జగిత్యాల, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి ధీమా వ్యక్తం చేశారు. గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’ మీటింగ్జరిగింది. దీనికి ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ ఎమ్మెల్యే పీఎల్ పాఠక్‌తో కలిసి వివేక్ హాజరయ్యారు. మొదట కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాఠక్ నియోజకవర్గంలో పార్టీ పనితీరును పరిశీలించి సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు. ‘‘ధర్మపురి నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ పార్టీ గెలుపు ఖాయం. బీజేపీ నేతలు పార్టీలు మారుతారంటూ వచ్చేవన్నీ పుకార్లే. హైకమాండ్ అవకాశమిస్తే ధర్మపురి నుంచి పోటీ చేస్తాను” అని తెలిపారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడానికి ప్రధాని మోదీ ప్రోత్సాహమే కారణన్నారు. ‘‘సంక్షేమ పథకాల్లో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని చెప్పిన కేసీఆర్.. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చారు. తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేం లేదు” అని విమర్శించారు.
రోజుకు 37 కి.మీ. రోడ్లు..
కేంద్రం చేసిన అభివృద్ధి ఏమిటని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం హాస్యాస్పదమని వివేక్ అన్నారు. ‘‘జీడీపీ రేటు పెంచేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతిరోజు యావరేజ్‌గా 37 కిలో మీటర్ల మేర రోడ్లు వేస్తున్నా రు. ఇప్పటి వరకు దాదాపు 60 వేల కిలమీటర్ల రోడ్లు వేశారు. విదేశాల్లో కరోనా వాక్సిన్లకు డబ్బులు వసూలు చేస్తే, మన దేశంలో ఉచితంగా అందజేసిన ఘనత మోడీది. కేంద్రం పేదలకు ఇండ్లు కట్టిస్తున్నది. ఒక్క యూపీలోనే 50 లక్షల ఇండ్లు కట్టారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. దీన్ని రూ.10 లక్షలకు పెంచే యోచనలో ఉన్నారు” అని చెప్పారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.10 ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ, కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ మంచె రాజేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం, లీడర్లు గంగారాం, చక్రపాణి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.