మరోసారి గెలిపిస్తే నాలుగింతల అభివృద్ధి చేస్త  : పువ్వాడ అజయ్ కుమార్​

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంకు మరోసారి పాత ఇనుప సరుకు వస్తోందని, దాన్ని ఇంటికి ఎలా పంపాలో తమకు తెలుసని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ప్రతిపక్ష పార్టీ లీడర్లను ఉద్దేశించి అన్నారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి నుంచి సూర్య తండా వెళ్లే రోడ్డుపై రూ.2.95 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి, పల్లె దవాఖాన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్క చింతగుర్తి గ్రామానికే రూ.3.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మూడోసారి బీఆర్ఎస్​ప్రభుత్వం వచ్చాక ఇంతకు నాలుగింతల అభివృద్ధిని చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, జడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవి ఉన్నారు. అనంతరం ఖమ్మం మున్సిపాలిటీలో జీఓ నం.58, 59 పట్టాలను, గృహలక్ష్మి మంజూరు పత్రాలను మంత్రి అజయ్​లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పలు డివిజన్లలో సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

మంత్రుల పర్యటనను సక్సెస్​ చేయాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్​కోరారు. శుక్రవారం క్యాంప్​ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గుబ్బగుర్తిలో గోద్రెజ్​అగ్రోవెట్ సంస్థ నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి, ఖమ్మంలో రూ.1,370 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు.