తలు-, 
సానుభూతిపరుల నుంచి ఢిల్లీ అధినాయకత్వం వరకు ఎవరూ శ్రద్ద పెట్టిన సూచనలు కనిపించలేదు. ‘అయిపోయింది, గెలిచిపోయాం....ఇంకేంటి’ అన్న తప్పుడు ధీమా బలపడింది. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న నాయకులు ముగ్గురవటం వల్ల టిక్కెట్ల ఆశావహులు పెరిగారు. బీజేపీలో తిరుగుబాటు అభ్యర్థుల గురించి ఎక్కువ ప్రచారం జరిగినా, కాంగ్రెస్‌‌‌‌లోనూ ఆ బెడద తీవ్రంగానే ఉండింది. 

ఫలించిన సామాజిక వ్యూహం

2014, 2019 ఎన్నికల్లో జాతీయతా భావం, మోదీ వాదంతో నెట్టుకువచ్చిన బీజేపీ, ఈసారి వ్యూహాత్మకంగా కుల సమీకరణాలపై దృష్టిపెట్టి ‘సోషల్‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌’ జరిపింది.  ఎక్కడికక్కడ  కులం ‘కార్డు’ బలంగా వాడింది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న మనోహర్‌‌‌‌లాల్‌‌‌‌ ఖట్టర్‌‌‌‌ను సరిగ్గా లోక్‌‌‌‌సభ ఎన్నికల ముందు మార్చింది. రైతు ఉద్యమాల తర్వాత క్రమంగా చేజారుతున్న జాట్‌‌‌‌లకు వ్యతిరేకంగా ఇతర వెనుకబడిన వర్గాలను మచ్ఛిక చేసుకునే క్రమంలో నాయబ్‌‌‌‌ సింగ్‌‌‌‌ సైనీని తెరపైకి తెచ్చి, ముఖ్యమంత్రిని చేసింది. సమయం లేక ఆ ఎన్నికల్లో పెద్దగా రాజకీయ లభ్ది కలుగకపోయినా, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి డివిడెండ్స్​నే పార్టీ పొందింది. చాలా చోట్ల సిట్టింగ్‌‌‌‌లకు టిక్కెట్లు నిరాకరించి, వెనుకబడిన వర్గాల వారికి పెంచింది. 

వ్యూహాత్మక ప్రచారం

రైతు ఉద్యమాలు, ‘అగ్నిపథ్‌‌‌‌’పై వ్యతిరేకత, మహిళా రెజ్లర్లకు అవమానాలు, ఉద్యమాల నేపథ్యంలో ‘మోదీ’ వాదనను వ్యూహాత్మకంగా కొంచెం వెనక్కి నెట్టింది. ఆయన పర్యటనలు, ర్యాలీలు, సభలు కూడా పెద్దగా ఏర్పాటు చేయలేదు. స్థానికాంశాలనే ఫోకస్‌‌‌‌ చేసింది. లోగడ పలు రాష్ట్రాల్లో చేసినట్టు...మోదీ, రాహుల్‌‌‌‌ మధ్య పోలికల్ని ప్రచారాంశం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ డాబుకు ప్రచారం కల్పించలేదు. ‘డబుల్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌ సర్కార్‌‌‌‌’ వాదన, రెండింతల ప్రజావ్యతిరేకతకు దారితీస్తుందని శంకించి ఆ మాటే ఎత్తుకోలేదు. ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న మనోహర్‌‌‌‌లాల్‌‌‌‌ ఖట్టర్‌‌‌‌ కేంద్ర మంత్రి అయినా ఎన్నికల ప్రచారాల్లో ఆయన్ని దరిదాపులకు రానీయలేదు. చివరకు పార్టీ బ్యానర్లు, హోర్డింగ్‌‌‌‌లు, పోస్టర్లు,  గోడల మీద కూడా మోదీ, ఖట్టర్‌‌‌‌ల బొమ్మలు లేకుండా జాగ్రత్తపడింది. పార్టీకి ఓటమి అనివార్యం అనే మాట ప్రచారంలోకి వచ్చిన నుంచి పార్టీ యంత్రాంగం, ముఖ్యంగా ఆరెస్సెస్‌‌‌‌ శ్రేణులు తదేక దీక్షతో పనిచేయడం బీజేపీ విజయానికి ఎంతో దోహదపడింది.

మహారాష్ట్రకు మార్గం పడేనా?

హర్యానా ఎన్నికల ఫలితాల నుంచి ఎవరు ఏ పాఠాన్ని గ్రహిస్తారు? అనేదాన్ని బట్టే మహారాష్ట్రలో ఆయా పార్టీల, కూటముల గెలుపోటములు ఆధారపడనున్నాయి. నవంబరు మాసాంతం లోపలే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది గనుక ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ ఎప్పుడైనా వెలువడవచ్చు. అందుకు, పార్టీలు ఇప్పట్నుంచే సమాయత్తమౌతున్నాయి. ఎన్డీఏకు చెందిన పాలక ‘మహాయుతి’ కూటమి తరఫున మూడు పార్టీలు, విపక్ష ‘ఇండియా’ గ్రూప్‌‌‌‌లోని ‘మహారాష్ట్ర వికాస్‌‌‌‌ అఘాడీ’ తరఫున మూడు పార్టీలు బరిలో ఉంటాయి. ఇండియా కూటమి అప్పుడే పొత్తు-సీట్ల సర్దుబాటు సన్నాహక భేటీ జరిపింది. కాంగ్రెస్‌‌‌‌, ఎన్సీ కూటమిగా కలిసి ఉంటే జమ్మూ- కాశ్మీర్‌‌‌‌లో కలిసొచ్చిన ‘మిత్రలాభం’, కాంగ్రెస్‌‌‌‌-, ఆప్‌‌‌‌ మధ్య ‘మిత్రబేధం’ వల్ల హర్యానాలో జరిగిన నష్టం ‘ఇండియా’ మిత్రులు గుణపాఠంగా గ్రహిస్తారా? ఎందుకంటే, మిగతా రాష్ట్రాల కన్నా మహారాష్ట్రలో ఇప్పుడున్న రాజకీయ సంక్లిష్టత అలాంటిది. లేక, మొన్నటి లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటమిని పాఠంగా, నిన్నటి హర్యానా గెలుపును అనుభవంగా బీజేపీ మలుచుకుంటుందా? చూడాలి. 

- దిలీప్‌‌‌‌రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్,
 ‘పీపుల్స్ పల్స్’ సర్వే రీసెర్చ్ సంస్థ