డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. అయితే ఆయన విజయం సాధిస్తారా లేదా అనే పలు సందేహాలు ఉన్నాయి. అమెరికా రాజకీయ చరిత్రలో ఒకరు మాత్రమే మళ్లీ రెండోసారి కొంతకాలం గ్యాప్ తరువాత అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు ఆ రికార్డును ట్రంప్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు. జులై 13, 2024న డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యా యత్నం ఆయన ఇమేజ్‌ని మరింత పెంచింది. గతంలో వైట్‌హౌస్‌ను విడిచిపెట్టిన అనంతరం నాలుగు సంవత్సరాల తర్వాత 1893లో మళ్లీ గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు.
ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఆయన విజయావ కాశాలను భారీగా పెంచింది. ట్రంప్ గెలిస్తే.. అమెరికా చరిత్రలో 4 సంవత్సరాల విరామం తర్వాత ప్రెసిడెంట్ అయిన రెండో అధ్యక్షుడు అవుతారు. ప్రస్తుతం ఆయనకు ప్రజల్లో పాపులారిటీ పెరిగిందనేది వాస్తవం. ట్రంప్‌కు పెరిగిన ప్రజాదరణతోపాటు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వైఫల్యాలు కూడా ఆయన గెలుపునకు సహకరిచే అవకాశం ఉంది. కొన్నిసార్లు రాజకీయాల్లో గెలుపు అనేది అన్ని వ్యక్తిగత వైఫల్యాలను కనుమరుగు చేస్తుంది.
గ తంలో గొప్ప సామ్రాజ్యాల్లో భారతీయ, చైనీస్, గ్రీకు, రోమన్, టర్కిష్, రష్యన్, ఫ్రెంచ్, బ్రిటిష్ సామ్రాజ్యాలు కీలకంగా ఉండేవి. ప్రస్తుతం అన్ని సామ్రాజ్యాలు కాలగమనంలో కలిసిపోయాయి. రాజ్యాలు కనుమరుగై గతించిపోయాయి. కానీ, ప్రస్తుతం అమెరికా మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించే ఒక శక్తిమంతమైన సామ్రాజ్యం వంటిది. దీంతో అమెరికాను తదుపరి ఎవరు పాలిస్తారనే దానిపై ఉత్కంఠ, ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు కొత్తేమీ కాదు.
2020 ఫిబ్రవరిలో మోదీ ప్రభుత్వం ఆయనకు మరపురాని పర్యాటక గౌరవాన్ని అందించింది. 2017 నుంచి 2020 మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారతదేశం అమెరికాతో అద్భుతమైన దౌత్య, వ్యాపార సంబంధాలను కలిగి ఉండేది. ట్రంప్ వైఖరి అన్-ప్రిడిక్టబుల్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆయన భారతదేశంతో మాత్రం సంబంధ బాంధవ్యా లను మెరుగ్గా కొనసాగించారు.
అయితే ఓవైపు వలసలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కానీ, ఇమ్మిగ్రేషన్, వర్క్-వీసాల అంశాలను పక్కన పెడితే అమెరికాతో భారత్ సంబంధం మెరుగ్గానే ఉంది. అయితే, యూనివర్స్ స్వభావం మనం స్పష్టంగా ఊహించలేం. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికైతే భారత్‌తో ఎలా ప్రవర్తిస్తారనేది కచ్చితంగా ఊహించలేనిది.
ఉగ్రవాదంపై ట్రంప్ కఠిన వైఖరి
యూఎస్ఏ వర్క్ వీసాలు, గ్రీన్ కార్డ్‌లు తదితర అంశాల్లో తెలుగువారు తొలుత ఆందోళన చెందారు. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్ కఠినంగా వ్యవహరించడం, ఇమ్మిగ్రేషన్‌కు ఆయన వ్యతిరేకంగా ఉన్నందున మనవారికి ఆయన పాలక విధానాలు అంతగా సహాయపడలేదు. అనంతరం తరువాత దశలో ట్రంప్.. అమెరికా, మెక్సికన్ సరిహద్దు మీదుగా అక్రమంగా యూఎస్ఏలోకి చొచ్చుకువస్తున్న కార్మికులు, అర్హత కలిగిన భారత వలసదారులకు మధ్య ఉన్న తేడాను ట్రంప్ గుర్తించడంతో సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
ట్రంప్ టెర్రరిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారతదేశానికి అతిపెద్దగా ఆందోళన కలిగించే అంశం పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం. ట్రంప్ తీవ్రవాదానికి పూర్తిగా వ్యతిరేకం కావడంతో కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో భారత్‌కు దోహదపడింది. ట్రంప్ హయాంలో భారత్‌పై ఎక్కువ వ్యతిరేకత వ్యక్తం కాలేదు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా లేదా బిల్ క్లింటన్లాగ ట్రంప్ ఎప్పుడూ భారత వ్యతిరేక ప్రకటనలు చేయలేదు. ట్రంప్ ఎప్పుడూ భారత్‌ను విమర్శించలేదు, ఇబ్బంది పెట్టలేదు.
చైనా ఆర్థిక విధానాలు, వివిధ దేశాల పట్ల దూకుడుగా 1971 తర్వాత యుద్ధప్రాతిపదికన ప్రవర్తించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చైనాతో పరోక్షంగా తలపడడం ద్వారా ట్రంప్ చైనా ఇమేజ్‌ను మార్చేసి భారత్‌కు ఎంతో ప్రయోజనం చేకూర్చారు. 2020 ఏప్రిల్ లో చైనా భారత్‌తో తన ఒప్పందాలను ఉల్లంఘించి, హిమాలయ సరిహద్దుల్లో భారత్‌ను రెచ్చగొట్టేవిధంగా కవ్వింపు చర్యలను ప్రారంభించింది. అయితే, ట్రంప్ చైనా వ్యతిరేక వైఖరి
డ్రాగన్‌ను కట్టడి చేసింది.
చైనా ఆర్థిక వ్యవస్థను నియంత్రించిన ట్రంప్
చైనా ఆర్థిక వ్యవస్థను కూడా ట్రంప్ నియంత్రించారు. యూరప్, అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్యం కారణంగా చైనా భారీ ఆర్థిక వ్యవస్థగా మారింది. 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక చైనాపై వాణిజ్యపరమైన నియంత్రణలు విధించాడు. ఈ నియంత్రణలు చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. అమెరికా కంపెనీలకు తమ ఫ్యాక్టరీలను చైనా నుంచి తరలించాలని ట్రంప్ సూచించారు.
దీంతో APPLE వంటి భారీ కంపెనీలు భారతదేశంలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం ప్రారంభించడంతో ఇది భారతదేశ ఆర్థికరంగానికి ఎంతో సహాయపడింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటికీ అమెరికా బలగాలు అఫ్గానిస్తాన్‌లో ఉండేవి. అందువల్ల అమెరికా అఫ్గనిస్తాన్‌కు వెళ్లే భూమార్గం కోసం పాకిస్థాన్‌పై ఆధారపడింది. ప్రస్తుతం అమెరికా తన సైనిక బలగాలను అఫ్గానిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంది.
ఈ నేపథ్యంలో అమెరికాకి1947 తర్వాత మొదటిసారిగా పాకిస్థాన్ అవసరం లేకుండాపోయింది. భారతదేశ భద్రతకు ప్రధానంగా ఆందోళన కలిగించే దేశాలు పాకిస్తాన్, చైనా. సొంత ప్రయోజనాల దృష్ట్యా అమెరికా చైనాతో స్నేహపూర్వకంగా ఉండదు. మరోవైపు చైనాతో స్నేహపూర్వకంగా ఉన్నందున పాకిస్థాన్‌ను విశ్వసనీయత లేని దేశంగా పరిగణిస్తోంది. తమ దేశాలపై సానుకూల భావం లేని ట్రంప్‌తో చైనా, పాకిస్థాన్‌లు వ్యవహరించాల్సిఉంటుంది. కాబట్టి ఇది భారత్‌కు కచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది.
తెలుగు రాష్ట్రాలకు అమెరికా కీలకం
అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఉన్న భారతీయుల్లో తెలుగువారే ఎక్కువగా ఉన్నారు. పంజాబ్ నుంచి వచ్చిన కూలీలు లేదా వ్యవసాయ కార్మికులు, గుజరాత్ నుంచి చిన్న వ్యాపారులు కాకుండా సాంకేతిక అర్హత కలిగిన తెలుగువారు ఎక్కువగా అమెరికాలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ 2017–- 2020 మధ్య చైనాకు వ్యతిరేకంగా అడ్డంకులు, నియమ నిబంధనలు ప్రారంభించినప్పుడు,
"చైనా ప్లస్ 1" అనే కొత్త విధానం ఆవిర్భవించింది. దీని అర్థం అమెరికా, యూరోపియన్ కంపెనీలు తమ కర్మాగారాల్లో కనీసం ఒకదానిని చైనా నుంచి తరలించాలి. ఈక్రమంలో దిగ్గజ కంపెనీ APPLE భారతదేశంలో 3 ఫ్యాక్టరీలను ప్రారంభించింది. ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా కృషి చేస్తే వారి భారీ కర్మాగారాలలో కొన్నింటిని ఏపీ, తెలంగాణలలో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా అధిక జీతాలతో ఉద్యోగాలు, లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తాయి.
భారతీయులకు సులభతరమైన ఇమ్మిగ్రేషన్
అమెరికా యూనివర్సిటీలో డిగ్రీ పొందిన భారతీయులకు గ్రీన్‌కార్డులు ఇస్తామని కూడా ట్రంప్ గత నెలలో ప్రకటించారు. సులభతరమైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో భారతీయులకు అండగా ఉంటానని కూడా ట్రంప్ బహిరంగంగానే చెప్పారు. తెలుగువారికి ఈ పరిణామం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఆశావాదంగా ఉండటంలో తప్పు లేదు.
ట్రంప్ వ్యక్తిత్వం అన్‌ప్రిడిక్టబుల్
ట్రంప్ వ్యక్తిత్వం ఊహించలేనిది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అయితే మనదేశంతో సంబంధాలు అకస్మాత్తుగా మారే అవకాశం ఉంది. ఈ విషయంలో భారతదేశం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అమెరికాతో సర్దుబాటు ధోరణిని అవలంబించాలి. శక్తిమంతమైన శత్రువులను ఎదుర్కొన్నప్పుడు చైనా తన విధానాలను అకస్మాత్తుగా మార్చుకోవడం.. చరిత్రలో ప్రసిద్ధి పొందింది. భారత్‌పై పైచేయి సాధించడానికి ఒకవేళ ట్రంప్ ముందు తలవంచాలని చైనా నిర్ణయించుకున్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించే ట్రంప్ చూపు నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ చాలా లో ప్రొఫైల్‌ను పాటించే అవకాశం ఉంది. అయితే, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న సంగతి ట్రంప్‌కు పూర్తిగా తెలుసు.
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్