సత్తుపల్లి, వెలుగు : కేసీఆర్ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా తాను అక్కడి నుంచి సీఎంపై పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న అన్నారు. మహా పాదయాత్రలో భాగంగా బుధవారం తీన్మార్ మల్లన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కిష్టారంలో పర్యటించారు. కిష్టారం ఓసీపీలో సింగరేణి కార్మికులతో మాట్లాడారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేసీఆర్ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అన్నారు.
తన పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటోందని, పాదయాత్ర చేస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ వినీత్ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడమేనని తీన్మార్ మల్లన్న అన్నారు. తాము ప్రస్తుతం తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించామని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పేదలకు అందడం లేదని, కేసీఆర్ గద్దె దిగేవరకు పోరాడతామన్నారు. రానున్న రోజుల్లో రాజకీయపరంగా ముందుకు వెళతామని, తమ 7200 ఉద్యమాన్ని కొత్త రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సమావేశం లో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి భూమన్న, ప్రధాన కార్యదర్శి రజనికుమార్ పాల్గొన్నారు.