
- 20 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ పదవి
- కాంగ్రెస్ కు నికరంగా వచ్చేది మూడు
- ఆ 10 మంది ఎమ్మెల్యేలు విప్ ధిక్కరిస్తేనే మరోటి
- బీఆర్ఎస్ రెండు గెలవాలన్నా వాళ్ల ఓట్లే కీలకం
- దీంతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేల సపోర్ట్ మస్ట్
- విప్ ధిక్కరిస్తే వాళ్ల ఎమ్మెల్యే పదవులకే ఎసరు
కాంగ్రెస్ 65, సీపీఐ01, ఎంఐఎం07,బీజేపీ 08, బీఆర్ఎస్(38–10)= 28 ఇది తెలంణాలో ఎమ్మెల్యేల సంఖ్య. పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది..దీంతో బీఆర్ఎస్ కు నికరంగా ఉన్నది 28 మంది శాసన సభ్యులే.
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమవుతుందా..? లేదా ఎన్నికలు జరుగుతాయా.? అన్నది హాట్ టాపిక్ గా మారింది. పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ మూడు స్థానాలను సునాయసంగా గెలుచుకుంటుంది. మరో స్థానం విషయంలో పేచీ ఏర్పడింది. ఈ స్థానాన్ని అటు ఎంఐఎం, ఇటు సీపీఐ ఆశిస్తున్నాయి.
కాంగ్రెస్ కు ఉన్న బలానికి వీళ్ల సీట్లు తోడైనా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరి కానున్నాయి. అయితే ఆ ఒక్క సీటు ఎన్నిక అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటిలెక్క ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటుకు 20 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. అసెంబ్లీ లెక్కల ప్రకారం కాంగ్రెస్+సీపీఐ కలిసి 66 మంది ఎంఎల్ఏలున్నారు. బీఆర్ఎస్ కు 38 మంది ఎంఎల్ఏలున్నారు. బీజేపీకి 8, ఎంఐఎంకి ఏడుగురు ఎమ్మెల్యేల బలముంది. కాంగ్రెస్ కు ఉన్న 65 మంది ఎంఎల్ఏల బలం ఆధారంగా మూడు పదవులు పక్కాగా వస్తాయి.
బీఆర్ఎస్ కు ఉన్న 38 మంది ఎంఎల్ఏల ప్రకారం ఒక్కసీటు ఖాయం. బీఆర్ఎస్ 20 మంది ఎంఎల్ఏల ఓట్లు పోను ఇంకా 18 మంది ఎంఎల్ఏల ఓట్లు అదనంగా ఉంటాయి. బీఆర్ఎస్ రెండు సీట్లు గెలవాలంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం అవసరం. కాంగ్రెస్ లో 60 మంది ఎంఎల్ఏలు ఓట్లు వేయగా ఇంకా ఐదుఓట్లు మిగులుంటాయి. సీపీఐ ఒక్క ఓటును కూడా కలిపితే మిగులు ఓట్లు 6 అవుతాయి. ఇక ఎంఐఎం ఏడుగురు ఎంఎల్ఏల ఓట్లను కూడా కలుపుకుంటే 13 ఓట్లవుతాయి.
అయినా ఏడుగురు ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన కాంగ్రెస్ నాలుగో సీటు గెలవాలంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల ఓట్లు తప్పక అవసరం అవుతాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మొత్తం బలం 38 మంది అయితే.. రెండో స్థానం కోసం ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపితే ఎన్నిక అనివార్యం అవుతుంది. కాంగ్రెస్ కు నాలుగు సీట్లు ఎందుకు ఇవ్వాలని బీఆర్ఎస్ అనుకుంటే పరిస్థితి ఎన్నికల దాకా వెళ్తుంది.
ఆ పది మంది ఓట్లే కీలకం
బీఆర్ఎస్ ఇద్దరితో నామినేషన్లు వేయించిన తర్వాత ఎన్నిక అనివార్యమైతే అప్పుడు 38 మంది ఎంఎల్ఏలకు విప్ జారీచేస్తుంది. విప్ జారీ చేస్తే పార్టీ తరపున పోటీచేస్తున్న ఇద్దరు అభ్యర్ధులకు కచ్చితంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ ఓట్లు వేయాల్సిందే. ఒకవేళ ఎవరైనా విప్ ను ధిక్కరించి క్రాస్ ఓటింగ్ చేస్తే అప్పుడు ఆ ఎంఎల్ఏపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ లేఖ రాస్తుంది. స్పీకర్ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తుంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్లు సుప్రీం కోర్టు విచారణలో ఉన్నాయి. ఈ తరుణంలో విప్ ధిక్కారం అంశం బీఆర్ఎస్ కు ప్రధాన అస్త్రంగా మారనుంది.