తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు గుర్తింపు ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సోనియా తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్‌కు ఇటు తెలంగాణలో పెద్ద ప్రయోజనం ఏమీ దక్కకపోగా.. అటు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండుసార్లు ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ఓటమి చవిచూసింది. మరి వచ్చే ఎన్నికల్లోనైనా సత్తాచాటుతుందా? అందుకు ఉన్న అవకాశాలేమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు దేశం పార్టీ1983లో అధికారంలోకి వచ్చే ముందు వరకు కూడా అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్‌పార్టీనే ఆధిపత్యం చెలాయించేది. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించింది కాంగ్రెసే. పీవీ నర్సింహారావు, జలగం వెంగళ్రావు, డా. చెన్నారెడ్డి లాంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా మారడం. విద్యార్థుల బలిదానాలతో రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ మేరకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణను ప్రకటించారు. పలువురు పార్టీ నేతలు సహా కొందరు సన్నిహితులు ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ఎంపీ స్థానాలన్నీ కాంగ్రెస్ఈజీగా కైవసం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆ పార్టీ రెండు సీట్లు మాత్రమే పొందగలిగింది. 119 అసెంబ్లీ స్థానాల్లోనూ 21 చోట్లనే కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణలోనే పరిస్థితి ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. రెండో దఫా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ప్రజాభిమానం పొందలేకపోయింది. 2018 డిసెంబర్‌లో దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లిన కాంగ్రెస్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 19 చోట్లనే విజయం సాధించ గలిగింది. అయితే కాంగ్రెస్‌కు వరుస ఓటములు ఎదురైనా ఓటు బ్యాంకు మాత్రం ఉంది. 2019 మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కేవలం 41 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 29 శాతం, బీజేపీకి 19 శాతం ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి తెలంగాణలో కాంగ్రెస్‌కు ఇప్పటికీ ఓటు బ్యాంకు ఉందని చెప్పొచ్చు.
కాంగ్రెస్ అనుకూలతలివే..
తెలంగాణలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వ పునాదులు ఉండటం ఆపార్టీకి అనుకూలించే విషయం. పార్టీలో 30 ఏండ్లు, అంతకంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న నాయకులు ఉన్నారు. తెలంగాణ మొత్తం ఓట్లలో మైనారిటీలవి12 శాతం ఉంటాయి. మైనారిటీలు బీజేపీని ఓడించగల పార్టీకి ఓటు వేస్తారు. కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఉన్నారని వారు భావిస్తే దానికే ఓటు వేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పలుకుబడి ఉన్న రెడ్డి, వ్యవసాయ వర్గాలు చాలా కాలంగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తూ వచ్చాయి. టీఆర్‌ఎస్ తో పోలిస్తే ఇప్పటికీ కాంగ్రెస్పార్టీలోనే ఎక్కువ ప్రభావవంతమైన నాయకులు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఇందిరా గాంధీ కాలం నుంచే సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. వారంతా ఇప్పటికీ చెయ్యి గుర్తు ఎక్కడ ఉందా? అని చూస్తారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ఆధిపత్యం చెలాయిస్తుండగా.. కాంగ్రెస్ పట్టుకోల్పోతోంది. బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్,ఒడిశాలో కాంగ్రెస్ లేదు. ఒక్క తెలంగాణలో మాత్రం ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్ మనుగడలో ఉంది. తెలంగాణను ఇచ్చింది తామేనని ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు.
ప్రతికూలతలు
కాంగ్రెస్ కుఓటు బ్యాంకు ఉందని గ్రహించే దాన్ని బలహీన పరిచేందుకు టీఆర్ఎస్అధినేత కేసీఆర్నిరంతరం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత తమదేనని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న కేసీఆర్కాంగ్రెస్పై విరుచుకుపడుతూ దాని ప్రతిష్టను చిన్నది చేసి చూపుతున్నారు. ఉప ఎన్నికలు వచ్చిన చోట కాంగ్రెస్సీనియర్లీడర్లను ఓడిస్తూ.. ఆ పార్టీని బలహీన పరుస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌నేతలు విఫలమవడం ఆపార్టీకి నష్టం చేకూరుస్తోంది. కేంద్రంలో 2014, 2019 రెండుసార్లు అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్సహజంగానే రాష్ట్రాల్లోనూ బలహీనపడింది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ఇబ్బందుల్లో పడేది. ఒకప్పుడు గ్రామాల్లో కాంగ్రెస్‌కు పట్టు ఉండేది. వేగవంతమైన పట్టణీకరణతో గ్రామీణ ప్రజలు నగరాల బాట పట్టారు. దీంతో రాజకీయ సంబంధాలు బలహీనమయ్యాయి. ఆధిపత్య కులాలు కూడా ప్రభావం కోల్పోవడం కాంగ్రెస్‌కు నష్టం చేసింది. కాంగ్రెస్‌లో ఇప్పటికీ పాత లీడర్లదే ఆధిపత్యం ఉండటం ఆ పార్టీకి నష్టం చేస్తోంది. ఒక100 మంది కాంగ్రెస్ లీడర్లు గ్రూప్ ఫొటో దిగితే 30 ఏండ్ల కిందటి ఫొటో ఇప్పటి ఫొటోకు పెద్ద తేడాల ఉండవు. కానీ ప్రస్తుతం ఓటర్లు కొత్త ముఖాలను, యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్పనితీరులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. గాంధీలతో టచ్‌లో ఉంటేనే కాంగ్రెస్‌లో మంచి నేత అనే విధానం మారాలె. సంస్థాగతంగా ఆ పార్టీ బలపడితేనే.. ప్రజా క్షేత్రంలోనూ ప్రత్యర్ధితో సరైన యుద్ధం చేయగలుగుతుంది.
కార్యకర్తలను కాపాడుకోవాలె..
తెలంగాణ కాంగ్రెస్ గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే.. అది పార్టీ సీనియర్ కార్యకర్తలే. వాళ్లు ఎప్పుడూ పార్టీ కోసం పని చేశారు తప్ప ఏమీ ఆశించలేదు. అతి ముఖ్యమైన ఈ విభాగాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. వారికి ప్రాధాన్యం దక్కడం లేదు. వెలకట్టలేని ఆ కార్యకర్తలు అసహనంతో వెనుదిరుగుతున్నారు. తెలంగాణలో తదుపరి ఎన్నికలు జూన్ 2023లోపు జరగవచ్చు. ప్రశాంత్ కిషోర్ పాత్ర అనుమానాస్పదంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన మొదలు కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాలనుకున్నారు. కానీ దాన్ని అకస్మాత్తుగా వదిలివేసి ఇప్పుడు కేసీఆర్‌కు వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన గాంధీల నుంచి తెలంగాణ కాంగ్రెస్ గురించి ఎన్ని రహస్యాలు తెలుసుకున్నరనేదే ప్రశ్న. ఇటు కాంగ్రెస్, అటు టీఆర్‌ఎస్ రెండు పార్టీల్లోనూ పని లేని సీనియర్ నేతలు పెరిగిపోయారు. కొత్త నేతలను ఆకర్షించే ఆలోచన కాంగ్రెస్‌లో లేదు. పార్టీ సీనియర్ నేత ఎ.కె. ఆంటోనీ 2014 జులైలో ఇచ్చిన నివేదికలో కాంగ్రెస్ నిజంగా లౌకికవాదంగా ఉండాలని, హిందూ వ్యతిరేకిగా కనిపించకూడదని హెచ్చరించారు. ఆయన మాటలకు ఇక్కడ ప్రాధాన్యత ఉంది. తెలంగాణలోనూ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీలా కనిపించకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. హిందూ వ్యతిరేక పార్టీలా కనిపిస్తే ఓటర్లు బీజేపీ వైపు వెళ్లే ప్రమాదం లేకపోలేదు.
త్రిముఖ పోటీ ఉంటే నష్టమేనా?
కాంగ్రెస్‌ను పూర్తిగా తుడిచిపెట్టాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ముప్పు అని, కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమకు కష్టాలు తప్పవని టీఆర్ఎస్ పార్టీకి తెలుసు. కాగా 2023లో టీఆర్‌ఎస్‌ను నిలువరించకపోతే తెలంగాణ నుంచి పూర్తిగా పతనమవ్వాల్సి ఉంటుందని కాంగ్రెస్‌కు తెలుసు. బీజేపీ కాస్త పెరిగినా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ రెండు పార్టీలు బీజేపీని తక్కువ శత్రువుగా చూస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సాధారణ మెజార్టీ కూడా రాకపోవడం టీఆర్‌ఎస్‌కు ఓటమి అనుకుంటే.. టీఆర్ ఎస్పార్టీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ఓటమి అవుతుంది. టీఆర్‌ఎస్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు 300 రోజుల సమయం మాత్రమే ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ త్రిముఖ పోరు ఉంటే.. అది టీఆర్‌ఎస్‌కు లాభసాటిగా, కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారాలున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌లో చాణక్యుడు ఉన్నాడా లేడా అన్నదే ప్రశ్న.