ప్రజాపాలన విజయోత్సవాల్లో ఉపాధి పనులను ప్రారంభిస్తరా?

ప్రజాపాలన విజయోత్సవాల్లో ఉపాధి పనులను ప్రారంభిస్తరా?
  • సర్క్యులర్​ జారీ ఆశ్చర్యానికి గురిచేసింది: బండి సంజయ్​
  • ఉపాధి హామీకి నిధులిచ్చేది కేంద్ర సర్కారే
  • ప్రారంభోత్సవంలో ‘ప్రధాని’ ఫొటో పెట్టాల్సిందే..
  • లేకుంటే  కాంగ్రెస్ తీరును ఎండగడుతామని వార్నింగ్​ 

హైదరాబాద్, వెలుగు:  ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా  ఈ నెల 26న అన్ని గ్రామ పంచాయతీల్లో  ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు సర్క్యులర్ జారీ చేయడం ఆశ్చర్యంగా ఉన్నదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్​ అన్నారు. గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులకు కేంద్ర ప్రభుత్వమే 90 శాతం నిధులిస్తున్నదని గుర్తుచేశారు. సోమవారం బండి సంజయ్​ ఓ ప్రకటన రిలీజ్​ చేశారు.  గ్రామాల్లో మొక్కల పెంపకం, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, రోడ్ల నిర్మాణంలాంటి పనులన్నీ ఉపాధి హామీ పథకం నిధులతో జరుగుతున్నవేనని గుర్తుచేశారు. అయినా, రాష్ట్ర సర్కారు ఏడాది పాలనా విజయోత్సవాల పేరుతో ఉపాధి పనులను ప్రారంభించాలని ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. 

సొమ్ము కేంద్రానిదైతే... సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నట్టుగా కాంగ్రెస్ తీరు  ఉన్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేక కేంద్రం నిధులతో అమలవుతున్న ఉపాధి పనులను విజయోత్సవాలుగా ప్రారంభించుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో గ్రామీణ పేదలకు ఉపాధి దూరమైతే.. ఎన్డీయే పాలనలో కోట్లాది మందికి వరంగా మారిందని చెప్పారు. 

గత పదేండ్లలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్క తెలంగాణలోనే దాదాపు రూ.30 వేల కోట్ల మేరకు నిధులు కేటాయించినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉపాధి హామీ పథకం పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో తప్పనిసరిగా ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని డిమాండ్​ చేశారు. దీనికితోడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో నిర్వహించే స్కీములకూ మోదీ ఫొటో తప్పనిసరిగా పెట్టేలా ఉత్తర్వులు జారీచేయాలని అన్నారు