ఇతరులను కాంగ్రెస్​ చీఫ్​గా గాంధీలు నెగులనిస్తరా ?

కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం బాగా ఉండేది. కాంగ్రెస్​పార్టీకి గుండెకాయలాంటి మహాత్మాగాంధీ కూడా పార్టీ సంస్థాగత, అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమి చవిచూశారు. పార్టీ చరిత్రలో రెండు సార్లు జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రముఖంగా కనిపిస్తాయి. 1939లో మహాత్మా గాంధీ తెలుగు వ్యక్తి అయిన పట్టాభి సీతారామయ్యను అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించారు. సుభాష్​చంద్రబోస్​కు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన సీతారామయ్య బోస్​చేతిలో ఓడిపోయారు. సుభాష్​చంద్రబోస్​కు1580 ఓట్లు రాగా, గాంధీ ప్రతిపాదించిన పట్టాభి సీతారామయ్యకు1375 ఓట్లు మాత్రమే వచ్చాయి.  మరో ఎన్నికలోనూ ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. 1950లో నెహ్రూ కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో పీడీ టాండన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి, ఆచార్య కృపలానీకి మద్దతు ఇచ్చారు. టాండన్ గెలిస్తే రాజీనామా చేస్తానని నెహ్రూ బెదిరించినప్పటికీ, టాండన్ కృపలానీని ఓడించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో గాంధీ, నెహ్రూ లాంటి గొప్ప వ్యక్తులు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కూడా ఓడిపోయేంత అంతర్గత ప్రజాస్వామ్యం ఒకప్పుడు పరిఢవిల్లిందని చెప్పడానికి ఈ రెండు ఘటనలే ఉదాహరణలు. ఇప్పుడు కాంగ్రెస్​పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్17న జరగనున్నాయి. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఆసక్తిగా మారింది. 

9000 మంది ఓటర్లు

కాంగ్రెస్​అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దేశంలో దాదాపు 9000 మంది ప్రతినిధులు(ఓటర్లు) ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే సెగ్మెంట్​నుంచి ఇద్దరు ప్రతినిధుల(రెండు ఓట్ల)కు అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో 1125 మంది ఎమ్మెల్యేలు, 191 మంది ఎంపీలు ఉన్నారు.  పై రాష్ట్రాల్లో నిజానికి కాంగ్రెస్​ ఉనికిలో లేనప్పటికీ ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే స్థానాల సంఖ్యను బట్టి దాదాపు3000 మంది ప్రతినిధులు వచ్చే నెలలో జరిగే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనవచ్చు. తాజాగా సినీ నటుడు చిరంజీవికి కూడా ప్రతినిధిగా ఓటు వేసేందుకు కార్డు వచ్చింది. ఇంతకు ముందెప్పుడు ఆయన ప్రతినిధిగా ఓటు వేయలేదు. సంస్థాగత వ్యవహారాల్లో అంత క్రియాశీలంగా లేని ఆయనకే ఆశ్చర్యం కలిగించేలా ప్రాతినిధ్యం లభించిందంటే.. ఎక్కడో మారుమూల నిశ్శబ్దపు గదుల్లో ప్రతినిధుల జాబితాలు రూపొందాయని తేటతెల్లం అవుతున్నది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే జాబితాలో గాంధీలదే ఆధిపత్యం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ ఓట్లలో 95 శాతం గాంధీల మెప్పు పొందిన అభ్యర్థికి పడతాయి. 2000 సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్​లీడర్​జితేంద్ర ప్రసాద్​సోనియా గాంధీపై పోటీకి తలపడ్డారు. సోనియాకు 7,542 ఓట్లు రాగా, ప్రసాద్​కు కేవలం 94 మంది ఓటు వేశారు. ఆ ఎన్నికలో సోనియా విజయం సాధించారు. ఆమె విజయంపై స్పందించిన ప్రసాద్ ‘మ్యాచ్​ ఫిక్సింగ్​జరిగింది’ అని ఆరోపించారు.

గత అనుభవాలు..

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ చెప్పలేదు. అన్ని ఎన్నికల్లో ఓడిపోతుండటం వల్ల దేశవ్యాప్తంగా ఒత్తిడి రావడంతో గాంధీకుటుంబేతరులైన మరో వ్యక్తికి అధ్యక్ష పదవి అనే అంశం తెరమీదకు వచ్చింది. విపక్షాల ఐక్యత చర్చనీయాంశమవుతున్న తరుణంలో మమతా బెనర్జీ, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని నాయకుడిగా అంగీకరించరని గాంధీలకు కూడా తెలుసు. అయితే 2024లో నరేంద్ర మోడీని ఓడించడం వారికి చాలా ముఖ్యం. కాంగ్రెస్ నాయకత్వాన్ని మరొకరికి ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాలు ఏకం కావచ్చు. బయటి వ్యక్తి కాంగ్రెస్​అధ్యక్షుడిగా ఎన్నికై, తమతో విరోధంగా మారితే తాము కాంగ్రెస్​నుంచి బయటకు రాక తప్పదని గాంధీలకు తెలుసు. అందుకే వారు పదవిని అంత తేలిగ్గా వదులుకుంటారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. 1996లో కాంగ్రెస్​అధ్యక్షుడిగా ఉన్న పీవీ కొన్ని ఆరోపణలతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో సీతారాం కేసరి అధ్యక్షుడు అయితే తనకు విశ్వాసపాత్రుడిగా ఉంటాడని, భావించి ఆయన పేరును ప్రతిపాదించాడు. సీతారం కేసరి కాంగ్రెస్‌ అధ్యక్షుడైన 24 గంటల్లోనే పీవీ నరసింహారావుకు ఊహించని షాక్​ఇచ్చాడు. అప్పటికే అధ్యక్షుడిగా రాజీనామా చేసిన పీవీని ప్రతిపక్ష నేత పదవికి కూడా రిజైన్​చేయాలని డిమాండ్‌ చేశారు. నరసింహారావు రాజకీయం అంతటితో ముగిసింది. కేసరి లాంటి బలహీనమైన నాయకుడు, విధేయుడని భావించిన వ్యక్తిని ప్రతిపాదిస్తేనే పీవీకి ఆ దుస్థితి ఎదురైంది. బలమైన వ్యక్తిని అధ్యక్షుడిని చేస్తే తమకు తప్పక ఎదురు తిరుగుతారని గాంధీలకు తెలుసు. అందుకే శశి థరూర్ లాంటి శక్తిమంతమైన నేత అధ్యక్షుడిగా ఎంత వరకు గెలవగలరనేది సందేహమే!.

ఇప్పుడు కాంగ్రెస్​ అభ్యర్థులెవరు?

కాంగ్రెస్​అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు పార్టీ సీనియర్​ నేతలు శశిథరూర్, ఆశోక్​ గెహ్లాట్​సిద్ధమవుతున్నారు. మరో సీనియర్​నేత దిగ్విజయ్​ సింగ్​పేరు తెరమీదకు వచ్చినా.. పోటీలో తాను లేనని, పార్టీ అధిష్టానం తనకు ఇచ్చిన సూచనలను పాటిస్తానని స్పష్టం చేశారు. సెప్టెంబరు 24 నుంచి 30 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. అక్టోబరు 1న నామినేషన్ల పరిశీలన, 8 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్, 19న ఫలితాలు రానున్నాయి. 1998 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగుతుండటం ఇదే మొదటిసారి. 1998లో జరిగిన ఎన్నికల్లో సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2000 నుంచి సోనియా గాంధీ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు. మధ్యలో రాహుల్ ఆ పదవిని చేపట్టినా.. 2019 ఎన్నికల తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో కేరళ ఎంపి అయిన శశిథరూర్​బలమైన అభ్యర్థి. దేశంలో పాపులర్​వ్యక్తి, సోషల్​మీడియాలో ఫాలోయింగ్​బాగా ఉన్న నేత. దాదాపు 20 ఏండ్ల క్రితం ఆయన భారత ప్రభుత్వ మద్దతుతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు పోటీ చేసి ఓడిపోయారు. ఇంత బలమైన వ్యక్తి అయినప్పటికీ, గాంధీయేతర అభ్యర్థి కాబట్టి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించగలుగుతారా? అనేది చెప్పలేం. గాంధీలు ఆయనను అధ్యక్షుడిగా ఒప్పుకోకపోవచ్చు.

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ ​ఎనలిస్ట్