కనిపించే ఉచితాలు తెలుసు.. మరి కనిపించని ఉచితాలెన్నో

కనిపించే ఉచితాలు తెలుసు.. మరి కనిపించని ఉచితాలెన్నో

మనదేశంలో ఉచితాలు కొత్త కాదు.  వీటిమీద చర్చ కూడా కొత్తది కాదు.  ఈ ఉచితాలు అనేక రూపాల్లో ఉన్నాయి.  అంతేకాదు.  ఉచితాలు అనేక పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు అవి ప్రభుత్వ విధానాలుగా మారిపోయాయి. అందులో రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయి. సబ్సిడీలు, బహుమతులు, విద్యుత్​ రాయితీలు, నీరు అందించడం, రుణమాఫీ, ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించడమనేది రాజకీయ పక్షాల ఎజెండాలో భాగమే.  ఫిబ్రవరి 12, 2025న పట్టణ  నిరాశ్రయులకు షెల్టర్​ పథకం అమలుకి  సంబంధించిన రిట్ పిటిషన్​ను విచారిస్తున్నప్పుడు ఈ ఉచితాల అంశం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఈ రిట్​ పిటిషన్​ విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్​ గవాయ్​ నిరాశ్రయులైన ప్రజలను ‘పరాన్న జీవులు’గా అభివర్ణించారు.  ఈ నిరాశ్రయులైన  ప్రజలు ఆహార ధాన్యాలు, ఇతర ప్రయోజనాలు ఉచితంగా పొందుతున్నారు. ఈ ఉచితాలు ఇచ్చి వాళ్లని పరాన్న జీవులుగా మార్చడం లేదా..? అని గవాయ్​ ప్రశ్నించారు.

ఎన్నికలు రాగానే ఉచితాలను రాజకీయ పక్షాలు ప్రకటిస్తున్నాయి. ఈ ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. దేశానికి దోహదపడేవిధంగా వారిని సమాజ ప్రధాన స్రవంతిలో భాగం చేయడం మంచిది కాదా?  అని  ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామ్యవాద స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రజల స్థితిగతులను ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు గమనిస్తున్నట్టుగా అనిపించడం లేదు.  సంక్షేమ పథకాలు, సంక్షేమ చర్యలు పౌరులను, గ్రూపులను  సాధికారికత కోసం సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.  వెనుకబడిన, అసమాన సమాజంలో ఇవి అవసరం.  అభివృద్ధి చెందిన దేశాలు కూడా పౌరుల సంక్షేమం కోసం ఉచితాలను అందిస్తున్నాయి.  ప్రజలకు సమాన అవకాశాలు ఉండాలి. దేశ వనరులను అందరికీ సమానంగా అందించాలి. ఉచిత ధాన్యాలను ఇవ్వడం,  నగదు ఇవ్వడంలాంటి  సోషలిస్టు ఆదర్శాలను గౌరవిస్తున్నట్టుగా భావించాలి.  న్యాయమూర్తుల తీర్పులను చెప్పేటప్పుడు, కేసులని విచారిస్తున్న దశలో చేసే వ్యాఖ్యలు రాజ్యాంగ విలువల స్ఫూర్తికి విఘాతం కలిగించేవిధంగా ఉండకూడదు. ఉచితాల వల్ల ఒక వర్గం ప్రజలు సోమరులుగా తయారవుతున్నారని అనడం పరాన్నజీవులుగా అభివృర్ణించడం దురదృష్టకరం. అణగారిన ప్రజల మీద నైతిక తీర్పు ఇవ్వడంలాంటిది. అయితే, ఇటీవలి కాలంలో పార్టీలు తమ ఎన్నికల విజయాల కోసం, పోటీతత్వంతో ప్రజాకర్షణలో నిమగ్నమై ఒకరిని మించి ఒకరు  ఉచితాలను ప్రకటిస్తున్నాయి. ఇవి రాజకీయాలను, ఎన్నికలను ఒక లావాదేవీలుగా మారుస్తున్నాయి. ఈ ఉచితాల ఆకర్షణలో పడి ఓటర్లు ఎన్నికల్లో ప్రభావితం అవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా చర్చ

న్యాయమూర్తి  వ్యాఖ్యలు మీద దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 300 మంది యాక్ట్​విస్టులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కొన్ని సంస్థలు కలిసి ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక బహిరంగ లేఖను రాశాయి.  అందులో ఈ విధంగా పేర్కొన్నారు.  పేద ప్రజల పట్ల  న్యాయవ్యవస్థ  వ్యతిరేకతను  ప్రతిబింబిస్తున్నాయి. పట్టణంలో ఉంటున్న పేద ప్రజలు నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటున్నారు. వారు నిర్మాణ పనులు, పారిశుద్ధ్య పనులు, వివాహ వేడుకలలో క్యాటరింగ్ మొదలైన పనులను కష్టపడి చేస్తున్నారు. ఉచితాలను పొందడానికి, పనిచేయడానికి ఇష్టపడని నిరాశ్రయులను ‘పరాన్న జీవులను’ పిలవడం అనేది బలవంతులు విశేష సౌకర్యాలు ఉన్న వ్యక్తులు తరచూ అనే మాట. సుప్రీంకోర్టు సీనియర్​ న్యాయమూర్తి దగ్గర నుంచి ఇలాంటివి ఊహించలేం. మానవహక్కులని, వ్యక్తి స్వేచ్ఛని పరిరక్షించే న్యాయమూర్తి ఇలా అనడం బాధ కలిగించే విషయం. నిరాశ్రయులను, పేదలను రక్షించడం రాజ్యాంగ బాధ్యత అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

వ్యాఖ్యలు వివాదాస్పదం

సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్​ గతంలో కూడా ఉచితాల గురించి ఇలాంటి వ్యాఖ్యలను చేశారు. జనవరి 7న జిల్లా కోర్టుల న్యాయమూర్తుల జీతభత్యాల కేసును విచారిస్తూ న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘ఏమీ పనిచేయని వ్యక్తులకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయి. ఎన్నికలు రాగానే లాడ్లీ బెహన్​ లాంటి కొత్త పథకాలను ప్రకటించి స్థిర మొత్తాలను ఇవ్వడానికి డబ్బులు ఉంటాయన్నారు. తీర్పుల సంబంధం ఉన్న వ్యాఖ్యలు, సంబంధం లేని వ్యాఖ్యలు చాలాసార్లు చర్చనీయాంశాలు అవుతాయి.ఈ విషయాలను న్యాయమూర్తులు గుర్తుంచుకోవాలి. వ్యాఖ్యలను వెబ్​జర్నల్స్​ యధాతథంగా ప్రచురిస్తున్నాయి. వ్యాఖ్యలు వివాదాస్పదం అయినప్పుడు సాంఘిక మాధ్యమాల్లో చర్చ ఎక్కువగా జరుగుతుంది.  కొన్ని మౌఖిక వ్యాఖ్యలు ఉత్తర్వుల్లో చోటు చేసుకోవు. న్యాయమూర్తుల మీద విమర్శలు కొనసాగుతాయి. వారు రాజీనామా చేయాలనేంతవరకు చర్చలు జరుగుతున్నాయి. 

 వ్యాఖ్యలను చట్టపరమైనవిగా భావించడానికి వీల్లేదు

సాంఘిక మాధ్యమాల్లో న్యాయమూర్తులు మీద జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పార్దివాలా ఇలా అన్నారు. ‘చట్టం ఏం చెబుతుందో అనేదానికన్నా మీడియా ఎమనుకుంటుందో అని ఆలోచించాల్సిన ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.  దీనివల్ల  న్యాయస్థానాల  పవిత్రత కోల్పోతున్నది.  న్యాయపాలనకు భంగం వాటిల్లుతోంది.  డిజిటల్, సాంఘిక మాధ్యమాలను రెగ్యులేట్​ చేయాల్సిన అవసరం ఉంది’.  కేసు విచారణ సమయంలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా,  స్వతంత్రంగా వెలిబుచ్చడం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వైవీ చంద్రచూడ్,  ఎంఆర్​ షాలతో కూడిన బెంచ్​ సమర్థించింది. ఇటువంటి సంభాషణ, అలాగే దాన్ని రిపోర్టు చేయడం న్యాయ ప్రక్రియలో ముఖ్యమైన అంశాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలను చట్టపరమైనవిగా భావించడానికి వీల్లేదు. కోర్టు ఇచ్చే తుది తీర్పుకు కట్టుబడి ఉండే కోర్టు నిర్ణయాలే ఆమోదయోగ్యం అవుతాయి.  న్యాయమూర్తుల అభిప్రాయాలు వెలిబుచ్చినంత మాత్రాన అవి పాలనీయం కాదు. వాళ్ల అభిప్రాయాలను సరిచేసేవిధంగా న్యాయవాదులు తమ వాదనలకు పదును పెట్టే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే జస్టిస్​ గవాయ్​ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలి. 

ఉచితాలు ప్రతికూలం కాదు

ఉచితాలు ఎల్లప్పుడూ ప్రతికూల పాత్రను పోషించవు. అవి దిగువశ్రేణి  ప్రజలను కొంతపైకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉన్నత విద్య, మెరుగైన అవకాశాలను పొందడానికి వారికి సహాయపడవచ్చు. కొన్నిసార్లు ఉచితాలు సంక్షేమ పథకాలకి పునాదులుగా మారతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ప్రవేశపెట్టిన రూ.2 కిలోబియ్యం పథకం జాతీయ ఆహార భద్రతా మిషన్​ ఏర్పాటుకు నాంది పలికింది.  తెలంగాణ,  ఒడిశాలో ఏర్పాటు చేసిన రైతు సంక్షేమ పథకాలు ప్రధాన మంత్రి కిసాన్​ యోజనకు దారితీశాయి.  ఆర్థిక స్తోమత లేనివారి కోసం సైకిళ్లు, వాహనాలు, ల్యాప్​టాప్​లు సరఫరా వారి అభివృద్ధికి దోహదపడవచ్చు. 

కనిపించని ఉచితాలెన్నో..

ఈ ఉచితాల వల్ల ఏర్పడే ద్రవ్యలోటు గురించి రిజర్వు బ్యాంక్​ హెచ్చరిక చేసింది. ఉచితాలను ప్రకటించే ముందు దీన్ని ప్రభుత్వాలు 
పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్నికల్లో లబ్ధి కోసం పార్టీలు ‘అనుచితాలు’ను ప్రకటించి అమలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయి. సంక్షేమ రాజకీయాలు చట్టబద్ధమైనవే. అయితే, సంక్షేమ చర్యలు, అనారోగ్యకరమైన ఉచితాల మధ్య రేఖ సన్నగా మారింది. కనిపించే ఉచితాలు కొన్ని, కనిపించని ఉచితాలు మరెన్నో, అవి విశేషమైన హక్కులు ( ప్రివిలైజెస్) ఉన్న వ్యక్తులకు ఉంటాయి.  వీటిని అందరూ గమనించాలి. మరీ ముఖ్యంగా న్యాయమూర్తులు.  ప్ర్తత్యేక సౌకర్యాలు, స్టేట్​ గెస్ట్​ ఫెసిలిటీస్ లాంటివి ఎన్నో ఉన్నాయి.

- డా. మంగారి రాజేందర్
పూర్వ డైరెక్టర్​, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్​ అకాడమీ