సీఎంను ఓడగొట్టే మొనగాడు రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  • కాళేశ్వరం లాంటి క్వాలిటీ లేని పనులు చేస్తే చైనాలో ఉరేస్తరు
  • ఈఎన్సీ మురళీధర్ ​రావును కటకటాల్లోకి పంపాలని వ్యాఖ్య

జగిత్యాల, వెలుగు: ‘కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలందరూ కసితో ఉన్నరు.. ప్రతి ఓటరు ఒక కార్యకర్తలా పని చేసేందుకు సిద్ధమయ్యారు.. కామా రెడ్డిలో కేసీఆర్​ను ఓడించే మొనగాడు రేవంత్ రెడ్డి’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల టౌన్​లోని పొన్నాల గార్డెన్​లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రా ష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి, కచ్చితంగా 70‌‌‌‌‌‌‌‌ నుంచి 80 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తరు. అందులో మొదటిది కామారెడ్డి స్థానమే’ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కింద బొగ్గు గనులు ఉన్న విషయం కూడా ఆఫీసర్ల కు తెల్వలేదని ఫైర్​ అయ్యారు. ‘‘దొరగారు సంతకం పెట్టమంటే ఈఎన్సీ మురళీధర్​ రావు కండ్లు మూసుకొని సంతకం పెట్టారు. సాంకేతికంగా పరిశీలించకుండా కాళేశ్వరం డిజైన్​ను అప్రూవ్ చేసిన ఆయనను న్యాయవిచారణ జరిపి, కటకటాల్లోకి నెట్టాలి. ఇట్ల నాణ్యత లోపాలతో నిర్మాణం చేపట్టిన వారిని చైనా లాంటి దేశాల్లో ఉరి తీస్తరు” అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ చేపట్టి, కమీషన్ల సొమ్ము కక్కిస్తామన్నారు.

వరికి అదనంగా రూ. 500 బోనస్..

మా ప్రత్యర్థులు ఆర్థికంగా బలవంతులని,అయినా కాంగ్రెస్ కు ప్రజల సానుభూతి, ఆశీర్వాదం ఉందని ధీమా వ్యక్తం చేశారు. వరి మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ తో పాటు పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు లీటరుకు రూ. 7 ప్రోత్సాహం అందించేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్​లో చేరిన జాబితాపూర్ ఉప సర్పంచ్ లక్ష్మారెడ్డి, జగిత్యాల మండలం, అర్బన్ మండలాలకు చెందిన పలువురు యువకులు, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలను జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.