సైనికుల త్యాగం వృథా కాదు.. రెండేళ్లలో నక్సలిజాన్ని లేకుండా చేస్తాం: హోంమంత్రి అమిత్ షా

సైనికుల త్యాగం వృథా కాదు.. రెండేళ్లలో నక్సలిజాన్ని లేకుండా చేస్తాం: హోంమంత్రి అమిత్ షా

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. సోమవారం(జనవరి 05) బీజాపూర్ జిల్లా భేద్రే కుట్రు ర‌హ‌దారిలో జ‌వాన్ల వాహ‌నాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 మంది జ‌వాన్లతో పాటు ఓ సివిల్ డ్రైవ‌ర్ అక్కడిక‌క్కడే ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ముగ్గురు జ‌వాన్లకు తీవ్ర గాయాల‌య్యాయి. ఐఈడీ పేలిన స‌మ‌యంలో పోలీసుల వాహ‌నంలో 15 మంది జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) జ‌వాన్లు ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. 

సైనికుల త్యాగం వృథా కాదన్న అమిత్ షా .. 2026 మార్చి నాటికి భారత్ నుంచి నక్సలిజాన్ని కేంద్రం నిర్మూలిస్తుందని ఎక్స్‌(X)లో పోస్ట్‌ చేశారు. 

"బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్)లో జరిగిన IED పేలుడులో డీఆర్‌జీ సైనికులు మరణించారనే వార్త నాకు చాలా బాధ కలిగించింది. వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ బాధను మాటల్లో చెప్పలేం, కానీ మన సైనికుల త్యాగం వృథాకాదని నేను మీకు భరోసా ఇస్తున్నా.. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని భారత భూభాగం నుంచి పూర్తిగా నిర్ములిస్తాం.." అని అమిత్ షా అన్నారు.

ఇదిలావుంటే, పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. జ‌వాన్ల శరీరాలు ఛిద్రమైపోయాయి. ప్లాస్టిక్ షీట్లపై ఛిద్రమైన మృతదేహాలు కనిపించాయి. ఆ దృశ్యాలు కంటతడి పెట్టించేవిగా ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా బలగాలు ఇప్పటికే ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

ALSO READ | జవాన్ల వాహనాన్ని బాంబులతో పేల్చేసిన నక్సలైట్లు